నెల వారీ చార్జీ వసూలు చేయాలని యోచిస్తున్న ట్విట్టర్
న్యూఢిల్లీ : బిలియనీర్ ఎలోన్ మస్క్ సొంతం చేసుకున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో త్వరలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. వినియోగదారుల ధృవీకరణ ప్రక్రియను ట్విట్టర్ మార్చబోతోందని ఎలోన్ మస్క్ తెలిపారు. మొత్తం దృవీకరణ(వెరిఫికేషన్) ప్రక్రియను సమూలంగా మారుస్తున్నామని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వలేదు. అకౌంట్ హోల్డర్ ఖాతాను ధృవీకరించడానికి, బ్లూ టిక్ ఇవ్వడానికి రుసుము వసూలు చేయాలని ట్విట్టర్ యోచిస్తోందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ప్రస్తుత బ్లూటిక్ ఉచితమనే విషయం తెలిసిందే. నివేదిక ప్రకారం, ట్విట్టర్ వినియోగదారులు బ్లూ టిక్‌ను నిర్వహించడానికి అంటే వారి ఖాతాను ధృవీకరించడానికి నెలకు 20 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.1,656 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి చీఫ్ ట్విట్ ఎలోన్ మస్క్ ఈ విషయంలో ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ట్విట్టర్ బ్లూ వినియోగదారులు ప్రత్యేకమైన నెలవారీ సభ్యత్వాలను అలాగే వారి ట్వీట్లను సవరించే సామర్థ్యాన్ని పొందుతారు.
2000 మందిని తొలగించవచ్చు
కంపెనీని సొంతం చేసుకున్న వెంటనే ఎలోన్ మస్క్ ట్విట్టర్ సిఇఒ పరాగ్ అగర్వాల్‌తో సహా నలుగు ఉన్నతాధికారులపై వేటు వేశారు. అయితే త్వరలో కంపెనీలో 25 శాతం మంది ఉద్యోగులను తొలగించవచ్చని తెలుస్తోంది. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, ట్విట్టర్ కంపెనీలో దాదాపు 2000 మంది ఉద్యోగులను ఇంటి పంపే అవకాశం ఉంది. కంపెనీలో మొత్తం 7 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.