సిమ్లా : స్వాతంత్రానంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఓటు వేసిన శ్యాం శరణ్ నేగి 106 ఏళ్ల వయసులో ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12 న జరగనుండగా, డిసెంబర్ 8 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కిన్నౌర్ జిల్లాకు చెందిన శ్యాం శరణ్ నేగి కోసం ఎన్నికల కమిషన్ బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రెడ్ కార్పెట్‌తో స్వాగతిస్తూ ఆయనకు ఓటు వేసేందుకు చర్యలు చేపట్టామని కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ అబిద్ హుస్సేన్ తెలిపారు. శ్యాం శరణ్ నేగి ఓ లెజెండ్ అని, ఆయనకు తగ్గట్టే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామని చెప్పారు.
తొలుత పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలని శ్యాం శరణ్ భావించారని, అయితే ఆరోగ్యం సహకరించక పోవడంతో ఇంటి నుంచి ఓటు వేసేందుకు అనుమతించాలని దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. నేగి చిన్న కుమారుడు చందన్ ప్రకాష్ తన తండ్రి గురించి వివరిస్తూ పెద్ద వయసు లోనూ తన తండ్రి ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటూ యువతలో స్ఫూర్తి నింపుతున్నారని చెప్పారు. 1951లో తన తండ్రి ఓటు వేశారని, ఈ వయసు లోనూ పౌరుడిగా ఓటు హక్కు వినియోగించుకుంటూ తన విధి నిర్వర్తిస్తున్నారని అన్నారు.