మంత్రి పదవికి కేజ్రీవాల్ సిఫార్సు
న్యూఢిల్లీ: ఒక మతమార్పిడి కార్యక్రమంలో పాల్గొన్నారన్న వివాదంపై మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజేంద్ర పాల్ గౌతమ్ స్థానంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పదవికి రాజ్ కుమార్ ఆనంద్ పేరును లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం సిఫార్సు చేశారు. ఢిల్లీ డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిషన్(డిడిసిడి) గత ఏడేళ్లలో సాధించిన విజయాలను బుధవారం విలేకరుల సమావేశంలో వివరిస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీలోని పటేల్ నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్‌కుమార్ ఆనంద్ పేరును మంత్రి పదవికి సిఫార్సు చేసినట్లు తెలిపారు. గడచిన ఏడేళ్లలో డిడిసిడి అద్భుతమైన పనితీరును ప్రదర్శించిందని, కరోనా కాలంలో ఆ సంస్థ చేసిన సేవలు ఎంతో విలువైనవని కేజ్రీవాల్ ఈ సందర్భంగా చెప్పారు. డిడిసిడి వైస్ చైర్‌పర్సన్ జన్మన్ షాకు ఢిల్లీ ప్రభుత్వ ప్రణాళిక శాఖ షోకాజు నోటీసు ఇవ్వడం తప్పడు చర్యగా ఆయన అభివర్ణించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జస్మిన్ షాకు షోకాజ్ నోటీసు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. గుజరాత్‌లో తమ పార్టీ ప్రతిష్ట పెరుగుతున్నందుకే ఢిల్లీ ప్రభుత్వంపై బిజెపి ఈ రకమైన చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.