మరో అల్పపీడనం.. రేపట్నుంచి మళ్లీ వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఈశాన్య రుతుపవనాల వర్షాలు త్వరలోనే మొదలు కానున్నాయి. నైరుతి రుతుపవనాలు దేశం నుంచి అటు నిష్కమించాయాలో లేదో వెనువెంటనే ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతోంది. ఈ నెల 29న ఈ శాన్య రుతుపవనాలు ఆగ్నేయ ద్వీపకల్ప భారత్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలో బంగాళాఖాతం మీద, దక్షిణ ద్వీపకల్ప భారత్ మీద ఈశాన్య గాలులు ఏర్పడే అవకాశం ఉందిని తెలిపింది. బుధవారం నాడు కిందిస్థాయి గాలులు ముఖ్యంగా ఈశాన్య ,తూర్పు దిశల నుండి తెలంగాణ రాష్ట్రంవైపు వీస్తున్నాయి. రాష్ట్రంలో మరో రెండు రోజులు పొడివాతావరణం ఉండే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
28న మరో వాయుగుడం:
సిత్రాంగ్ తుపాన్ బంగ్లాదేశం వైపుగా వెళ్లి టికోనా వద్ద తీరాన్ని దాటిపోయింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిత్రాంగ్ తుపాను కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చలివాతావరణం పెరుగుతూవస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ, రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా శ్రీలంక తమిళనాడు మధ్య మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా రూపుదాలుస్తోందని తెలిపింది. దీని ప్రభాంతో ఈ నెల 28న రాత్రి నుంచి ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది .