మన తెలంగాణ / హైదరాబాద్ : గృహ (కేటగిరి 1), గృహేతర (కేటగిరి2) విద్యుత్ సర్వీస్ కనెక్షెన్ల యాజమాన్య హక్కుల బదలాయింపు(పేరు మార్పు) ప్రక్రియను మరింత సులభతరం చేశామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి. రఘుమారెడ్డి తెలిపారు. వినియోగదారులు తగు ధృవీకరణ పత్రాలను సంస్థ వెబ్‌సైట్ www.tssouthernpower.com ద్వారా లేదా ఇంటిగ్రేటెడ్ కస్టమర్ సర్వీస్ సెంటర్ ద్వారా సమర్పించి తమ సర్వీస్ కనెక్షన్ పేరు మార్చుకోవచ్చని తెలిపారు. ఇందు కోసం గుర్తింపు కార్డు (సెల్ఫ్ అటాస్టెడ్), సంస్థ నిర్దేశించిన విధంగా రూ.100 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద ఇండెమినిటి బాండ్ ( ఈ ఫార్మటును సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపరుచబడింది), ప్రస్తుత దరఖాస్తు దారుని పేరు మీద గల స్వీయ ధృవీకరణ చేసిన రిజిస్టర్డ్ సేల్ డీడ్ లేదా పర్ట్‌నర్ షిప్ డీడ్ లేదా ఏదైనా యాజమాన్యహక్కు ధృవీకరించే ఏదైనా పత్రం, సమర్పించాల్సి ఉంటుందన్నారు.
ఏదైనా సంస్థ పేరుమీద కాని, అవగాహనా ఒప్పందం, భాగస్వామ్య ఒప్పందం ఉంటే ఆ కంపెనీ ఇచ్చే అధికారిక పత్రం పొందుపరచాల్సి ఉంటుంది. ఉమ్మడి యాజమాన్యాంలో ఉన్న పక్షంలో సంస్థ నిర్దేశించిన విధంగా రూ.10 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద ఇతర భాగస్వాముల నిరభ్యంతర పత్రం పొందుపరచాలి. పాత యజమాని చనిపోయిన సందర్భంలో చట్ట పరమైన వారసుల లీగల్ హెయిర్ పర్టిఫికెట్ స్వీయ ధృవీకరణ చేసి పొందుపరచాల్సి ఉంటుంది. రూ. 25(ప్లస్ జిఎస్‌టి) దరఖాస్తు రుసుం చెల్లించాలి. యాజమాన్య బదలాయింపుకు సంబంధించి సంస్థ జారీ చేసిన నిబంధనలు అమలయ్యేలా చూడాలని, క్షేత్ర స్థాయి అధికారులు అవసరమైన పత్రాల కోసం వినియోగదారులను ఇబ్బందులకు గురిచేయకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పేరు మార్పు, యాజమాన్య మార్పు కొరకు నమోదైన దరఖాస్తులు, వాటి తిరస్కరణకు, ఆలస్యానికి కారణాలను సమీక్షించాలని, పౌర ససేవ పత్రం ప్రకారం దరఖాస్తు అందిన 7 రోజుల్లోగా పని పూర్తి చేసేలా చూడాలని సూపరింటెండెంట్ ఇంజనీర్లను సంస్థ చైర్మన్ ఆదేశించారు.