మునుగోడు ఉప ఎన్నికపై భారీగా బెట్టింగ్
భారీగా చేతులు మారనున్న కోట్ల రుపాయలు
ఉప ఎన్నికల ప్రచారంలో జెండాలు పట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్న నేతలు
యాదాద్రి భువనగిరి: మునుగోడు ఉప ఎన్నిక రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. అధికార టిఆర్‌ఎస్, ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీల నేతలు నువ్వా నేనా అన్నట్లు ప్రచారంతో జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక గెలుపుపై బెట్టింగ్ రాయుళ్లకు ముందే పండుగ వాతావరణం వచ్చింది. ఉప ఎన్నికల్లో భాగంగా టిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు బెట్టింగ్ రాయుళ్లకు కాసులు కురిపించనుంది. హోరాహోరీగా సాగుతున్న ఈ ఊప ఎన్నికల్లో పార్టీ, పార్టీల పై బెట్టింగ్ కాయడంతో కౌంటింగ్ అనంతరం రూ.కోట్లు చేతులు మారానున్నాయి. ఉప ఎన్నిక ప్రచారం చివరి స్థాయికి చేరుకున్న సందర్భంలో రూ.వెయ్యికి రూ.40 వేల చొప్పున బెట్టింగ్ జరుగుతుంది. మునుగోడు ఉప ఎన్నిక టిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈసారి అందరి దృష్టి మునుగోడు ఉప ఎన్నికపై పడింది. ఈ అవకాశాన్ని బుకీలు బాగా సొమ్ము చేసుకోనున్నారు. దాదాపు కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఉప ఎన్నిక గెలుపు కోసం ఆయ పార్టీల అభిమానులు ఎంతగా ఎదురుచూశారో.. బెట్టింగ్ నిర్వాహకులు అంత కంటే ఎక్కువే సన్నద్ధమయ్యారు.
పోలీసుల నిఘా నేపథ్యంలో నిర్వాహకులు ఎక్కువ మంది ఆఫ్‌లైన్ విధానానికి స్వస్తి పలికారు. బుకీలు, సబ్ బుకీలు, కలెక్షన్ ఏజెంట్లు అంతా గొలుసుకట్టు విధానంలో పనిచేస్తూ సొమ్ము చేసుకోనున్నారు. ఆసక్తి ఉండి సంప్రదించే పంటర్లకు సబ్ బుకీలు వెబ్ లింకులు పంపిస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచారం మొదలవగానే బెట్టింగ్ రాయుళ్లు ఫోన్ చేసి ఎంత కాస్తున్నామో చెప్పగానే బుకీలు అంతా రికార్డు చేసుకుంటారు. ఉప ఎన్నిక గెలుపు, ఓటమిలు పూర్తయ్యాక పంటర్ల నుంచి డబ్బు వసూలు చేయడం లేదా బెట్టింగ్‌లో గెలిచిన మొత్తాన్ని ఇచ్చేందుకు ప్రత్యేకంగా కలెక్షన్ ఏజెంట్లు ఉంటారు. ప్రస్తుతం వెయ్యి రూపాయల నుంచి కోట్ల వరకు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నగర శివార్లలోని ఫాం హౌస్‌లు పంటర్లు, బుకీలతో కిటకిటలాడాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో సరదాగా గడిపేందుకు మాంసం, మద్యం అంతా సిద్ధం చేసుకుని వెళ్లిపోయారు. కొందరు ఇళ్లలోనే ఉండి యాప్‌లతో పందేలు కాస్తున్నారు. వందకుపైగా బెట్టింగ్ యాప్‌లు కొనసాగుతున్నాయి.