Friday, January 10, 2025

జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మైనింగ్ లీజు  కేసు వ్యవహారంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఊరట లభించింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సోరెన్ దాఖలు చేసిన అప్పీళ్లను అత్యున్నత న్యాయస్థానం సోమవారం అంగీకరించింది. సోరెన్ గతంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక గని లీజును మంజూరు చేయించుకున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీనిపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం విచారణకు యోగ్యమంటూ గత జూన్ 3న జార్ఖాండ్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిని సుప్రీంకోర్టులో సోరెన్, జార్ఖాండ్ ప్రభుత్వం సవాలు చేయగా, జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం గత ఆగస్టులో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెలువరించేంత వరకూ పెడింగ్ పిటిషన్లపై చర్యలు చేపట్టరాదని కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సోమవారంనాడు పక్కనపెడుతున్నట్టు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

కాగా, మంత్రిగా ఉన్న సమయంలో మైనింగ్ లీజు కేటాయించుకున్నారనే ఆరోపణపై సోరెన్‌పై అనర్హత వేటు వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బిజెపి ఇటీవల ఫిర్యాదు చేసింది. సోరెన్‌పై చర్యకు సిఫారసు చేస్తూ ఎన్నికల కమిషన్‌ తన నిర్ణయాన్ని గవర్నర్‌కు పంపింది. అయితే గవర్నర్ ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ వ్యవహారంపై ఆయన ‘సెకెండ్ ఒపీనియన్’ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ కేసులో సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాతో పాటు పలువురు వ్యక్తులను ఈడి ఇటీవల అరెస్టు చేసింది. మిశ్రా ఇంటిలో లెక్కల్లో చూపించని 5.34 కోట్లు కనుగొన్నట్టు ఈడి చెబుతోంది. ఇందుకు సంబంధించి ఛార్జిషీటు కూడా నమోదు చేసింది. మిశ్రా, తదితరులపై బర్హార్వా పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన ఈడి…ఇటీవల సోరెన్‌కు సమన్లు పంపింది. అయితే విచారణకు మాత్రం ఆయన హాజరుకాలేదు. కాగా, సుప్రీంకోర్టు తాజా తీర్పుపై సోరెన్ హర్షం వ్యక్తం చేశారు. ”సత్యమేవ జయతే” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News