కీవ్ : దక్షిణ ఉక్రెయిన్ లోని ఖెర్సన్ రీజియన్‌లో గల ఆస్పత్రుల నుంచి అస్వస్థులైన, గాయపడిన కామ్రేడ్లను వెంటనే తరలించడానికి రస్యా సైన్యాలు ముందుకు కదులుతున్నాయి. యుద్ధం తొలినాళ్లలో రష్యాసైన్యాలు ఆక్రమించిన ఖెర్సన్ ప్రావిన్స్‌ను తిరిగి స్వాధీనం చేసుకోడానికి తమ సైన్యాలు పోరాడుతున్నాయని ఉక్రెయిన్ మిలిటరీ అధికారులు శనివారం ప్రకటించారు. ఈ రీజియన్ రాజధాని ఖెర్సన్ నగరం నుంచి పౌరులు తరలి పోవాలని క్రెమ్లిన్ నియామక అధికారులు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ నుంచి వేలాది మంది రష్యా ఆక్రమిత మరో ప్రాంతానికి తరలిపోతున్నారని మాస్కో నియామక అధికారులు వెల్లడించారు. తాత్కాలికంగా ఖెర్సన్ రీజియన్‌ను ఆక్రమించిన ఆక్రమణదారులు వైద్య సంస్థలతోసహా ఖాళీ చేస్తున్నారని ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ శనివారం ఉదయం ప్రకటించింది.
ఆస్పత్రులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు, ఔషధాలు ఖెర్సన్ ఆస్పత్రుల నుంచి తొలగించడమౌతోందని చెప్పారు. ఖెర్సన్‌తోపాటు రష్యా ఆక్రమిత ప్రాంతాల్లోనూ మొత్తం ఆరోగ్యభద్రత వ్యవస్థ ను రష్యన్లు తొలగించివేస్తున్నారని శుక్రవారం రాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడు వాల్దిమిర్ జెలెన్‌స్కీ వీడియోలో వెల్లడించారు. ఆక్రమించిన నగరాల్లోని వైద్యసంస్థలను మూసివేసి మొత్తం సామగ్రితోపాటు అంబులెన్సులను తరలించడానికి ఆక్రమణదారులు నిర్ణయించారని జెలెన్‌స్కీ చెప్పారు. ఇంకా అక్కడే ఉన్న డాక్టర్లను వెంటనే రష్యా భూభాగం లోకి తరలిపోవాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఉక్రెయిన్ నాలుగు రీజియన్లలో ఒకటైన ఖెర్సన్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్ గత నెల అక్రమంగా రష్యాలో కలుపుకోవడమే కాకుండా తరువాత సైనిక పాలన విధించారు. ఉక్రెయిన్ దక్షిణ జపోరిజ్‌ఝియా రీజియన్ లోని కీలక సౌకర్యాలపై శనివారం రష్యా దాడులు చేసింది.