Monday, December 23, 2024

క్రికెట్‌లో మరో మెట్టు

- Advertisement -
- Advertisement -

Equal match fee for men and women cricketers అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో పాల్గొనే భారతీయ మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమానంగా ఫీజులు చెల్లించాలని బిసిసిఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) తీసుకున్న నిర్ణయం కేవలం ఆ రంగానికే పరిమితమైన విప్లవం మాత్రమే కాదు. దేశంలో స్త్రీ, పురుష సమానత్వ సాధన పోరాట చరిత్రలో ఇదొక నూతన అధ్యాయాన్ని సృష్టించింది. ఈ నిర్ణయం ప్రకారం అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లలో పాల్గొనే మహిళా క్రికెటర్‌కు పురుషులతో సమానంగా రూ. 15 లక్షలు, వన్డే ఇంటర్‌నేషనల్ (ఒడిఐ) మ్యాచ్‌లలో పాల్గొనే వారికి రూ. 6 లక్షలు, టిట్వంటీ మ్యాచ్‌లలో ఆడే వారికి రూ. 6 లక్షలు చెల్లిస్తారు. ఈ పెంపు ఇంత వరకు ఈ టెస్టు మ్యాచ్‌లలో మహిళా క్రికెటర్లకు చెల్లిస్తూ వచ్చిన దానికి దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. అలాగే ఒడిఐలలో పాల్గొనే మహిళా క్రికెటర్లకు ఇది ఆరు రెట్లు ఎక్కువ. టిట్వంటీలలో ఇంత వరకు వారికి ఇస్తున్న దాని కంటే ఇది మూడు రెట్లు అధికం. అంతర్జాతీయ మ్యాచ్‌లలో పాల్గొనే స్త్రీ, పురుష క్రికెటర్లకిచ్చే పారితోషికాల మధ్య ఇంత కాలం ఇంత తేడా కొనసాగుతూ రావడం బాధాకరమే. పుట్టుకతో మానవులందరూ సమానులే. లింగ, వర్ణ తదితర భేదాలేమీ లేకుండా పుట్టిన వారే. అన్ని విభజనలు, విభేదాలు మొదలైంది ఆ తర్వాతే.

ఈ సత్యం అందరికీ తెలుసు. కాని అంగీకరించడానికి చాలా మంది సిద్ధంగా వుండరు. స్త్రీ, పురుష తేడాలనేవి సృష్టి సహజమైనవనే వితండ వాదానికి దిగుతారు. బలవంతులు కావడం వల్ల వారు ఈ అసమానతలను పెంచి పోషించడానికే ఇష్టపడతారు. దీనికి బలైపోతున్న వర్గాల్లో చైతన్యం పుంజుకోడమో, వారు నివసిస్తున్న సమాజాల్లో పురోగామి దృష్టి ఏర్పడడమో జరిగితే గాని ఈ తేడాలు తొలగడం మొదలు కాదు. ప్రకృతిలో కేవలం స్త్రీ, పురుషులు మాత్రమే వుండాలని భావించే సమాజాలు వారి మధ్య దాంపత్యాలనే అంగీకరిస్తాయి గాని సలింగ కలయికలను ఒప్పుకోవు, తిరస్కరిస్తూ వుంటాయి. దీనిని కూడా ఛేదిస్తూ సలింగ దాంపత్యాలు గెలుపు జెండాలను ఎగర వేస్తున్నాయి. సలింగులను ఒకప్పుడు కఠోర శ్రమ చేసే లేబర్ క్యాంపులకు పంపించిన క్యూబా ఇటీవల జరిగిన రెఫరెండం ద్వారా వారి దాంపత్యాన్ని అంగీకరించింది. వారు కలిసి బతకవచ్చని, పిల్లలను దత్తత తీసుకొని పెంచుకోవచ్చని, స్త్రీ, పురుష కుటుంబీకులకు లభించే హక్కులన్నింటినీ అనుభవించవచ్చని ఈ రెఫరెండం ద్వారా క్యూబా ప్రకటించింది. రోమన్ క్యాథలిక్ చర్చి తదితర శక్తుల వ్యతిరేకతను ఎదిరిస్తూ ఈ రెఫరెండం ద్వారా 67 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు.

అయితే అందులోని 33 శాతం మంది సలింగ దాంపత్యానికి ఇప్పటికీ వ్యతిరేకంగా వుండడం గమనించవలసిన విషయం. సర్వ సమానత్వం సాధించే వరకు సాగే పోరాటం ఎన్నో ఒడుదుడుకులను కూడుకొని వుంటుంది. గత జులైలో న్యూజిలాండ్ కూడా దేశీయ అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడే మహిళా క్రికెటర్ల ఫీజులను పురుష క్రికెటర్లకిచ్చే దానితో సమానం చేసింది. అమెరికా ఫుట్‌బాల్ (సాకర్) అసోసియేషన్ మహిళా క్రీడాకారులకు పురుషులతో సమానంగా చెల్లించాలని నిర్ణయించింది. దేశంలో మహిళా క్రికెట్ మొదలై దశాబ్దాలవుతున్నది. మహిళా క్రికెట్ మ్యాచ్‌లను బిసిసిఐ 2006 లో మాత్రమే గుర్తించింది. అంతకు ముందు వరకు వారు అతి దయనీయ స్థితిని అనుభవించేవారు. మ్యాచ్‌లకు వెళ్లేటప్పుడు సాధారణ రైలు కంపార్టుమెంట్లలో ప్రయాణం చేయక తప్పని స్థితి వారిది. ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లలో స్త్రీ, పురుష క్రికెట్ క్రీడాకారులకు ఇచ్చే ఫీజుల మధ్య తేడా తొలగిపోయినప్పటికీ భారత మహిళా క్రికెటర్లను మగ ఆటగాళ్ళతో సమాన స్థితికి తీసుకు వెళ్ళడానికి జరగవలసింది ఎంతో వుంది.

రీటైనర్ షిప్ చెల్లింపుల్లో పురుష క్రికెటర్ల కంటే మహిళలు చాలా వెనుకబడి వున్నారు. అధిక సంఖ్యలో ఆటలాడే పురుష క్రికెటర్‌కు రూ. కోటి నుంచి రూ. 7 కోట్ల వరకు రీటైనర్ షిప్ చెల్లిస్తుండగా, ఎ గ్రేడ్ మహిళా క్రికెటర్‌కు కేవలం రూ. 50 లక్షలు, బి గ్రేడ్‌కు రూ. 30 లక్షలు, సి గ్రేడ్‌కు రూ. 10 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. ఈ తేడా కూడా తొలగిపోవలసి వుంది. అయితే అందుకోసం మహిళలు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో పాల్గొనడం విశేషంగా పెరగాలి. వారి ఆటకు ప్రేక్షకాకర్షణ పురుష క్రికెట్ మ్యాచ్‌లతో సమానంగా లేదా దరిదాపులకు చేరవలసి వుంది. ఐపిఎల్‌లలో కూడా మహిళా క్రికెట్‌కు ప్రాధాన్యం లభించవలసి వుంది. ఇందుకోసం బిసిసిఐ వంటి సారథ్య సంస్థలు పలు రకాల వ్యూహాలను పాటించి మహిళా క్రికెట్‌కు వాణిజ్య స్థాయి గుర్తింపును విశేషంగా పెంచవలసి వుంది. బిసిసిఐ తీసుకొన్న సమాన ఫీజుల నిర్ణయం క్రికెటర్లు కావడానికి మహిళలు మరింతగా ముందుకు రాడానికి దోహదపడుతుంది. లాభార్జనే ప్రధానమయిపోయిన సమాజంలో విశేష ప్రేక్షకాదరణ పొందడం ద్వారానే మహిళా క్రికెట్ రాణించగలదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News