Friday, November 22, 2024

మునుగోడు ఉప ఎన్నిక.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

Munugode bypoll: Komatireddy Venkat Reddy Sensational Comments 

మునుగోడులో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు
నేను ప్రచారం చేసిన లాభం లేదు
పాదయాత్ర చేద్దామనుకున్నా..
కానీ కాంగ్రెస్‌లో ఒక్కొక్కరిది ఒక్కొక్క గ్రూప్
కాంగ్రెస్ పార్టీ ఫైనాన్షియల్‌గా వీక్..
తాను ప్రచారానికి వెళ్తే డబ్బులు ఎవరు పెట్టాలి?
25 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా.. ఇక చాలు..
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్థానిక ఎంపి, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యహారం ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. బిజెపి నుంచి తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలవడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయనకు మద్దతుగా నిలిచేందుకే కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడం లేదని ఆ పార్టీలోని ఓ వర్గం పేర్కొంటుంది. ఇప్పటికే ఆయన ఫోన్ కాల్ ఆడియో లీకేజ్, ఆస్ట్రేలియా పర్యటన కూడా ఆ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో మరింత కలకలం రేపుతున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అభిమానులతో మాట్లాడుతూ మునుగోడులో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. తాను మునుగోడులో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినా ఉపయోగం ఉండదన్నారు. మహా అయితే 10 వేల ఓట్లు వస్తాయని ఆయన అన్నారు. ఓడిపోయే పార్టీకి ప్రచారం చేయడమెందుకు? అని ప్రశ్నించారు.

రెండు అధికార పార్టీలు కొట్లాడుతున్నప్పుడు మనమేం చేయగలమన్నారు. పాదయాత్ర చేద్దామని అనుకున్నానని, కానీ కాంగ్రెస్‌లో ఒక్కొక్కరిది ఒక్కొక్క గ్రూప్ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఫైనాన్సియల్ గా చాలా బలహీనంగా ఉందని, తాను ప్రచారానికి వెళ్తే డబ్బులు ఎవరు పెట్టాలని ప్రశ్నించారు. 25 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని, ఇక చాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నన్నారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానాన్ని కోరుతుంది. ఇక, కాంగ్రెస్‌లో గత రెండు రోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణా నుంచి కాంగ్రెస్ పార్టీని పెకిలించివేయడానికి బిజెపి, టిఆర్‌ఎస్ కలిసి కుట్ర పన్నుతున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్‌ను పార్టీని రక్షించుకోవాలని రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాతి రోజే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిదిగా చెబుతున్న ఆడియో లీక్ అయింది. ఆ ఆడియోను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటివరకు ఖండించలేదు. ఇక, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీభవన్‌లో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంకట్ రెడ్డిని ‘ద్రోహి’ అంటూ నినాదాలు చేశారు. వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా వెంకట్ రెడ్డి వ్యవహారశైలిపై పార్టీ సమావేశంలో చర్చిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. ఇదిలా ఉంటే.. వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ విహార యాత్రకు వెళ్లారు. ఆస్ట్రేలియాకు పర్యటిస్తున్న ఆయన మునుగోడు ఉప ఎన్నికలకు ఒకరోజు ముందుగా అంటే నవంబర్ 2న తిరిగి వస్తారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్‌కు నష్టం కలిగించే ఆలోచన ఉంటే మొహమాటం లేకుండా వెళ్లిపోవచ్చు: జైరామ్ రమేష్
కాంగ్రెస్‌కు నష్టం కలిగించే ఆలోచన ఉంటే మొహమాటం లేకుండా పార్టీలో నుంచి వెళ్లిపోవచ్చని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు. మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ వాషింగ్ మిషన్‌లో జాయిన్ అయ్యి.. కాంట్రాక్టులు తెచ్చుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ మూలంగా రాష్ట్రంలోని ఆర్థిక వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని విమర్శించారు. కేసీఆర్ ఎనిమిదో నిజాం అని, మోదీ ఔరంగజేబు అని విమర్శించారు.
జీహెచ్‌ఎంసీలో బీజేపీ బలంగా ఉందని.. అయితే ఆ పార్టీ కొందరు నేతలను కొనుగోలు చేసి కొన్ని ఉప ఎన్నికల్లో గెలిచిందని జైరామ్ రమేష్ ఆరోపించారు. బీజేపీకి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్యనే పోటీ ఉంటుందన్నారు. తెలంగాణలో 11 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగుతుందన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీలో వచ్చినట్టుగానే.. తెలంగాణలో కూడా రాహుల్ యాత్రకు విశేష స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ తెలుగు న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ జైరాం రమేష్ ఈ కామెంట్స్ చేశారు. ఇక, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం కోసం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. ఆదివారం (అక్టోబర్ 7) తెలంగాణలోకి ప్రవేశించనుంది. నవంబర్ 7 వరకు రాష్ట్రంలో రాహుల్ యాత్ర సాగనుంది. అయితే దీపావళి సందర్భంగా అక్టోబర్ 24,25 తేదీల్లో, కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతల స్వీకరణ సందర్భంగా అక్టోబర్ 26వ తేదీన రాహుల్ పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. భారత్ జోడో యాత్ర నవంబర్ 1 న శంషాబాద్ మీదుగా హైదరాబాద్‌లోకి ప్రవేశించనుంది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం ఎఐసిసి చూసుకుంటుంది: ఉత్తమ్
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం ఎఐసిసి చూసుకుంటుందని ఆ పార్టీ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలను కూడా ఎఐసిసి చూసుకుంటుందన్నారు. ఎలాంటి వివాదస్పద విషయాలను తాను మాట్లాడుదలచుకోవడం లేదన్నారు. ఆ అధికారం కూడా తనకు లేదన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎనిమిదిన్నర ఏళ్లుగా బిజెపి, టీఆర్‌ఎస్‌లు ప్రజలకు చేసిందేమి లేదన్నారు. రెండు పార్టీలు ఎంత ప్రలోభ పెట్టిన మునుగోడు ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని అన్నారు. పాల్వాయి స్రవంతికి ఒక్క అవకాశం ఇవ్వమని తాము కోరుతున్నామని చెప్పారు. ప్రజల్లో ఆమె నిర్వహిస్తున్న ప్రచారానికి విశేష స్పందన వస్తుందన్నారు.
సొంత అన్నగా భావించాను
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైఖరి బాధ కలిగిస్తోంది: పాల్వాయి స్రవంతి
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైఖరి బాధ కలిగిస్తోందని మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైఖరి బాధ కలిగిస్తోందని మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాను సొంత అన్నగా భావించానని చెప్పారు. ప్రచారానికి రావాలని వేడుకున్నట్టుగా తెలిపారు. ఆడబిడ్డగా మును గోడులో ఒంటరి పోరాటం చేస్తున్నాని చెప్పారు. మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక, మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తనను ప్రకటించిన అనంతరం పాల్వాయి స్రవంతి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి తన తరఫున ప్రచారం చేయాల్సిందిగా కోరారు. ఆ సమయంలో స్రవంతి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి వస్తానని చెప్పారని అన్నారు. ఇటీవల కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని స్రవంతి కలిశారు. మునుగోడులో కాంగ్రెస్ తరఫున ప్రచారానికి రావాల్సిందిగా కోరారు. మునుగోడు ప్రచా రానికి వచ్చే విషయమై ఆలోచిస్తానని వెంకట్ రెడ్డి తనకు చెప్పారని స్రవంతి ఇటీవలనే మీడియాకు చెప్పారు. స్రవంతి తల మీద కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేయి పెట్టి ఆశీర్వదిస్తున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Munugode bypoll: Komatireddy Venkat Reddy Sensational Comments 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News