నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్
మధ్యంతర బెయిల్ 10 దాకా పొడిగింపు
అప్పుడు రెగ్యులర్ బెయిల్‌పై విచారిస్తామన్న కోర్టు
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మరింత ఊరట లభించింద. ఈ కేసులో ఆమెకు మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను ఢిల్లీ కోర్ట్లు నవంబర్ 10 వరకు పొడిగించింది. కాగా ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం జాక్వెలిన్ దరఖాస్తు చేసుకోగా .. ఢిల్లీ కోర్టు దానిపై శనివారం విచారణ చేపట్టింది. ఈ విచారణ నిమిత్తం ఆమె కోర్టుకు వచ్చింది. కాగా, ఆమె రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఇడి) వ్యతిరేకిస్తూ, దర్యాప్తు సమయంలో జాక్వెలిన్ తన మొబైల్ ఫోన్‌లోంచి డేటాను తొలగించడం ద్వారా సాక్షాలను మాయం చేయడానికి ప్రయత్నించిందని తన అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొంది. అంతేకాదు, ఆమె దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నించిందని, అయితే లుక్‌ఔట్ సర్కులర్‌లో ఆమె పేరు ఉండడంతో ఆ పని చేయలేకపోయిందని కూడా ఇడి పేర్కొంది. కాగా ఇడినుంచి తమకు ఎలాంటి డాక్యుమెంట్లు అందలేదని జాక్వెలిన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో కేసుకు సంబంధించిన చార్జిషీట్‌ను, ఇతర పత్రాలను అన్ని పక్షాలకు అందజేయాలని న్యాయస్థానం ఇడికి సూచించింది. అనంతరం రెగ్యులర్ బెయిల్ దరఖాస్తుపై విచారణను నవంబర్ 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అప్పటివరకు నటి మధ్యంతర బెయిల్ కొనసాగుతుందని తెలిపింది.
Jacqueline Fernandez gets Interim Bail