పార్టీ సెంట్రల్ కమిటీకి మరోసారి ఎన్నిక
ప్రధాన కార్యదర్శి ఎన్నిక ఇక లాంఛనమే
సెంట్రల్ కమిటీలో విధేయులకే పెద్దపీఠ
మాజీ ప్రధాని లీకి ఝలక్.. పదవి నుంచి తొలగింపు
అధ్యక్షుడు హు జింటావోకు అవమానం
బీజింగ్: తన స్థానం మరింత కలకాలం పదిలం చేసుకుని, తనకు నచ్చని వారిని పక్కన పెట్టి చైనా అధినేత జిన్‌పింగ్ మరింత శక్తివంతులు కానున్నారు. చైనాలో అత్యంత శక్తివంతమైన అధికార కమ్యూనిస్టు పార్టీ (సిపిసి)లో కీలకమైన సెంట్రల్ కమిటీకి జి జిన్‌పింగ్ శనివారం ఎన్నికయ్యారు. కమిటీ కార్యవర్గంలో ఈసారి భారీ ప్రక్షాళన జరిగింది. ప్రధాని లీ కిక్వియాంగ్ సహా అనేక మంది ప్రముఖ నేతల పేర్లు కమిటీలో చోటుచేసుకోలేదు. ఐదేళ్ల కోసారి జరిగే కమ్యూనిస్టు పార్టీ మహాసభలు వారం రోజుల పాటు జరిగి శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా 205 మంది రెగ్యులర్ సెంట్రల్ కమిటీ సభ్యులు, 171 మంది ప్రత్యామ్నాయ సభ్యుల ఎన్నిక జరిగింది. ఇదంతా కూడా జిన్‌పింగ్‌ను మరోమారు దేశాధ్యక్షులుగా, పార్టీ అధినేతగా నిలిపేందుకు జరిగిన తతంగానే సాగింది. 69 సంవత్సరాల జిన్‌పింగ్ సెంట్రల్ కమిటీకి ఎన్నికయ్యారని సెంట్రల్ కమిటీ ఇక ఆదివారం భేటీ అయ్యి, పాతిక మందితో కూడిన పొలిటికల్ బ్యూరోను ఎన్నుకుంటుందని పార్టీ వర్గాలు శనివారం తెలిపాయి. ఈ బ్యూరో తమ భేటీలో ఏడుగురు లేదా అంతకు మించిన సంఖ్యలో సభ్యులను స్థాయీ సంఘానికి ఎంపిక చేసుకుంటుంది.
ఈ కమిటీనే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపికలో ప్రధాన భూమిక వహిస్తుంది. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయిన వారే పార్టీకి నేతగా తద్వారా దేశ సారథిగా వ్యవహరిస్తారు. సెంట్రల్ కమిటీకి మరో దఫా ఎన్నిక కావడం తన ప్రత్యర్థులెవ్వరికి కమిటీలో చోటు లేకుండా చూసుకోవడం ద్వారా జిన్‌పింగ్ మరో సారి మరింత బలంగా పార్టీ పగ్గాలు దేశ సారధ్య బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడైంది. పార్టీలో జి పట్ల వ్యతిరేకత అలుముకుందని, ఓ దశలో ఆయనను గృహనిర్బంధంలో ఉంచారని, సైన్యం పగ్గాలకు దారితీసిందనే సంచలన వార్తలు వెలువడ్డా అవి తరువాత సద్దుమణిగాయి. ఇప్పుడు పార్టీలో భారీ స్థాయి మార్పులతో వ్యతిరేకతను చల్లార్చాలని జిన్‌పింగ్ పావులు కదిపినట్లు స్పష్టం అయింది. ఆదివారం (నేడు) జరిగే స్టాండింగ్ కమిటీ ఎన్నికలో జిన్‌పింగ్‌ను రికార్డు స్థాయిలో మూడోసారి అధినేతగా ఎన్నుకుంటారని, ఈ క్రమంలో ఆయన జీవితకాల దేశాధినేతగా తిరుగులేకుండా ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటికే సెంట్రల్ కమిటీలో అత్యధిక సంఖ్యలో ఆయన సన్నిహితులు, విధేయులు చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు కమిటీలో పేర్లు దక్కని వారిలో ప్రధాని లి, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ లి జాంషూ, వాంగ్‌యాంగ్, ఉప ప్రధాని జెంగ్ వంటి వారు ఉన్నారు.
వీరి పేర్లు కమిటీలో లేకపోవడం కొట్టొచ్చిన పరిణామం అయింది. ఇంతకు ముందటి స్టాండింగ్ కమిటీలో ఉన్న ఏడుగురు ప్రముఖ నేతలకు ఈసారి చోటు లేకపోవడం కీలకం అయింది. లీ, వాంగ్‌లనుదేశంలో మితవాదులుగా పిలుస్తారు. వీరే దేశ ఆర్థిక వ్యవస్థను పది సంవత్సరాలుగా నడిపిస్తున్నారు. ఆర్థిక నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇక విదేశాంగ మంత్రి, స్టేట్ కౌన్సిలర్ వాంగ్ యీ సెంట్రల్ కమిటీ సభ్యులు అయ్యారు. మాజీ విదేశాంగ మంత్రి యాంగ్ జియిచీని కమిటీ నుంచి తీసేశారు. ఆదివారం స్టాండింగ్ కమిటీ భేటీ తరువాత జి ఆయన కొత్త బృందం మీడియా సమావేశంలో పాల్గొంటుంది. తీవ్రస్థాయి ఆంక్షల కొవిడ్ క్వారంటైన్ నడుమ ఓ హోటల్‌లో ఉంచిన మీడియాతో ఈ నేతలు మాట్లాడుతారు. జిన్‌పింగ్ దేశ శాశ్వత నేత అయ్యే విషయాన్ని మీడియాకు ఈ సందర్భంగా తెలియచేస్తారని స్పష్టం అయింది. ఈ ఏడాదితో జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చి పదవ సంవత్సరాలు అయింది. మరోసారి ఐదేళ్లకు కూడా ఆయన వయస్సు పరిమితులు లేకుండా పగ్గాలు తీసుకోవడం ద్వారా మావో లాగా జీవితాంతపు దేశ్‌కీ నేత అయ్యేందుకు వీలుంది.
Xi Jinping to become third time as China President