మనతెలంగాణ/హైదరాబాద్ : మేడ్చల్ హైవే ఔటర్ రింగ్‌రోడ్డుపై 220, 132 కెవి టవర్‌లు కిందపడకుండా విద్యుత్ అధికారులు అప్రమత్తమై ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ప్రమాదాన్ని పసిగట్టిన ఆ శాఖ ఉన్నతాధికారులు అవి కిందపడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించడంతో వారు వెంటనే కెవి టవర్‌లు కిందపడకుండా చర్యలు చేపట్టారు. ఒకవేళ ఈ టవర్‌లు కిందపడి ఉంటే సుమారుగా 50 మంది మృత్యువాత పడేవారని విద్యుత్ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే కెవి టవర్‌లు ఏర్పాటు చేసిన భూమికి సంబంధించిన యజమానులే ఆ టవర్‌ల నట్‌బోల్టులను విప్పినట్టు విద్యుత్ శాఖ అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యజమానిపై కేసు నమోదయ్యింది. అయితే విద్యుత్ శాఖకు చెందిన పెట్రోలింగ్ అధికారులు, సిబ్బంది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మేడ్చల్ హైవే ఔటర్ రింగ్‌రోడ్డుపై 220, 132 కెవి టవర్‌లు కిందపడకుండా తాత్కాలికంగా పునరుద్ధరణ పనులు చేసి విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సంబంధిత అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు.