ప్రధానిగా లీ కియాంగ్
పార్టీ స్టాండింగ్ కమిటీలో పలువురు కీలక నేతలకు స్థానం కరవు
బీజింగ్: చైనా అధ్యక్షుడు, పార్టీ జనరల్ సెక్రటరీగా జీ జిన్‌పింగ్ మూడో సారి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆదివారం మీడియా సమావేశంలో ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు. అలాగే సరికొత్త ప్రీమియర్( ప్రధాని)ను ఎన్నుకున్నారు. షాంఘైలో చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పని చేసిన లీ కియాంగ్‌ను ఈ పదవికి ఎంపిక చేశారు. జిన్‌పింగ్ మీడియా సమావేశంలో కియాంగ్ పేరును ప్రకటించారు.దీంతో పాటు పార్టీ పొలిట్‌బ్యూరో…స్టాండింగ్ కమిటీ సభ్యుల పేర్లను కూడా ఆయన ప్రకటించారు. ఏడుగురు సభ్యులుండే ఈ కమిటీలో జిన్‌పింగ్, కియాంగ్‌లతో పాటుగా ఝావో లిజి, వాంగ్ హునింగ్, కాయి క్వి, డింగ్ షూషాంగ్, లీజిలకు స్థానం కల్పించారు. జిన్‌పింగ్ సన్నిహితులగా భావిస్తున్న ఝావో, వాంగ్ ఇద్దరు కూడా గత కమిటీలో కూడా సభ్యులుగా ఉన్నారు.
ఈ మీడియా సమావేశంలో జిన్‌పిగ్ మాట్లాడుతూ శనివారం పార్టీ సమావేశాలను విజయవంతంగా ముగించామన్నారు. సార్టీ పతాకాన్ని అత్యున్నత స్థానంలో ఉంచామని, పార్టీని భవిష్యత్తులోమరింత సమష్టిగా నడపడానికి బలాలను సమ్మిళితం చేశామన్నారు. అంతర్జాతీయ సమాజం తమ పార్టీ సమావేశాలను ఆసక్తిగా గమనిస్తోందన్నారు. ‘ ప్రపంచం లేకుండా చైనా అభివృద్ధి సాధించలేదు. అలాగే ప్రపంచానికి చైనా అవసరం. సంస్కరణ వైపు 40 ఏళ్ల పాటు సాగించిన పోరాటంలో రెండు అద్భుతాలను సాధించాం.అవి వేగవంతమైన ఆర్థికాభివృద్ధి, దీర్ఘకాలిక సామాజిక స్థిరత్వం. మా పార్టీ, ప్రజల నమ్మకాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకునేలా విధులు నిర్వర్తిస్తూ ముందుకు సాగుతాం’ అని పేర్కొన్నారు.
ఎవరీ లీ కియాంగ్..?
63 ఏళ్ల లీ కియాంగ్ సిపిపి షాంఘై విభాగం కార్యదర్శి. జీ జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరుంది. ఆయన ఈ ఏడాది షాంఘైలో అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌ను విధించారు. గతంలో ఝిజియాంగ్ ప్రావియన్స్‌లో జిన్‌పింగ్‌తో కలిసి పని చేశారు.ప్రస్తుతం పార్టీలో జిన్‌పింగ్ తర్వాత స్థానంలోకి కియాంగ్ చేరుకున్నారు. కాగా కొన్నేళ్లుగా అత్యున్నత స్థాయి స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న నలుగురు కీలక నేతలు తిరిగి ఎన్నికయ్యే అవకాశాన్ని కోల్పోయారు. వీరిలో ప్రధానమంత్రి లీ కెకియాంగ్(67), నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ లీ ఝాన్సు(72),చైనీస్ పీపుల్స్‌పొలిటికల్ కన్సల్టేటివ్‌కాన్ఫరెన్స్ చైర్మన్ వాంగ్‌యాంగ్(67),ఉపప్రధాని హాన్జెంగ్(68) ఉన్నారు. కేంద్ర కమిటీకి ఎన్నుకోకపోవడంతో వీరికి పోలిట్ బ్యూరోలో, స్టాండింగ్ కమిటీలో స్థానం దక్కలేదు. ప్రస్తుత ప్రభుత్వ హోదాలనుంచి కూడా తప్పుకోవలసి ఉంటుంది. అంటే ఇప్పటివరకు దేశ పాలనా వ్యవహారాల్లో కీలకమైన సీనియర్లలో అత్యధికులను జిన్‌పింగ్ పథకం ప్రకారం పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది.