హోం మంత్రి అమిత్‌షాను అరెస్టు చేయాలి
తెలంగాణలో కమలం కంగాళీ పని
షా జీ పేరు క్యాసెట్‌లో ఉంది
ఇంటరాగేట్ చేస్తే నిజాలు వెలుగులోకి
ఢిలీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా
న్యూఢిల్లీ: తెలంగాణలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు బిజెపి ఎర వ్యవహారంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా శనివారం తీవ్రంగా స్పందించారు. ఈ ఉదంతానికి సంబంధించి వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అరెస్టు చేయాలని సిసోడియా డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతోన్న ఆపరేషన్ లోటస్ తెలంగాణలో కూడా బహిరంగంగానే చేపట్టారు. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలను బిజెపిలోకి చేర్చుకోవడానికి బేరసారాలు జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇందులో అమిత్ షా పాత్ర ఉందని ప్రాధమికంగా తెలుస్తున్నందున, ఇది నిజమే అయితే కేంద్ర హోం మంత్రి అయిన అమిత్ షాను అరెస్టు చేయాల్సి ఉంటుందని సిసోడియా స్పష్టం చేశారు. బిజెపియేతర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు పావులు కదపడం, అనైతికంగా వ్యవహరించడం బిజెపికి పరిపాటి అయిందని సిసోడియా మండిపడ్డారు. ఇంతకు ముందు బిజెపి గాలాల వ్యవహారాలు ఢిల్లీ, పంజాబ్, మరో ఎనిమిది రాష్ట్రాలలో జరిగాయి. ఇది బిజెపి సాగిస్తోన్న చెత్తపని అని, ఇప్పుడు తెలంగాణలో మరింతగా బహిర్గతం అయిందని విమర్శించారు. తెలంగాణలో బిజెపి సాగించిన ఆటలో భాగంగా ఆడియో క్యాసెట్లలోని సంభాషణలను ఢిల్లీ నేత ప్రస్తావించారు. ముగ్గురు వ్యక్తుల మధ్య సంభాషణ జరిగింది. ఇందులో మాట్లాడిన ఓ వ్యక్తి మధ్యలో షా జీ అనే పేరు ప్రస్తావించారు. ఈ షా ఎవరు? ఈ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంతో ఆయనకు ఎటువంటి సంబంధం ఉంది? ఈ షా నిజంగానే అమిత్ షా అయి ఉంటే వెంటనే ఆయనను అరెస్టు చేయాలి, ఇంటరాగేట్ చేయాల్సి ఉంటుందని సిసోడియా స్పందించారు. తెలంగాణకు బిజెపి తరఫున బ్రోకర్లు బయలుదేరారని నిర్థారణ అయింది. వీరు ఎమ్మెల్యేల కొనుగోళ్లకుదిగారని సాక్షాధారాలు కూడా దొరికాయి. పేగా దేశ హోం మంత్రి పేరు ఈ వ్యవహారంలో ప్రస్తావనకు వచ్చింది. మరి దేశానికి ఇంతకంటే ప్రమాదకరమైన విషయం మరోటి ఉంటుందా? అని సిసోడియా ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ముగ్గురు దళారుల అరెస్టు జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి. వీరు ఆపరేషన్ లోటస్‌లో భాగంగానే హైదరాబాద్‌కు వచ్చారని వీరిపేర్లు రామచంద్ర భారతీ, సింహయ్య, నంద్‌కుమార్ అని తెలిసిందని, వీరికి కేంద్రంలోని పెద్దలకు, ప్రత్యేకించి బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కక్షగా వ్యవహరిస్తూ వస్తున్న అమిత్ షాకు ఎటువంటి సంబంధం ఉందో తెలిసితీరాలి. పైగా ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో పర్యటించినప్పుడు అమిత్ షా టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కెసిఆర్ ప్రభుత్వం కుప్పకూలుతుందని తెలిపారు. ఈ కోణంలో అక్కడ జరిగే ఉప ఎన్నికల నేపథ్యంలో ఆపరేషన్ లోటస్‌కు దిగి, ఈ విధంగా పట్టుపడ్డారని, బిజెపి వ్యవహారాలు ఈ విధంగా వెర్రితలలకు దిగాయని విమర్శించారు. రాజకీయాలను బిజెపి ఎటునుంచి ఎటు తీసుకుపోతోందని నిలదీశారు.
ఢిల్లీ ప్రభుత్వంపై కూడా ఆగస్టులో కుట్ర జరిగింది
ఈ ఏడాది ఆగస్టులో బిజెపి పెద్దలు తమ ఆప్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్రలు పన్నారని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ 20 కోట్లు ఇస్తామని బేరాలకు దిగారని ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించుకోవల్సి ఉంటుందని సిసోడియా తెలిపారు. అయితే ఆప్‌పై కుట్ర వార్తలను బిజెపి ఖండించింది. ఎమ్మెల్యేలను బెదిరించడం లేదా కేసులు పెట్టి వేధించడం కాకపోతే బేరసారాలకు దిగడం బిజెపి తంతు అయిందని, ఢిల్లీలో తమ ప్రభుత్వంపై బిజెపి సాగించిన దుష్ట చర్యకు సంబంధించినవీడియో ఆడియో సాక్షాలు ఆప్ వద్ద భద్రంగా ఉన్నాయని సిసోడియా ఇప్పుడు వివరించారు. పైగా ఇప్పుడు తెలంగాణలో వెలుగులోకి వచ్చిన ఆడియోలో కూడా ఏజెంట్లు తాము ఇంతకు ముందు ఢిల్లీలో కూడా ఆపరేషన్ చేశామని చెప్పినట్లు ఉందని, దీనిని ఆగస్టు పరిణామాల నేపథ్యంలో పరిగణనలోకి తీసుకోవాలని సిసోడియా డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఏకంగా 43 మంది ఆప్ ఎమ్మెల్యేలను బిజెపిలోకి లాగేందుకు బిజెపి పెద్ద విఫలయత్నంచేశారని విమర్శించారు.
Manish Sisodia demands Arrest of Amit Shah