అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ
ఎవరెన్ని కుయుక్తులు పన్నినా టీఆర్ఎస్ గెలుపు ఖాయం – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటుప్పల్: మునుగోడు ప్రజల మదినిండా సిఎం కెసిఆర్ గులాబీ జెండానే అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్ మండలం డి. నాగారం గ్రామంలో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఎర్ఎస్ అభ్యర్థి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారం సందర్బంగా పలువురు వృద్ధులను, మహిళలను,యువకులను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. అన్ని వర్గాల ప్రజల నుంచి కెసిఆర్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. ఏ ఇంటికి పోయిన కెసిఆర్ మాకు సాయం అందిస్తున్నాడు ఆయన్ను మర్చిపోం,ఓటు రూపంలో ఆయన రుణం తీర్చుకుంటామని మాటిస్తున్నారన్నారు. వృద్దులు అయితే మాకు కేసిఆర్ పెద్ద కొడుకు లెక్క ఆసరైతుండు ఆయనకే మా ఓటు అంటూ ఎంతో ప్రేమతో దీవిస్తున్నారని అన్నారు. రాజ గోపాల్ రెడ్డిని ప్రజలు నమ్మడం లేదని, ఎవరెన్ని కుయుక్తులు పన్నినా టిఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు.
ప్రచార సందర్బంగా కల్లు గీత కార్మికులు(గౌడ సంఘం) ప్రతినిధులు స్వచ్చందంగా టిఆర్ఎస్ మద్దతు తెలిపారు. మంత్రి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్లు గీత కార్మికులు (గౌడ) ఆర్ధికంగా బలపడేందుకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, గ్రామ వార్డు మెంబర్లు,టిఆర్ఎస్వీ నాయకుడు పిల్లలమర్రి సాయి కుమార్,పలువురు నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.