ఎ ఫర్ ఆపిల్ కాదు అర్జున
బి ఫర్ బలరామ..సి అంటే క్యాట్ కాదు ఛాణక్య
హెచ్ రాగానే హనుమాన్ అనాల్సిందే
భారతీయ సంప్రదాయ జోడింపు దిశలో యోగి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఎల్‌కెజి పిల్లల పాఠాలలో మార్పులు జరిగాయి. ఆంగ్లం చదివే పిల్లలు ఇకపై ఎ ఫర్ ఆపిల్ అని కాకుండా ఎ ఫర్ అర్జున్ అని పలకాల్సి ఉంటుంది. సాధారణంగా ఆంగ్లపు అక్షరమాల విషయంలో రాష్ట్రంలోని బిజెపి యోగి సర్కారు మార్పు చేసింది. పిల్లలకు చిన్ననాటి నుంచే మహాభారతం, దేశ చరిత్ర బాగా ఆకళింపు కావాలనే తలంపుతో ఇప్పటివరకూ ఉన్న పరిభాషకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త నడక నేర్పాలని నిర్ణయించుకుంది. ఇక ఎ తరువాత బి విషయానికి వస్తే ఇంతకు ముందు బి ఫర్ బాల్ అయితే ఇకపై బి ఫర్ బలరామ అని పిల్లలు చదవాల్సి ఉంటుంది. సి అంటే క్యాట్ కాదు ఛాణక్యగా చదవాలి. ఈ విధంగా ఇంగ్లీషులోని 26 అక్షరాలకు విశేషణాలను పురాణాలు, చారిత్రక వ్యక్తుల పేర్లు జోడించారు. లక్నోలోని అమినాబాద్ ఇంటర్ కాలేజ్ ఈ పిల్లల పుస్తకంలో మార్పులు తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సమూల మార్పులు చేపట్టారు.
ఇకపై ఆంగ్లం నేర్చుకునే ప్రతి పిల్లవాడికి ఈ విధంగా పురాణాల గురించి, ప్రాచీన విషయాల గురించి అవగావహన ఏర్పడుతుందని మార్పులు క్రమంలో అధికారులు తెలిపారు. డి అనగానే పిల్లలు ఇక ధృవ అని తెలియచేయాలి. ఇ అనగానే ఏకలవ్య అని హెచ్ అక్షరం అనగానే హనుమాన్ అని తెలియచేయాల్సి ఉంటుంది. చిన్న పిల్లలకు మన చరిత్ర గురించి తెలియడం లేదని. ఈ క్రమంలో వారికి సరైన విద్యాబోధన దిశలో జ్ఞానం పెంచేందుకు ఈ విధంగా కొత్త పద్దతికి దిగుతున్నట్లు ఈ కాలేజీ ప్రిన్సిపాల్ లాల్ మిశ్రా తెలిపారు. కొత్త పద్థతిలో అక్షరమాల క్రమంలో ఇకపై ఆంగ్లంలో ఎ అక్షరం పక్కన అర్జునుడి పేరు ధనస్సు సంధిస్తున్నట్లుగా ఉండే గాండీవుని బొమ్మ ఉంటుంది. ఇదే విధంగా ఇతర పేర్లకు పక్కన వివరణాత్మక బొమ్మలు ఉంటాయని, ఈ విధంగా పసిమనస్సులలో మన గత ఘనత నాటుకుపోతుందని ప్రిన్సిపాల్ తెలిపారు. ఎ నుంచి జడ్ వరకూ మార్పులు ఉంటాయి. ఈ తరహాలో విద్యాబోధనలో ఇది కేవలం ఆరంభమే అని కూడా విద్యాశాఖాధికారులు తెలిపారు.