న్యూఢిల్లీ: అత్యాచార బాధితురాలిపై నిజంగా అత్యాచారం జరిగిందా లేదా అనేది నిర్ధారించడానికి టూ ఫింగర్ టెస్ట్ (యోని లాక్సిటీని తెలుసుకోడానికి చేసే పరీక్ష) చేయడం దారుణం, దుర్మార్గమని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇది ఒక కాలం తీరిన పాతకాలపు పరీక్షా పద్ధతి అని, స్త్రీల పట్ల వివక్షకు నిదర్శనమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ టూ ఫింగర్ పరీక్ష పద్ధతి సమాజంలో ఇప్పటికీ అమలులో ఉండటం దురదృష్టకరమని కోర్టు అభిప్రాయపడింది. దేశంలో అత్యాచార బాధితులపై ఇలాంటి వివక్ష పూరిత పరీక్షలు జరగకుండా కేంద్ర సర్కారు అడ్డుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
అత్యాచారం, హత్య కేసులో నేరస్తుడిగా ఉన్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లీలతో కూడిన సుప్రీం ధర్మాసనం సోమవారం తోసిపుచ్చింది. అతడిని దోషిగా పేర్కొంటూ అంతకు ముందు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్ధించింది. టూ ఫింగర్ టెస్ట్ మహిళల గౌరవం, గోప్యతకు భంగం కలిగించేలా ఉందని, కాబట్టి ఇలాంటి పరీక్షలను నిలిపివేయాలని దశాబ్దం క్రితమే సుప్రీం కోర్టు తన తీర్పును ప్రకటించిందని ధర్మాసనం తెలియజేసింది. యోని లాక్సిటీని పరీక్షించే ప్రక్రియ మహిళల గౌరవానికి భంగకరమని, లైంగికంగా యాక్టివ్‌గా ఉన్న మహిళ తనపై అత్యాచారం జరిగిందని చెప్పినా నమ్మకుండా ఇలాంటి పాతకాలపు పరీక్షలు చేయడం దారుణమని పేర్కొంది. ఇకనుంచి ఈ టూ ఫింగర్ టెస్ట్ నిర్వహించే ఏ వ్యక్తిని అయినా దుష్ప్రవర్తనకు పాల్పడిన వాడిగా పరిగణన లోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు హెచ్చరించింది.న దానికి బదులుగా మహిళల గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లనివ్వని అధునాతన పరీక్షలను అందుబాటు లోకి తీసుకురావాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్, వైద్య కళాశాలల పాఠ్యాంశాల నుంచి టూ ఫింగర్ టెస్ట్‌కు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.
Supreme Court slams usage of two finger test