న్యూఢిల్లీ : ఆపరేషన్ కమలం పేరుతో భారతీయ జనతా పార్టీ డర్టీగేమ్ ఆడుతోందని, ఢిల్లీ హోంశాఖ మంత్రి మనీష్ సిసోడియా విమర్శించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్‌ఎస్ ఎమ్‌ఎల్‌ఎల కొనుగోలు వ్యవహారంపై సిసోడియా మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఇతర పార్టీలకు చెందిన ఎమ్‌ఎల్‌ఎలను వేటాడుతూ తద్వారా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేస్తోందని ఆరోపించారు. బీజేపీలో చేరిన ఏ వ్యక్తిని దర్యాప్తు సంస్థలు, కేంద్ర ఏజెన్సీలు వెంటాడవన్నారు. తెలంగాణలో ఎమ్‌ఎల్‌ఎల కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కాషాయ పార్టీ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికపోయిందన్నారు. పదవులు ఇస్తా, డబ్బులు ఇస్తామని ఎమ్‌ఎల్‌ఎలను ప్రలోభ పెట్టారని విమర్శించారు. బీజేపీ నాయకుడు (రామచంద్ర భారతి ) ఏజెంట్‌గా వ్యవహరిస్తూ టీఆర్‌ఎస్ ఎమ్‌ఎల్‌ఎలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
ఆడియో టేపుల్లో బేరసారాలు తెలుస్తున్నయ్
బీజేపీలో చేరితే ఏ ఏజెన్సీలూ మిమ్మల్ని ఏం చేయవని రామచంద్ర భారతి టీఆర్‌ఎస్ ఎమ్‌ఎల్‌ఎలతో చెప్పారంటూ మండిపడ్డారు. ఢిల్లీ లోనూ 43 మంది ఎమ్‌ఎల్‌ఎలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రామచంద్ర భారత్ టీఆర్‌ఎస్ ఎమ్‌ఎల్‌ఎలకు చెప్పారని, సిసోడియా పేర్కొన్నారు. తద్వారా కేజ్రీవాల్ సర్కార్‌ను కూల్చేందుకు కుట్రలకు దిగారని ఆరోపించారు. ఆడియో టేపుల్లో బీజేపీ బేరసారాలు స్పష్టంగా తెలుస్తున్నాయన్నారు. దేశంలో బీజెపీ ఆపరేషన్ కమలం అమలు చేస్తోందని, ఎమ్‌ఎల్‌ఎలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు బీజేపీ సహచరులు ఇటీవల రూ. 100 కోట్ల నగదుతో పట్టుబడ్డారంటూ ముగ్గురి ఫోటోలను ప్రదర్శించారు.
కేంద్ర మంత్రి అమిత్‌షాను అరెస్టు చేయాలి
డిల్లీలో 43 మంది ఎమ్‌ఎల్‌ఎల కొనుగోలు కోసం రూ. 1075 కోట్లు ఉంచినట్టు మనీష్ సిసోడియా పేర్కొన్నారు. వారికి ఇంతడబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అంటూ సూటిగా ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలతో ఎమ్‌ఎల్‌ఎలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై విచారణ జరపాలన్నారు. ఇది నిజమైతే దేశానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ కొనుగోలు వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఉండటం సిగ్గుచేటని మనీష్ సిసోడియా విమర్శించారు. ఈ వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉంటే వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆప్ ఎమ్‌ఎల్‌ఎలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని గతం లోనే ఈ విషయం చెప్పామని గుర్తు చేశారు. దీనిపై ఈడీ, సిబిఐతో విచారణ జరిపించాలన్నారు. ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ ఇలా 8 రాష్ట్రాల్లో ఈ ప్రయత్నాలు చేస్తున్నారని దేశంలో ఇది తీవ్రతరమైన సమస్య అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రిని తప్పించాల్సిన అవసరం ఉందన్నారు.