మఖ్తల్: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపడుతున్న భారత్ జోడో యాత్ర…తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత…మూడురోజుల విరామం అనంతరం నేడు మఖ్తల్ నుంచి తిరిగి పాదయాత్ర కొనసాగనుంది. దీపావళి పండుగతోపాటు మల్లిఖార్జున ఖర్గే ప్రమాణస్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీ…బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకుని అక్కడనుంచి మఖ్తల్ నియోజకర్గం గుడెబల్లూర్ వద్ద ఏర్పాటుచేసిన శిబిరంలో రాత్రి బస చేశారు. అనంతరం గురువారం ఉదయం 6 గంటలకు మఖ్తల్ వద్దకు చేరుకుని, మఖ్తల్ సబ్ స్టేషన్ నుంచి రాహుల్ జోడోయాత్రను ప్రారంభించనున్నారు. పాదయాత్రలో భాగంగా మఖ్తల్ పట్టణంలో ఉదయం 7 లోపు చేరుకుని, స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం తిరిగి మఖ్తల్ పట్టణ పురవీధులగుండా పాదయాత్ర కొనసాగనుంది. మఖ్తల్ అంబేద్కర్ చౌక్ లో కాసేపు ప్రజలనుద్దేశించి రాహుల్ ప్రసంగించే అవకాశముంది. ఆ తర్వాత మినీట్యాంక్ బండ్ వద్ద కాసేపు ఆగే అవకాశముంది. అక్కడనుంచి కాచ్ వార్ దాటిన తర్వాత బొందల్ కుంట వద్ద ఏర్పాటుచేసిన శిబిరంలో విశ్రాంతి తీసుకోనున్నారు. అక్కడే టిఫిన్ తోపాటు మధ్యాహ్న భోజనం చేయనున్నారు. ఈ మధ్యలో స్థానిక ప్రజలతోపాటు వివిద సంఘాలు, మేధావి వర్గాలతో రాహుల్ సమావేశమయ్యే అవకాశముంది. సాయంత్రం తిరిగి బొందల్ కుంట శిబిరం నుంచి పాదయాత్ర ప్రారంభమై…మరికల్ శివారులోని గున్ ముక్ల వద్ద రాత్రి బస చేయనున్నారు. ఈ మధ్యలో గుడిగండ్ల గ్రామం వద్ద రాహుల్ గాంధీ ప్రసంగించే అవకాశముంది. రాహుల్ పాదయాత్ర కోసం ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.
సుమారు 26 కిలోమీటర్లు కొనసాగనున్న పాదయాత్ర..
మఖ్తల్ సబ్ స్టేషన్ నుంచి దాదాపు మరికల్ శివారు వరకు సుమారు 26 కిలోమీటర్ల మేర గురువారం రోజు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. ఇప్పటికే జోడోయాత్ర రూట్ మ్యాప్ లో భాగంగా…పోలీసులు ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నారు. మరికల్ నుంచి వాహనాలను అమరచింతవైపుగా మళ్లించే అవకాశముంది. ఇక రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్దఎత్తున నియోజకవర్గంతోపాటు ఇతర పరిసర నియోజకర్గాల నుంచి కార్యకర్తలు తరలిరానున్నారు. దీనికితోడు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితోపాటు ఎంపిలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్దఎత్తున రాహుల్ వెంట నడిచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో రాహుల్ యాత్రకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎస్జీఎఫ్ బృందం అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నారు.