Saturday, November 23, 2024

జిన్‌పింగ్‌తో భారత్‌కు ముప్పు!

- Advertisement -
- Advertisement -

Threat to India with Chinese President Xi Jinping

చైనా కమ్యూనిస్ట్ పార్టీ 20వ కాంగ్రెస్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షునిగా జిన్‌పింగ్ వరుసగా మూడోసారి ఎన్నిక కావడంతో మావో తర్వాత ఆ దేశంలో అత్యంత బలమైన నాయకుడిగా ఎదిగిన్నట్లయింది. కేవలం చైనాలోనే కాకుండా నేడు ప్రపంచంలోనే అత్యంత బలమైన నిరంకుశ నేతగా కూడా ఆయనను పేర్కొనవచ్చు. ఈ పరిణామం ఊహించిందే అయినప్పటికీ 69 ఏళ్ల జిన్‌పింగ్ 2013లో చైనా అధ్యక్షుడిగా ఎదిగినప్పటి నుండి మన సరిహద్దులలో గాల్వన్ లోయలో రెండు దేశాల సైనికులు ముష్టి యుద్ధాలకు తలపడడంతో 20 మంది భారత సైనికులు మృతి చెందినప్పటి నుండి పరిస్థితులు అసాధారణంగానే ఉన్నాయి. చైనా సైనిక దళాలు వాస్తవాధీన రేఖను ఉల్లంఘించి దుందుడుకుగా వ్యవహరించడంతో భారత్‌కు ఆందోళనకరంగానే ఉంది. సరిహద్దులోని తూర్పు సెక్టార్‌లో విస్తారమైన ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనా అదను కోసం ఎదురు చూస్తున్నట్లు పలు సందర్భాలలో స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. అణ్వాయుధాలను కలిగి ఉన్న రెండు పొరుగు దేశాల మధ్య ఇటువంటి ఉద్రిక్తలు ఆందోళన కలిగించేవే కాగలవు. ఇటువంటి పరిస్థితులలో జిన్‌పింగ్ తిరుగులేని నేతగా ఆవిర్భవించడం భారత్ భద్రతకు పెను సవాల్‌గానే మారనున్నది. బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నిక కాగానే సత్వరమే ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. అంతే కాదు, ఫోన్‌లో మాట్లాడి వచ్చే నెల జి20 సదస్సు సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు కూడా సుముఖత వ్యక్తం చేశారు.

అయితే ఎంతో కీలకమైన చైనాలో జిన్‌పింగ్ మరోసారి ఎన్నికై వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు భారత్ నుండి స్పందన లేదు. కనీసం ట్వీట్ ద్వారా అభినందనలు కూడా తెలపలేదు. విదేశాంగ శాఖ ప్రతినిధి ఎటువంటి వ్యాఖ్యానం కూడా చేయలేదు. ఒక విధంగా చైనా విషయంలో కొంత కాలంగా భారత అసహనంతో వ్యవహరిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.చైనా కమ్యూనిస్టు పార్టీ కీలక నాయకత్వం, ప్రభుత్వంలో కీలక పదవులు అన్ని ఇప్పుడు జిన్‌పింగ్ మద్దతుదారులతో నిండి ఉండడంతో ఒక విధమైన ఆందోళనకు గురవుతున్నట్లు భావించవలసి వస్తున్నది. 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాని స్థాపించిన మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న జిన్‌పింగ్ అనుసరింపబోయే విధానాలు ప్రశ్నార్ధకరం కానున్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ జరిగిన వెంటనే జవాన్లతో దీపావళి సంబరాలలో పాల్గొనడం కోసం సరిహద్దు ప్రాంతమైన కార్గిల్‌కు వెళ్లిన ప్రధాని మోడీ చైనాలోని పరిణామాలను పట్టించుకున్నట్లు వ్యవహరించారు. లడఖ్‌లోని రెండవ అతిపెద్ద పట్టణమైన కార్గిల్‌ను సందర్శించినప్పుడు, సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశంపై చెడు దృష్టి సారించిన ఎవరికైనా తగిన సమాధానం లభిస్తుందని అంటూ పరోక్షం గా ఈ పరిణామాలపై వ్యాఖ్యానించినట్లు కనిపిస్తున్నది. అంతేకాదు, భారత దేశంలోని రాజకీయ పక్షాలు ఏవీ కూడా ఈ పరిణామాలపై బహిరంగంగా స్పందించలేదు.

చైనా వ్యవహారాల పట్ల లోతయిన అవగాహన, అధ్యయనం గల మాజీ కేంద్ర మంత్రి డా. సుబ్రహ్మణ్యన్ స్వామి మాత్రమే ఓ హెచ్చరికను జారీ చేశారు. లడఖ్, కశ్మీర్‌ను చేజిక్కించుకునేందుకు పాకిస్తాన్‌తో కలిసి చైనా దాడులకు తెగబడవచ్చని భారత్ అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన హెచ్చరిక చేశారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ, ప్రభుత్వంపై జిన్‌పింగ్ పట్టు సాధించడం ఈ దిశగా విస్పష్ట సంకేతాలు పంపిందని సుబ్రహ్మణ్య స్వామి స్పష్టం చేశారు. తైవాన్‌పై డ్రాగన్ దూకుడుగా వెళ్లినా అమెరికా కారణం గా అక్కడ చైనా సాధించేదేమీ లేదని ఆయన చెప్పారు. దీంతో పాకిస్తాన్‌తో కలిసి లడఖ్, కశ్మీర్‌ను వశం చేసుకునే లక్ష్యంతో ముందుకెళుతుందని హెచ్చరించారు. అదే జరిగితే అమెరికా మనకు ఎలాంటి సాయం చేయదని పేర్కొంటూ అందుకు భారత్ సిద్ధంగా ఉండాలని, ఆత్మనిర్భర్ అంటూ స్వామి ట్వీట్ చేశారు.

ఎస్‌సిఒ సదస్సు సందర్భంగా చైనా అధికారిక మ్యాప్‌లను విడుదల చేయడంపై స్వామి ఇటీవల విమర్శలు గుప్పించారు. ఈ మ్యాప్‌ల్లో లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లను చైనా పేరుతో ఆ దేశ అంతర్భాగంగా చూపారు. ఆ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ ఆ మ్యాప్‌ల గురించి నిరసన వ్యక్తం చేయకపోవడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్ సాధ్యమైనన్ని కోణాల్లో యుద్ధానికి సన్నద్ధం కావాలని ఆయన కేంద్రాన్ని అప్రమత్తం చేశారు. పార్టీ కాంగ్రెస్ అనంతరం బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్‌లో జరిగిన మీడియా సమావేశంలో జిన్‌పింగ్ భారతదేశం గురించి వ్యాఖ్యానించనప్పటికీ అంతర్జాతీయంగా రాజకీయంగా, సైనికంగా బలమైన దేశంగా చైనా ఎదిగేందుకు తన స్థిర నిశ్చయాన్ని స్పష్టం చేయడం ద్వారా పరోక్ష సంకేతాలు పంపినట్లయింది. ‘మీరు మాతో చేతులు కలిపితే కలపండి లేదా ప్రమాదాలకు సిద్ధంకండి’ అనే ధోరణిలో మొదటి నుండి భారత్ పట్ల ఆయన వ్యవహరిస్తున్నాడు.

ముంబై ఉగ్రదాడికి బాధ్యులైన కరడుగట్టిన ఉగ్రవాదులను అంతర్జాతీయ వేదికలపై కాపాడటం కోసం పాకిస్థాన్‌తో చైనా చేతులు కలుపుతూ ఉండడం ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నది.అదే విధంగా ఆక్రమిత కశ్మీర్‌లో సహితం పలు విధాలుగా జోక్యం చేసుకొంటున్నది. లడఖ్ సరిహద్దులో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడం కోసం రెండు దేశాల మధ్య జరుగుతున్న కమాండర్ -స్థాయి చర్చలు చాలా వరకు అసమర్థంగా మారాయి. ప్రతిష్టంభనను పరిష్కరించడానికి చెప్పుకోదగిన ప్రయత్నాలు రాజకీయ స్థాయి లో జరగడం లేదు. వాస్తవానికి జిన్‌పింగ్‌తో వ్యక్తిగతంగా ప్రధాని నరేంద్ర మోడీకి గల సాన్నిహిత్యం మరే ప్రపంచ నాయకుడికి లేదని చెప్పవచ్చు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానిగా ఆయనను మొత్తం 28 సార్లు కలిశారు. భారత ప్రధానులు ఎవ్వరు చైనా అధ్యక్షుడితో అన్ని సార్లు కలవడం జరగలేదు. మోడీ స్వయంగా తొమ్మిది సార్లు చైనాలో పర్యటనలు జరుపగా, 2014 నుండి 2019 మధ్య మూడు సందర్భాల్లో చైనా అధినేతకు భారతదేశంలో ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అయితే రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన అంశాలను నేరుగా చైనా అధ్యక్షుడితో ప్రస్తావించే ప్రయత్నం భారత ప్రధాని చేయడం లేదు.

ఈ మధ్య ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన నాయకుల ఫోటో -ఆప్‌లో ఇద్దరు నేతలు పక్కపక్కనే ఉన్నప్పటికీ కనీసం పలకరించుకొనే ప్రయత్నం చేయలేదు. 2014లో అహ్మదాబాద్‌లో చైనా అధ్యక్షుడితో ప్రధాని శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తున్న సమయంలోనే చైనా సైనికులు లడఖ్‌లోని డెమ్‌చోక్, చుమర్ ప్రాంతాల్లోకి ప్రవేశించారు, పది రోజుల వ్యవధిలో అది వారి మూడవ దండయాత్ర. జిన్‌పింగ్‌కు భారతదేశంలో ఆతిథ్యం ఇస్తున్నప్పుడు చైనా ఆ విధమైన దాడికి పాల్పడటం మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసింది. చైనా దుందుడుకు ధోరణుల పట్ల మోడీ ప్రభుత్వం అసహనంతో ఉంటున్నప్పటికీ బహిరంగంగా ఆ దేశ దురాక్రమణ, ధోరణులను ఖండించే ప్రయత్నం చేయడం లేదు. కేవలం విదేశాంగ మంత్రి జైశంకర్ మాత్రమే సరిహద్దుల్లో సర్దుబాటు కాకుండా రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు సాధ్యం కావని తరచూ స్పష్టం చేస్తున్నారు. అయితే సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల గురించి పార్లమెంట్‌లో చర్చలకు ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. కనీసం సభ్యుల ప్రశ్నలను సహితం జాతీయ భద్రత దృష్ట్యా సున్నితమైన అంశం అంటూ తిరస్కరిస్తున్నారు. మన జవాన్ల త్యాగం వృథా కాదని, భారత్ తన భూమిలో ఒక్క అంగుళం కూడా చైనాకు అప్పగించలేదని ప్రధాని, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. మరోవంక సుమారు 1,000 కి.మీ భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నట్లు రాహుల్ గాంధీ వంటి వారు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.

అరుణాచల్ వంటి సరిహద్దులలో భారత్ భూభాగంలో చైనా సైనికులు గ్రామాలు నిర్మిస్తున్నారని, సరిహద్దుల్లో భారీగా సేనలను, ఆయుధ పరికరాలను తరలిస్తున్నారని, నిర్మాణాలు చేబడుతున్నారని అమెరికా వంటి దేశాల నిఘా సంస్థలు శాటిలైట్ చిత్రాలను విడుదల చేస్తున్నా భారత తోసిపుచ్చుతున్నది. అయితే ప్రభుత్వం చెబుతున్న దానికన్నా సరిహద్దుల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని సైనిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బీజింగ్ దూకుడును నిరోధించడంలో, ఎదుర్కోవడంలో తరచూ ఎదురు దెబ్బలు తగులుతున్నాయని చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం బలపడుతున్నది. సరిహద్దు యాజమాన్యం గురించి రెండు దేశాలు గతంలో కుదుర్చుకున్న పలు ఒప్పందాలను చైనా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నది. సరిహద్దుల్లో పొంచి ఉన్న ప్రమాదంపై అన్ని రాజకీయ పార్టీలను, ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని, ఏకాభిప్రాయం వ్యక్తం అయ్యే విధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం కనిపిస్తున్నది. సరిహద్దులో జరిగిన సంఘటనలపై ప్రశ్నలను లేవనెత్తిన వారిని ‘జాతీయ వ్యతిరేక’, ‘చైనీస్ అనుకూల’ వంటి పదాలతో అసలు ప్రమాదాన్ని దాటవేసే ప్రయత్నం వాంఛనీయం కాదు.

 

* చలసాని నరేంద్ర- 9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News