Monday, December 23, 2024

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: గత కొద్ది రోజులుగా దేశంలో కలకలం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఇడి ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు, తాజాగా శరత్ చంద్రారెడ్డి, వినయ్‌బాబులను అరెస్టు చేసింది. వారిని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల కస్టడీ కి ఇవ్వాలని ఇడి అధికారులు విజ్ఞప్తి చేశారు. పిటిషన్ దాఖలు చేశారు. శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని ఇడి తరఫు న్యాయవాది కోరారు. అయితే వారం రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది. దర్యాప్తు సమయంలో అవసరమైన వైద్య సాయం ఇవ్వాలని చెప్పింది. సిసి కెమెరాల పర్యవేక్షణలో విచారణ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. నిందితులు కలవడానికి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని చెప్పింది. విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసులో కీలక పాత్ర పోషించారని అనుకుంటున్న అభిషేక్ బోయిన్‌పల్లిని ఇప్పటికే ఇడి అరెస్టు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరిని తాజాగా అరెస్టు చేయడం కలకలం రేపింది. సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో శరత్ చంద్రారెడ్డిని ఇడి ప్రశ్నించింది. అతడితో పాటుగా మరో మద్యం వ్యాపారి వినయ్ బాబును అరెస్టు చేసింది. శరత్, వినయ్‌బాబుకు భారీ ఎత్తున మద్యం వ్యాపారం ఉందని ఇడి అంటోంది. శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మాకంపెనీలో డైరెక్టర్‌గా ఉండటంతోపాటుగా ఆ గ్రూపునకు చెందిన 12 కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని ఇడి తెలిపింది. మద్యం కుంభకోణంలో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌ను సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రారెడ్డి ఇఎండిలు చెల్లించారన్న అభియోగాలపై ఆయన అరెస్టు అయ్యారు. ఢిల్లి లిక్కర్ పాలసీ ప్రకారం ఢిల్లీలో రిటైల్ లిక్కర్ లైసెన్స్‌లు పొందడానికి సిండికేట్‌లుగా ఏర్పడిన తయారీదారులు, పంపిణీదారులు, రిటైలర్ల అనుబంధంపై ఇడి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణ జరుపుతున్నాయి.

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈ కేసులో నిందితుడిగా పేర్కొనగా, ఇప్పటికే సిబిఐ గత నెలలో ప్రశ్నించింది. తాజాగా ఇద్దరినీ అరెస్టు చేసింది. విచారణ సమయంలో నిందితులు తప్పించుకున్నారని, అందుకే వారిని అరెస్టు చేశామని ఓ అధికారి తెలిపారు. కస్టడీ కోసం కోర్టులో హాజరుపరిచనట్టుగా వెల్లడించారు. అరబిందో ఫార్మా గ్రూప్ లింక్డ్ కంపెనీలు -ట్రైడెంట్ చెంఫార్ లిమిటెడ్, అవంతిక కాంట్రాక్టర్లు ఢిల్లీలో 18, 21, 24 మరియు 26 రిటైల్ జోన్‌లను పొందాయని ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, ట్రైడెంట్‌కు చెందిన కొంతమంది డైరెక్టర్లు అరబిందో కంపెనీలలో కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ రిటైల్ లైసెన్స్‌లకు వారి మద్యం పంపిణీదారు ఇండోస్పిరిట్ గ్రూప్ సమీర్ మహేంద్రు. ఏ కంపెనీ లేదా దాని సంస్థలు రెండు జోన్‌ల కంటే ఎక్కువ పొందేందుకు అనుమతించబడదని పాలసీ పేర్కొంది. శరత్ చంద్రా రెడ్డి అరెస్టు నేపథ్యంలో గురువారం నాటి ఇంట్రా-డే ట్రేడ్‌లో అరబిందో ఫార్మా షేర్లు బిఎస్‌ఇలో 6 శాతం పైగా పతనమై రూ.508.50 కనిష్ట స్థాయికి పడిపోయాయి. అరబిందో యాంటీ బాక్టీరియల్ నుండి యాంటిడిప్రెసెంట్స్ వరకు అనేక రకాల మందులను తయారు చేస్తుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కీలక సూత్రధారి శరత్ చంద్రారెడ్డే.. రిమాండ్ రిపోర్టులో ఇడి!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన పెనాక శరత్ చంద్రారెడ్డికి సంబంధించి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు ఆయనపై కీలక ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో సమర్పించిన శరత్ చంద్రారెడ్డి రిమాండ్ రిపోర్టులో ఆయనకు ఈ కుంభకోణంలో ఉన్న పాత్ర గురించి కీలక అంశాలను ప్రస్తావించారు. రిమాండ్ రిపోర్ట్ లో ఇడి అధికారులు ప్రస్తావించిన అంశాల ఆధారంగానే శరత్ చంద్రారెడ్డిని ఇడి కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక సూత్రధారి శరత్ చంద్రారెడ్డేనని ఇడి అధికారులు ఆరోపించారు. ఈ కుంభకోణంలో కీలక భూమిక పోషించినట్లుగా భావిస్తున్న సౌత్ గ్రూప్ ను శరత్ చంద్రారెడ్డి ఏర్పాటు చేసిందే నని ఇడి ఆరోపించింది.

అంతేకాకుండా సౌత్ గ్రూప్ ద్వారా ఏకంగా రూ.100 కోట్లను శరత్ చంద్రారెడ్డి ముడుపులుగా అందించగా, వినయ్ నాయర్ అనే వ్యక్తి మరో రూ.100 కోట్లను ముడుపులుగా అందించారని తెలిపింది. అంతేకాకుండా ఈ స్కాంలో ముడుపులు ముట్టజెప్పిన శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే భారీ ఎత్తున లాభాలు కూడా వెనకేశారని ఇడి తన రిపోర్టులో వెల్లడించింది. సౌత్ గ్రూప్ పేరిట రంగంలోకి దిగిన శరత్ చంద్రారెడ్డి ఢిల్లీలో 30 శాతం లిక్కర్ బిజినెస్‌ను తన గుప్పెట్లోకి తీసుకున్నారని ఇడి ఆరోపించింది. బినామీ కంపెనీల ద్వారా నగరంలోని 9 రిటైల్ జోన్లను శరత్ చంద్రారెడ్డి దక్కించుకున్నారని తెలిపింది. ఈ జోన్ల ద్వారా ఇప్పటికే ఆయన రూ.64.35 కోట్లను ఆర్జించారని, ఆ నిధుల్లో రూ.60 కోట్లను ఇండో స్పిరిట్ కంపెనీకి బదలాయించేశారని ఆరోపించింది.

140 ఫోన్లు.. లంచాలకు ప్రత్యేక వ్యవస్థ, లిక్కర్ స్కామ్ చేశారిలా..
లంచాలు ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను శరత్ చంద్రారెడ్డి ఏర్పాటు చేశాడని తెలిపింది. స్కామ్‌లో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రోలు కీలకపాత్ర పోషించినట్లు తేల్చింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 169 చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఇడి తెలిపింది. లిక్కర్ స్కామ్‌లో 34 మంది పాత్ర బయటపడిందని ఇడి వెల్లడించింది. 6 రిటైల్ జోన్ల కోసం పెద్ద మొత్తంలో ముడుపులను ఇచ్చినట్లు పేర్కొంది. రూ. 100 కోట్ల వరకు లంచాలు ఇచ్చినట్లు తెలిపింది. డిజిటల్ డివైజస్‌తో పాటు రికార్డులు సీజ్ చేశామని ఇడి స్పష్టం చేసింది. 34 మంది నిందితులు 140 ఫోన్లు మార్చారని, లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే ఫోన్లు మార్చినట్లు తెలిపింది. సెల్‌ఫోన్లు మార్చడం కోసం రూ.1.20 కోట్లు ఖర్చు చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది.

ED Arrest Sharat Chandra Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News