వాషింగ్టన్ : 2024 నాటి ఎన్నికల్లో తాను మళ్లీ అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైతే భారత్‌తో అమెరికా సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఫ్లోరిడా లోని తన మార్‌ఎ లగో రిసార్టులో రిపబ్లికన్ హిందూ కొలిషన్ (ఆర్‌హెచ్‌సి) నిర్వహించిన దీపావళి వేడుకల సభలో ట్రంప్ ప్రసంగించారు. దాదాపు 200 మంది ప్రవాస భారతీయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మళ్లీ తాను ఎన్నికైతే ఆర్‌హెచ్‌సి సంస్థాపకులు శలభ్‌కుమార్‌ను తన రాయబారిగా భారత్‌లో నియమిస్తానని చెప్పారు.
గత శుక్రవారం దీపావళి వేడుకల సందర్భంగా ట్రంప్ చేసిన ప్రసంగం తాలూకు వీడియోను ఆర్‌హెచ్‌సి మంగళవారం విడుదల చేసింది. 2016,2020 లో ఈ రెండుసార్లు హిందూ ప్రజల, భారతీయుల మద్దతు బాగా తనకు లభించిందని , వాషింగ్టన్ డిసిలో హిందూ నరమేథ స్మారక భవన నిర్మాణానికి మద్దతు ఇస్తానని చెప్పారు. నవంబర్ 8 న మధ్యంతర ఎన్నికలు వస్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఆర్‌హ్‌చ్‌సి సంస్థాపకులు శలభ్‌కుమార్ మాట్లాడుతూ హిందూ సమాజానికి ట్రంప్ మంచి స్నేహితుడని , అమెరికా లోని హిందూసంతతికి సాధికారత, భరోసా కల్పించడంలో ఆర్‌హెచ్‌సి సాధించిన విజయాలు గర్వకారణమని వెల్లడించారు.