శ్రీలంకపై ఆస్ట్రేలియా గెలుపు
పెర్త్: ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా తొలి విజయం నమోదు చేసింది. మంగళవారం జరిగిన సూపర్12 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 16.3 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. మార్కస్ స్టోయినిస్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. శ్రీలంక బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా ప్రతి పరుగు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇక ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి విఫలమయ్యాడు. 11 పరుగులు మాత్రమే చేసి మహీశ్ తీక్షణ చేతికి చిక్కాడు. అయితే కెప్టెన్ అరోన్ ఫించ్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మిఛెల్ మార్ష్ ఒక ఫోర్, సిక్స్‌తో 17 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ధాటిగా ఆడిన గ్లెన్ మాక్స్‌వెల్ 12 బంతుల్లోనే రెండు ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులు చేసి చమిక కరుణరత్నె బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 89 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.
వీర విధ్వంసం
ఈ దశలో క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ పరుగుల వరద పారించాడు. ఆరంభం నుంచే వరుస ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు. అతన్ని కట్టడి చేయడంలో లంక బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. రికార్డు ఇన్నింగ్స్‌తో అలరించిన స్టోయినిస్ 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో టి20లో రెండో వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా స్టోయినిస్ రికార్డు సృష్టించాడు. భారత డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ప్రథమ స్థానంలో ఉన్నాడు. తాజాగా స్టోయినిస్ 17 బంతుల్లో ఈ రికార్డును అందుకుని రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఈ క్రమంలో స్టోయినిస్ తీక్షణ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో 3 సిక్సర్లతో 20 పరుగులు పిండుకున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన స్టోయినిస్ 18 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, మరో 4 ఫోర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఫించ్ అజేయగా 31 పరుగులు సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముంతు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిసాంకా (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధనంజయ డిసిల్వా 26 పరుగులు చేశాడు. ఇక దూకుడుగా ఆడిన అసలంక 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 38 పరుగులు సాధించాడు. కరుణరత్నె 14 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు.