బెంగళూరు: ముఖ్యమంత్రి కార్యాలయం(సిఎంఓ) నగరంలోని కొందరు సీనియర్ జర్నలిస్టులకు దీపావళి స్వీట్ బాక్సులతోపాటు నగదు బహుమతులను అందచేసిందన్న ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ శనివారం డిమాండ్ చేసింది. 40శాతం కమిషన్ల సర్కార్ కొందరు జర్నలిస్టులకు రూ.1లక్ష నగదును ముడుపుగా ముట్టచెప్పిందని, ఇది ముఖ్యమంత్రి ఇచ్చిన ముడుపు కాదా అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జీవాలా ప్రశ్నించారు. ఈ లక్ష రూపాయలు ఎక్కడివని, ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చారా లేక ముఖ్యమంత్రి సొంత సొమ్మా అని ఆయన ఆయన ప్రశ్నించారు. దీన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేక ఆదాయం పన్ను శాఖ పరిగణనలోకి తీసుకుంటుందా అంటూ ఆయన ట్వీట్ చేశారు. కర్నాటక కాంగ్రెస్ కమిటీ ఈ వ్యవహారంపై న్యాయ విచారణకు డిమాండ్ చేసింది. జర్నలిస్టులకు ముఖ్యమంత్రి స్వీట్ బాక్సు ముడుపులంటూ కాంగ్రెస్ కమిటీ అభివర్ణించింది.
ఇదిలా ఉండగా&జనాధికార సంఘర్ష పరిషత్(జెఎస్‌పి) అనే స్వచ్ఛంద సంస్థ దీపావళి బహుమతి నెపంతో జర్నలిస్టులకు తాను ముడుపులు చెల్లించానంటూ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చేసిన ఆరోపణపై కర్నాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. తన సన్నిహిత సహచరుని ద్వారా ముఖ్యమంత్రి పలువురు పత్రికల చీఫ్ రిపోర్టర్లకు ముడుపులు ముట్టచెప్పారని జెఎస్‌పి ఫిర్యాదు చేసింది. ఒక ఇంగ్లీష్ దినపత్రిక, ఒక కన్నడ దినపత్రిక చీఫ్ రిపోర్టర్లు తమకు ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టచెప్పిన స్వీట్ బాక్సుల్లో లక్ష రూపాయల బహుమతి గురించి తమ బాస్‌లకు తెలియచేయగా వారు వెంటనే వాటిని వాపసు చేయాలంటూ ఆదేశించారని జెఎస్‌పి తన ఫిర్యాదులో పేర్కొంది. తనకు ముట్టచెప్పిన నగదు బహుమతిని తిరస్కరించిన ఒక చీఫ్ రిపోర్టర్ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాస్తూ ఈ బహుమతిపై తీవ్ర నిరసన, ఖండన వ్యక్తం చేశారని కూడా జెఎస్‌పి తెలిపింది.
Congress demand probe into cash gifts to Journalists