మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడులో ఉప ఎన్నికలు కొనసాగుతున్న వేళ అడ్డూ, అదుపు లేని విధంగా ఓ వైపు హవాలా మార్గంలో.. మరోవైపు అధికారుల వాహన తనిఖీల్లో భారీ స్థాయిలో నగదు పోలీసులు, ఎన్నికల అధికారులకు చిక్కుతోంది. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలుగా భావిస్తున్న లిక్కర్, ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు, ఎన్నికల అధికారులు రంగంలోకి దిగి నియంత్రణా చర్యలను చేపడుతున్నారు. వాహన తనిఖీలతో పాటు హవాలా మార్గంలో నగదు తరలింపుపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటివరకూ మొత్తంగా రూ.15 కోట్ల నగదును పోలీసులు, అధికారులు సీజ్ చేశారు. మునుగోడు ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో ఈ స్థాయిలో నగదు పట్టుబడుతుంటే పోలింగ్ గడువు సమీపించే సరికి ఏ స్థాయిలో నగదు పట్టుబడుతుందో? నన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
వివరాల్లోకి వెళితే.. నగరంలోని కోఠిలో రూ. 63.50 లక్షలను ఆదివారం పోలీసులు సీజ్ చేశారు. ఈ నగదును తరలిస్తున్న కాంతిలాల్, కిషోర్‌సింగ్, పెప్‌సింగ్, మొహమ్మద్ అబ్దుల్ ఫరీద్, సందీప్‌సింగ్‌లనే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఓ బైక్, ఐదు మొబైల్ ఫోన్‌లు, క్యాష్ కౌంటింగ్ మెషీన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్రూప్ బజార్‌లోని రానుజా మార్కెటింగ్ ఎలక్ట్రికల్ గోడౌన్‌లో హవాలా మార్గంలో నగదు తరలింపు కార్యక్రమం కొనసాగుతోందన్న విశ్వసనీయ సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నగదును తరలిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం ఉదయం కూడ రూ.10 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హవాలా మార్గంలో నగదును తరలిస్తున్న సమయంలో పోలీసులు సీజ్ చేశారు.
నగదును తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ లో ఇటీవల కాలంలో హవాలా రూపంలో నగదును తరలిస్తుండగా పలువురు పోలీసులకు పట్టబడ్డారు. ఈ నెల 11న హైద్రాబాద్ బంజారాహిల్స్ లో రూ. 2 కోట్ల విలువైన హవాలా నగదును పోలీసులు సీజ్ చేశారు. నాలుగు రోజుల వ్యవధిలో హైద్రాబాద్ లో రూ. 10 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. నగరానికి చెందిన వ్యాపారికి చెందిన నగదుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 10న హైద్రాబాద్ గాంధీ నగర్ లో భారీగా నగదును సీజ్ చేశారు. రూ. 3.5 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. వాహనాలను తనిఖీలు చేసే సమయంలో కారులో నగదును తరలిస్తుండగా పోలీసులు ఈ నగదును సీజ్ చేశారు.
ఈ నెల 7న జూబ్లీహిల్స్ లో రూ. 50లక్షలను హవాలా రూపంలో తరలిస్తున్న సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఈ నెల 8వ తేదీన పాతబస్తీలో రూ.79 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. ఈ నెల 9వ తేదీన హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లో రూ. 2.5 కోట్ల విలువైన నగదును పోలీసులు సీజ్ చేశారు. హవాలా రూపంలో నగదు తరలిస్తున్న సమయంలో పోలీసులు ఈ నగదును సీజ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 21న హైద్రాబాద్ నగరంలో సుమారు కోటికిపైగా నగదును పోలీసులు సీజ్ చేశారు. నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు నగదును తరలిస్తున్న కారుతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2020 సెప్టెంబర్ 15న రూ. 3.75 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈ నగదును తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హవాలా రూపంలో ఈ నగదును తరలిస్తున్న సమయంలో పోలీసులు సీజ్ చేశారు. 2020 అక్టోబర్ 31న హైద్రాబాద్ టాస్క్ పోర్స్ పోలీసులు రూ. 30 లక్షల నగదును సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు.