Monday, December 23, 2024

శ్రమించండి.. కొలువు సాధించండి: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

 

 

సిద్ధిపేట: పోలీసు ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు అభ్యర్థులు తపనతో సన్నద్ధం కావాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. పోలీసు కొలువు చేజిక్కించుకునేందుకు అంది వచ్చిన ఈ కెసిఆర్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మీరంతా పట్టుదలతో ఉద్యోగం సాధిస్తే.. ఒక ప్రజాప్రతినిధిగా అదే మాకు నిజమైన ఆనందమనిచెప్పారు.కేంద్ర బీజేపీ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేస్తూ.. అగ్నిపథ్ పేరిట కాంట్రాక్టు విధానం తేవడం హేయమైన చర్యగా కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించనున్నదని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మల్టీ పర్పస్ హైస్కూలులో ఆదివారం ఉదయం శిక్షణ పొందుతున్న 300 మంది రెండు చోట్ల నుంచి ఉన్న అభ్యర్థులకు మంత్రి హరీశ్ రావు సొంత ఖర్చుతో పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిణీ చేశారు.

మంత్రి చొరవతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల సన్నద్ధతలో భాగంగా జిల్లాలోని నాలుగు పట్టణాల్లో దేహ దారుఢ్య శిక్షణ శిబిర తరగతుల కసరత్తులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యేడు ఏప్రిల్ నుంచి 70 రోజుల పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు సిద్ధిపేట, గజ్వేల్ లో ప్రిలిమినరీ-రాత పరీక్షకు 1030 మందికి తర్ఫీదు అందించారు. ఈ శిబిరంలో 580 మంది పైగా అర్హత సాధించారని మంత్రి తెలిపారు. ఆసక్తి ఉన్న వారికి రెండవ దశలో తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించాం. జిల్లాలోని సిద్ధిపేట, దుబ్బాక, గజ్వేల్, చేర్యాల పట్టణాల్లో దేహ దారుఢ్య శిక్షణ కార్యక్రమం మొదలు పెట్టినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుల్ కు 333 అర్హత సాధించారని, ఎస్ఐకి 199 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు, వీరిలో పురుషులు- 342, స్త్రీలు- 190 మంది ఉన్నారని, మొత్తం 580 మంది అర్హతను సాధించారని మంత్రి చెప్పుకొచ్చారు.

కెసిఆర్ ఉచిత పోలీసు శిక్షణ స్క్రీనింగ్ శిక్షణ ప్రారంభిస్తే.. 5015 మంది పరీక్ష రాయగా, 1172 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరిలో 1038 మంది అభ్యర్థులు శిక్షణ పొందారని వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రిలిమినరీ పరీక్ష పూర్తయ్యిందనీ, ఇక ఫిజికల్ దేహ దారుఢ్య పరీక్ష మిగిలిందనీ, మీరంతా పట్టుదలతో ఉద్యోగం కోసం సాధన చేయాలని, అప్పుడే ప్రజాప్రతినిధులుగా మాకు నిజమైన ఆనందాన్ని ఇచ్చిన వారవుతారనీ మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని, వాటిలో 17 వేలు పోలీసు ఉద్యోగాలని తెలిపి, మీలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకే ఈ కెసిఆర్ శిక్షణ తరగతుల కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి వివరించారు.

త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు, వాటిలో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేయనున్నామని మంత్రి చెప్పారు. మంత్రి వెంట జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీపీ మహేందర్, ఏసీపీ దేవారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News