అడిలైడ్: టి20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకోవడంతో ఇక అందరి దృష్టి టీమిండియాపై నిలిచింది. రోహిత్ సేన కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి దాయాది పాక్‌తో అమీతుమీ తేల్చుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా ఫైనల్‌కు చేరడమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. రెండు జట్లలోనూ అగ్రశ్రేణి క్రికెటర్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం. ఇక ఇందులో గెలిచే టీమ్ ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది.
ఓపెనర్లే కీలకం..
ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలు కీలకంగా మారారు. రాహుల్ ఇప్పటికే రెండు అర్ధ సెంచరీలతో రాణించాడు. రోహిత్ మాత్రం ఒక్కసారి మాత్రమే ఈ మార్క్‌ను అందుకున్నాడు. కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో వీరిద్దరూ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోహిత్, రాహుల్‌లు తమ మార్క్ ఆటతో చెలరేగి పోతే టీమిండియాకు శుభారంభం ఖాయం. అయితే కెప్టెన్ రోహిత్ ఫామ్ జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఇంగ్లండ్‌పై అతను ఎలా ఆడతాడో అంతుబట్టకుండా మారింది. రాహుల్ మాత్రం ధాటిగా ఆడాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు.
జోరు సాగించాలి..
మరోవైపు ఈ ప్రపంచకప్‌లో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి, యువ సంచలనం సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నారు. ఇద్దరు ప్రతి మ్యాచ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నారు. పాకిస్థాన్‌పై కోహ్లి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడగా సూర్యకుమార్ పలు మ్యాచుల్లో జట్టుకు అండగా నిలిచాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో కూడా వీరిద్దరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. విరాట్, సూర్యలు చెలరేగితే భారత్‌కు భారీ స్కోరు ఖాయం. అంతేగాక వీరు నిలదొక్కుకుంటే ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా అలవోకగా ఛేదించడం కష్టం కాదు. ఇక వీరు కూడా మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇక హార్దిక్ పాండ్య కూడా తన బ్యాట్‌కు పని చెప్పాల్సి ఉంటుంది. భారత్‌ను సెమీస్‌కు చేర్చడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. ఈసారి కూడా అతని నుంచి జట్టు మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. కాగా, కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లలో ఎవరికీ చోటు లభిస్తుందో అంతుబట్టకుండా పోయింది. ఇదిలావుండగా బౌలింగ్‌లో కూడా భారత్ సమతూకంగా కనిపిస్తోంది. అడిలైడ్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉండడంతో యజువేంద్ర చాహల్‌ను ఆడించే ఛాన్స్ ఉంది. ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్, షమి, అర్ష్‌దీప్‌లు కూడా జట్టుకు కీలకంగా మారారు. సీనియర్ బౌలర్ అశ్విన్ కూడా నిలకడగా రాణిస్తుండడం భారత్‌కు కలిసి వచ్చే అంశమే. సమష్టిగా రాణిస్తే ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరడం టీమిండియాకు కష్టమేమీ కాదు.
వెంటాడుతున్న గాయాలు..
ఇక ఇంగ్లండ్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. గాయం కారణంగా కీలక ఆటగాడు డేవిడ్ మలాన్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. అతని లోటును పూడ్చడం చాలా కష్టంగా మారింది. ఇక మ్యాచ్ విన్నర్ ఫాస్ట్ బౌలర్ మార్క్‌వుడ్ కూడా ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను ఆడతాడా లేదా అనేది సందేహంగా మారింది. అతను కూడా దూరమైతే ఇంగ్లండ్‌కు మరిన్ని ఇబ్బందులు తప్పక పోవచ్చు. కాగా, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆశలన్నీ కెప్టెన్ జోస్ బట్లర్‌పైనే నిలిచాయి. బట్లర్, హేల్స్‌లు శుభారంభం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక బెన్‌స్టోక్స్, లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ తదితరులు కూడా మెరుగ్గా ఆడక తప్పదు. ఇదిలావుంటే శామ్ కరన్, వోక్స్, ఆదిల్ రషీద్, స్టోక్స్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా ఇంగ్లండ్‌లో ఉన్నారు. దీంతో ఇంగ్లండ్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో సెమీస్ సమరం ఆసక్తికరంగా సాగడం ఖాయం.
T20 World Cup: IND vs ENG Semi Final Today