మన తెలంగాణ, హైదారాబాద్ : తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రాన్ని టిటిడి విడుదల చేసింది. మొత్తం బ్యాంకుల్లో రూ. 15,938 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు తెలిపింది. బంగారం 10,258.37 కిలోలు ఉన్నట్లు టిటిడి పేర్కొంది. ఈ సందర్భంగా టిటిడి ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. మూడేళ్లలో శ్రీవారి నగదు డిపాజిట్లు భారీగా పెరిగినట్లు చెప్పారు. 2019 జూన్ నాటికి రూ. 13,025 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ. 15,938 కోట్లకు చేరిందన్నారు. అలాగే 2019 జూన్ నాటికి 7,339.74 కిలోల బంగారు నిల్వలు ఉండగా, అది ఇప్పుడు 10,258.37కి చేరిందని ఆయన చెప్పారు. టిటిడి డిపాజిట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీల్లో పెట్టుబడులుగా పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. టిటిడి ఇలా ఎప్పుడూ చేయదని, జాతీయ బ్యాంకుల్లోనే టిటిడి ఫిక్సిడ్ డిపాజిట్లు ఉన్నాయని అన్నారు.
టిటిడి ఫిక్సిడ్ డిపాజిట్ల విషయంలో ఎలాంటి వదంతులను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నూతన పరకామణి భవనంలో ఉన్న శ్రీవారి హుండీ కానుకలను త్వరలో లెక్కించనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌లో 22.72 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని, హుండీ కానుకల ద్వారా రూ.122.23 కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పారు. 1.08 కోట్ల మందికి లడ్డులను విక్రయించామని, 10.25 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించారు. డిసెంబర్ నుంచి ప్రయోగాత్మకంగా ఉదయం 8 గంటల నుంచి విఐపి బ్రేక్ దర్శనం అమలు చేస్తామన్నారు. అపన్నహృదయ స్కీమ్‌కు లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన భక్తుడికి 6 విఐపి బ్రేక్ దర్శనం టిక్కెట్లను జారీ చేస్తామన్నారు. వికలాంగులకు, వయోవృద్ధులు దర్శనానికి వెళ్ళే సమయంలో వారికి సహాయంగా శ్రీవారి సేవకుల ద్వారా సేవలు అందిస్తామని ఈవో ధర్మరెడ్డి వెల్లడించారు.