మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం మాస్కోకు చెందిన మేధావుల ‘వాల్డాయ్ డిస్కషన్ క్లబ్’లో తన వార్షిక ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు, ఆయన నాయకత్వంలో భారతదేశంలో చాలా జరిగిందని అన్నారు. మోడీ మహా దేశభక్తుడని అన్నారు.
బ్రిటిష్ వారి కాలనీ నుంచి ఆధునిక దేశంగా భారత ఎదగడం అద్భుతమన్నారు. భారత్‌లో 1. 5 బిలియన్ ప్రజలున్నారని, భారత అభివృద్ధి గణనీయమన్నారు. భారత, రష్యాల మధ్య ప్రత్యేక సంబంధాలున్నాయని పేర్కొన్నారు. తమ రెండు దేశాల మధ్య ఎన్నడూ పొరపొచ్చలు లేవలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తమ రెండు దేశాల సంబంధాలు మెరుగ్గానే ఉంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత వ్యవసాయాభివృద్ధికి ఎరువుల పంపిణీని ప్రధాని మోడీ కోరినట్లు ఆయన తెలిపారు. “మేము ఇప్పటికే 7.6 ఇంతలు సరఫరా పెంచాం. వ్యవసాయ వాణిజ్యం రెండు దేశాల మధ్య రెండింతలయింది” అని కూడా ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి గురించి ఆయన మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలు ప్రపంచ పెత్తందారి కోసం ‘డర్టీ గేమ్స్’ ఆడుతున్నాయని ఆరోపించారు. భవిష్యత్తులో పాశ్చాత్య దేశాలు సమానస్థాయిలో కూర్చుని మాట్లాడాల్సి ఉంటుందని అన్నారు. పాశ్చాత్య దేశాలు ప్రపంచం మీద పెత్తనం చెలాయించాలనుకోవడం ‘డర్టీ గేమ్’ అని వ్యాఖ్యానించారు.