న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్లూఎస్)కు 10 శాతం కోటాను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ విషయంలో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ ముగించిన సుప్రీంకోర్టు సోమవారం తుది తీర్పును వెలువరించింది. 3:2 నిష్పత్తితో దీనికి సంబంధించిన తీర్పును వెలువరించింది. ఈడబ్లూఎస్ రిజర్వేషన్లను ధర్మాసనంలోని న్యాయమూర్తులు దినేశ్ మహేశ్వరి, బేలా త్రివేది, జెబి పార్దివాలా సమర్థించగా, భారత ప్రధాన న్యాయమూర్తి యుయు. లలిత్, మరో న్యాయమూర్తి రవీంద్ర భట్ వ్యతిరేకించారు.
ఈడబ్లూస్‌లకు 10 శాతం కోటా కల్పిస్తూ న్న రాజ్యాంగ సవరణ, రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని న్యాయమూర్తి దినేశ్ మహేశ్వరీ తీర్పును వెలువరించారు. ఈ రిజర్వేషన్లు సమానత్వ కోడ్‌ను ఉల్లంఘించడంలేదని, రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి అనేది ఎప్పటికీ ఒకేలా ఉండాలని లేదని వ్యాఖ్యానించారు. ఈ రిజర్వేషన్ కేటాయించడంలో ఎలాంటి వివక్ష లేదని జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు. వీరిద్దరి తీర్పులతో న్యాయమూర్తి జెబి పార్దివాలా ఏకీభవించారు. కాగా న్యాయమూర్తి రవీంద్ర భట్ మాత్రం వీరి అభిప్రాయాలను వ్యతిరేకించారు. ఈడబ్లూస్‌లకు 10 శాతం కోటా ఇవ్వడం అనేది రిజర్వేషన్‌పై పెట్టిన 50 శాతం పరిమితిని మించిపోతుందని జస్టిస్ రవీంద్ర భట్ అభిప్రాయపడ్డారు. దీన్ని భారత ప్రధాన న్యాయమూర్తి యుయు. లలిత్ కూడా సమర్థించారు.
కేంద్ర ప్రభుత్వం 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ రిజర్వేషన్లను తీసుకొచ్చింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లను కల్పించింది. దీన్ని సవాలు చేస్తూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లపై 1992లో సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని మించి ఈ కోటాను ఎలా ఇస్తారంటూ పలువురు పిటిషనర్లు నిలదీశారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం చివరికి ఈడబ్లూఎస్ రిజర్వేషన్లను సమర్థించింది.