సాయంత్రంతో సద్దుమణగనున్న హోరు
3న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం
6 వరకు పోలింగ్ 1192 మంది ఎన్నికల సిబ్బంది నియామకం అందుబాటులో
199మంది మైక్రో అబ్జర్వర్లు 105 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించాం 2.41 లక్షల
మంది ఓటర్లు 3366 మంది రాష్ట్ర పోలీసులు.. కంపెనీల కేంద్ర బలగాల
మోహరింపు స్థానికులు నియోజకవర్గం వదిలి వెళ్లిపోవాలి మునుగోడులో విస్తృత
తనిఖీలు చేపడుతాం సరిహద్దుల్లో 100 చెక్‌పోస్టుల ఏర్పాటు ఓటర్ స్లిప్పుల పంపిణీ
పూర్తి ఫిర్యాదుల కోసం సీవిజిల్ యాప్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్
మనతెలంగాణ/హైదరాబాద్ : మునుగోడు ఉపఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఎన్నికల నిబంధనలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సిఇఒ) వికాస్‌రాజ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత బయటి వారు ఎవరూ నియోజకవర్గంలో ఉండవద్దని చెప్పారు. బయటి వారందరూ నియోజకవర్గం విడిచివెళ్లాలని అన్నారు.సాయంత్రం 6 గంటల తర్వాత మునుగోడులో విస్తృత తనిఖీలు చేపడతామన్నారు. నియోజకవర్గంలోని ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, ఇతర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేయాలని అధికారులు, బృందాలను ఆదేశించినట్లు చెప్పారు.
మునుగోడు నియోజకవర్గ సరిహద్దుల్లో 100 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. నవంబరు 3న జరగనున్న పోలింగ్‌కు సంబంధించి మంగళవారంతో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో సిఇఒ వికాస్‌రాజ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి పెద్ద మొత్తంలో ఎస్‌ఎంఎస్‌లపై నిషేధం ఉందని, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం చేయరాదని సిఇఒ తెలిపారు. నెట్‌వర్క్ ప్రొవైడర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.6 కోట్ల 80 లక్షల నగదు, 4,988.41 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వికాస్‌రాజ్ వివరించారు. వివిధ రూపాల్లో ఇప్పటి వరకు 479 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇప్పటివరకు 185 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. నియోజకవర్గంలో 111 బెల్ట్ షాపులు మూసివేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు 821 మందిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.
ఉదయం 7 నుంచి సా.6 గంటల వరకు పోలింగ్
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం(నవంబర్ 3) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతుందని వికాస్ రాజ్ తెలిపారు. మాక్ పోలింగ్ దృష్ట్యా ఏజెంట్లు గంట ముందు పోలింగ్ కేంద్రాలకు రావాలని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ముగ్గురు ఆఫీసర్లు ఉంటారని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 1,192 మంది సిబ్బంది అవసరం కాగా.. 300 మందిని అదనంగా ఉంచామని పేర్కొన్నారు. వీరితోపాటు 199 మంది మైక్రో అబ్జర్వర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవల్ ఆఫీసర్లు ఉంటారని, అన్ని పోలింగ్ కేంద్రాలలో తాగునీరు, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్లు వంటి మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఉపఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గ పరిధిలో 2,41,795 లక్షల మంది ఓటర్లు ఉన్నారని సిఇఒ వెల్లడించారు. వారిలో 50 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 80 ఏళ్లు దాటిన ఓటర్లు 2,576 మంది, వికలాంగులు 5,686 మంది ఉన్నట్లు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 739 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.అందులో 263 గ్రామీణ ప్రాంతాలలో, 35 పట్టణాలలో ఉన్నాయన్నారు. మునుగోడు నియోజకవర్గంలో 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని తెలిపారు.
ప్రతి గంటకూ నేరుగా ఓటింగ్ శాతం నమోదు
మునుగోడు ఉప ఎన్నికలో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వికాస్‌రాజ్ చెప్పారు. 3,366 మంది రాష్ట్ర పోలీసులతో పాటు 15 కంపెనీల కేంద్ర బలగాలు విధుల్లో ఉంటారని.. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు, మెడికల్ బృందాలు ఉంటాయని అన్నారు. యాప్ ద్వారా ప్రతి గంటకూ నేరుగా పోలింగ్ కేంద్రం నుంచి ఓటింగ్ శాతం నమోదవుతుందని తెలిపారు.
కొత్త ఓటర్లకు ఆధునిక కార్డులు
మునుగోడు నియోజకవర్గంలో కొత్తగా ఓటు హక్కు సంపాదించుకున్న వారికి తొలిసారిగా ఆధునీకరించిన ఓటరు గుర్తింపు కార్డులను మంజూరు చేశామని సిఇఒ తెలిపారు. ఇప్పటికే ఓటరు స్లిప్పులను పంపిణీ చేశామని, ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఓటర్లలో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టామని, ఫిర్యాదుల కోసం సీవిజిల్ యాప్ ఉపయోగించుకోవాలని సూచించారు.
అందరూ సహకరించాలి
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని సిఇఒ వికాస్‌రాజ్ కోరారు. ఎన్నికల సంఘం నియమ నింబంధనలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.
వివరణ అందింది..ఈసీకి నివేదించాం
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీకి సంబంధించి ఆయన నుంచి వివరణ అందిందని, దానిని ఇసికి నివేదించినట్లు వికాస్‌రాజ్ చెప్పారు. చేతులపై పార్టీల గుర్తులు వేసిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని తెలిపారు. రిటర్నింగ్ అధికారిపై సిఇఒ కార్యాలయం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లూ లేవని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు మానిక్‌రాజ్, రవికుమార్, సత్యవాణిలు పాల్గొన్నారు.