Saturday, November 16, 2024

ట్రోఫీ కొట్ట్టేదెవరో?

- Advertisement -
- Advertisement -

టి20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ట్రోఫీలో ఫేవరెట్లుగా పరిగణించిన టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తదితర పెద్ద జట్లు ఇప్పటికే ఇంటిదారి పట్టాయి. ఏమాత్రం అంచనాలు లేని ఇంగ్లండ్, పాకిస్థాన్ టీమ్‌లు తుది పోరుకు చేరుకున్నాయి. ఇరు జట్ల మధ్య ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా ఫైనల్ సమరం జరుగనుంది. భారత్‌ను ఓడించి ఇంగ్లండ్ టైటిల్ పోరుకు దూసుకెళ్లగా, పటిష్టమైన న్యూజిలాండ్‌ను మట్టి కరిపించి పాకిస్థాన్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. 1992లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పాకిస్థాన్ జట్లు ఫైనల్లో తలపడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఇరు జట్లు తుది సమరంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈసారి టి20 ప్రపంచకప్‌లో రెండు ట్రోఫీ కోసం తలపడుతున్నాయి.

మెల్‌బోర్న్: ఇక ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదు. లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడం ఖాయమని అందరూ భావించిన సమయంలో పాకిస్థాన్ అనూహ్యంగా టైటిల్ పోరుకు అర్హత సాధించడం పెను సంచలనంగానే చెప్పాలి. సూపర్12లో భాగంగా ఆడిన తొలి రెండు మ్యాచుల్లో ఓడడంతో పాకిస్థాన్ ఇక ముందుకు సాగడం కష్టమేనని అందరూ భావించారు. చిరకాల ప్రత్యర్థి భారత్‌తో పాటు జింబాబ్వే చేతిలో పాకిస్థాన్ పరాజయం చవిచూసింది. ఇలాంటి స్థితిలో పాకిస్థాన్ ఇక ముందుకు వెళ్లడం కష్టమేనని విశ్లేషకులు సయితం అభిప్రాయపడ్డారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ పాకిస్థాన్ ఏకంగా ఫైనల్‌కు చేరుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
పాక్ సమష్టిగా రాణిస్తేనే..
అయితే ఇంగ్లండ్‌తో జరిగే ఫైనల్లో విజయం సాధించడం పాకిస్థాన్‌కు అంత తేలిక కాదనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న ఇంగ్లండ్‌ను ఓడించాలంటే సమష్టిగా రాణించడం ఒక్కటే పాకిస్థాన్ ముందున్న ఏకైక మార్గంగా చెప్పాలి. అయితే సెమీస్‌లో కివీస్ వంటి బలమైన జట్టును చిత్తుగా ఓడించడంతో పాకిస్థాన్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. అంతేగాక బాబర్ ఆజమ్, రిజ్వాన్‌లు ఫామ్‌లోకి రావడం జట్టుకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. మహ్మద్ హారిస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ తదితరులతో పాకిస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్, నవాజ్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు పాకిస్థాన్‌కు అందుబాటులో ఉన్నారు. రెండు విభాగాల్లో బలంగా ఉన్న పాకిస్థాన్ కూడా ట్రోఫీపై కన్నేసింది.
జోరుమీదుంది..
మరోవైపు సెమీస్‌లో బలమైన టీమిండియాను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్ ఫైనల్ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కిందటి మ్యాచ్‌లో అలెక్స్ హేల్స్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోవడం జట్టుకు ఊరటనిస్తోంది. అంతేగాక కెప్టెన్ జోస్ బట్లర్ కూడా జోరుమీదున్నాడు. బెన్‌స్టోక్స్, లివింగ్‌స్టోన్స్, మోయిన్ అలీ, హారి బ్రూక్, శామ్ కరన్, వోక్స్, ఆదిల్ రషీద్ వంటి అగ్రశ్రేణి క్రికెటర్లు జట్టులో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

T20 World Cup: PAK vs ENG T20 Final Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News