అనంతపురం జిల్లాలో ఘోరం
విద్యుత్ తీగలు తెగిపడి నలుగురు కూలీలు దుర్మరణం
మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం
నలుగురు ఉద్యోగులపై వేటు
ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పెద్దిరెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపిలోని అనంతపురం జిల్లాలో దుర్గాహోన్నూరు గ్రామంలో విద్యుత్ తీగలు తెగిపడి నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో పార్వతి, సక్రమ్మ, రత్నమ్మ, వండ్రక్క అనే కూలీలు మరణించగా, గాయపడిన మరో ఇద్దరు కూలీలు బళ్ళారి ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్నారు. బుధవారం బొమ్మనహాళ్ మండలం దర్గాహోన్నూరులో కొంతమంది కూలీలు ఆముదం పంట కోయడానికి ్రట్రాక్టర్‌లో వెళ్ళారు. పంట కోస్తున్న సమయంలో వర్షం పడటంతో ఇంటికి తిరిగి వెళ్దామని కూలీలు భావించారు. ఇంతలోనే విద్యుత్ మెయిన్ లైన్ తీగలు హఠాత్తుగా తెగిపడ్డాయి. తెగిన తీగలు కూలీలకు తాకడంతో నలుగురు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. దర్గహోన్నూరు గ్రామంలో విద్యుత్ తీగలు ఎప్పటినుంచో కిందికి వేలాడుతున్నాయని, అయితే అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వలనే ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మృతుల కుటంబాలకు రూ.10 లక్షల పరిహారం: మంత్రి పెద్దిరెడ్డి
వ్యవసాయ కూలీలు మృతి చెందిన ఘటనపై విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, క్షతగాత్రులకు మొరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. విద్యుత్ శాఖ ద్వారా మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, సిఎంఆర్‌ఎఫ్ ద్వారా మరో రూ. 5 లక్షలు కలిపి మొత్తం రూ. 10 లక్షల పరిహారం చెల్లిస్తామని ఆయన తెలిపారు. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు ఇంధన శాఖ స్పెషల్ సెక్రటరీని ఆదేశించామన్నారు. సంఘటన జరిగిన పరిధిలోని సబ్ డివిజినల్ ఏడీఈ, ఏఈఈ, లైన ఇన్‌స్పెక్టర్, లైన్‌మెన్ల్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆయన తెలిపారు.
4 killed with Electric Shock in Anantapur