Monday, January 20, 2025

‘సిట్టింగ్‌’లకే సీట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ముందస్తూ ఎన్నికలన్నది కేవలం ప్రచారం మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. సిట్టింగ్ శా సనసభ్యులందరికి మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో పది నెలల సమయం మాత్రమే ఉండడంతో పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. దేశంలో బిజెపి చేస్తున్న వికృత రాజకీయ చేష్టలకు తెలంగాణ నుంచే చరమగీతం పాడుదామని ఆయన పిలుపునిచ్చారు. బిజెపిపై మనం చేస్తున్నది ధర్మయుద్ధమన్నారు. బిజెపిపై ఉద్యమం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామనే స్పష్టమైన సంకేతాన్ని దేశానికి ఇద్దామన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కమిటీ నాయకులతో కెసిఆర్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సుమారు 3 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు.

ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేంద్రంలో బిజెపి సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలపై పోరాటం చేయాల్సిందేనని పార్టీ శ్రేణులకు ఉద్భోదించారు. కమలం పార్టీ తీరుపై ఈ సందర్భంగా ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఐటి, ఇడి, సిబిఐ దాడుల పేరిట కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రత్యర్ధులపై దాడులు చేయిస్తోందని కెసిఆర్ విమర్శించారు. ఆ దాడులను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు కెసిఆర్ పిలుపునిచ్చారు. బిజెపితో పాటు ఇతర ప్రతిపక్షాల నుంచి రాజకీయంగా ఎదురు దాడి ఉంటుందన్న కెసిఆర్….ఆ దాడులను తిప్పికొట్టే దిశగా నేతలు సిద్ధం కావాలని సూచించారు. –ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం..న్యాయబద్ధంగా పోరాటం చేద్దామన్నారు. మనం ప్రజాస్వామ్యయుతంగా ఉన్నామని, ఏ తప్పు చేయనివాళ్లమన్నారు. అటువంటప్పుడు ఎవరికి ఎందుకు భయపడతామన్నారు. ఎటువంటి పరిణామాలనైనా నిటారుగా నిలబడి ఎదుర్కొందామన్నారు. ఈ మేరకు బిజెపిపై పోరు చేద్దామని కెసిఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.

గడువు ప్రకారమే ఎన్నికలు

రాష్ట్రంలో -షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని కెసిఆర్ తెలిపారు. ఎంఎల్‌ఎలను మార్చే ప్రసక్తే లేదన్నారు. సిట్టింగులందిరికి సీట్లు కేటాయిస్తామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్‌దే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్ని మనకే అనుకూలంగా ఉన్నాయన్నారు. 95 సీట్లను అవలీలగా గెలుస్తామన్నారు. ఇక శాసనసభ్యులంతా నియోజకవర్గాల వారీగా ప్రోగ్రెస్ కార్డులను రూపొందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాత నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ అందులో ఉండాలని సూచించారు.

లబ్దిదారుల పూర్తి సమాచారం కూడా ప్రజాప్రతినిధుల వద్ద వద్ద ఉండాలన్నారు. మునుగోడు తరహాలోనే శాసససభ్యులంతా ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జీని నియమించాలన్నారు. ఆ జాబితాను 10 రోజుల్లోగా పూర్తి చేసితనకు పంపాలని కెసిఆర్ ఆదేశించారు. ప్రతి ఎంఎల్‌ఎ నిత్యం ప్రజలతో మాట్లాడాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలన్నారు.- ఫోన్లు చేసి ఎవరైన పార్టీ మారుతారా? అని ఎవరైనా అంటే చెప్పుతో కొడతా అని గట్టిగా సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది ప్రజలుంటే….. 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీలో దర్జాగా ఉన్నామనే ధైర్యంగా ఉండాలన్నారు.

అన్ని సెగ్మెంట్లలో ఆత్మీయ సమ్మేళనాలు

శాసనసభ్యులు తమతమ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని కెసిఆర్ సూచించారు. అవి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండాలన్నారు. ఆత్మీయ సమ్మేళనం అంటే ఏదో భోజనాలు చేసి పోయాం అన్నట్టుగా ఉండకూడదన్నారు. వీటికి మంత్రులు కూడా హాజరు కావాలని ఆదేశించారు. నేతలంతా పార్టీ విజయానికి గట్టిగా కృషి చేయాలన్నారు. అనవసర విషయాల జోలికి వెళ్లరాదన్నారు. ఇక -జిల్లా పార్టీ కార్యాలయాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ సెక్రెటరీ జనరల్ కెకె ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

-త్వరలో తాను జిల్లా పర్యనలు చేస్తానని కెసిఆర్ స్పష్టం చేశారు.అలాగే దళితబంధు నియోజకవర్గానికి 500 కుటుంబాల చొప్పున లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు. -ధరిణితో 98 శాతం రెవెన్యూ సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. అయితే ఇంకా అక్కడక్కడా కొన్ని సమస్యలున్నాయన్నారు. వాటి పరిష్కారం కోసం నియోజకవర్గాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి…. ఆ మిగిలిన 2 శాతం సమస్యలు లేకుండా చేద్దామన్నారు. ఆలాగే రాష్ట్రంలో నెలకొన్న పోడు భూములను శాశ్వత పరిష్కారం లభించనుందని కెసిఆర్ స్పష్టంచేశారు. 11.5 లక్షల ఎకరాల భూములకు త్వరలోనే మోక్షం లభించనుందని పార్టీ నేతలకు కెసిఆర్ స్పష్టం చేశారు.

దాడులకు ఎవరూ భయపడొద్దు

కేంద్రంలోని మోడీ సర్కార్‌ను ప్రశ్నించిన వారిపై ఇడి, సిబిఐ, ఐటి దాడులకు పూనుకుంటున్నదన్నారు. బిజెపి కావాలనే బెదిరింపులకు దిగే ప్రయత్నం చేస్తోందన్నారు. కొంతమంది శాసనసభ్యుల మీద ఇడి దాడులకు సైతం పూనుకోవచ్చునని కెసిఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ దాడులకు ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదన్నారు. ధర్మంగా ఉన్నాం… న్యాయబద్ధంగా ఉన్నామన్నారు. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా దాడులు ఉంటాయని ఆందోళన చెందవద్దన్నారు. కేంద్రానికి దర్యాప్తు సంస్థలు ఉంటే… మనకు దర్యాప్తు సంస్థలు ఉన్నాయన్నారు.

అన్నింటికీ సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు. కాగా శాసనసభ్యుల కొనుగోలు వ్యవహారంలో త్వరలో మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉన్నదని సూచన ప్రాయంగా కెసిఆర్ వెల్లడించారు. -మునుగోడు ఎన్నికల్లో బిజెపి గూండాగిరి చేసింది…. దాదాగిరి చేసిందని కెసిఆర్ దుయ్యబట్టారు. అయినా ప్రజలు టిఆర్‌ఎస్‌వైపే నిలిచారన్నారు. దీన్ని బిజెపి జీర్ణించుకోలేకపోతున్నదని మండిపడ్డారు. బిజెపి దగ్గర రూ. 2లక్షల కోట్లు ఉన్నాయని ఎంఎల్‌ఎలకు ఎరవేసిన ఎపిసోడ్‌లో అడ్డంగా దొరికిన సింహయాజీ చెబుతున్నాడని కెసిఆర్ పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీకి ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? అని ప్రశ్నించారు. ఈ డబ్బును దేనికోసం వాడుతున్నారో తెలియజెప్పాల్సిన బాధ్యత మనమీద ఉందన్నారు.

ప్రతి ఒక్కరు కెసిఆర్ వలే నిలబడి…కలెబడాలి

బిజెపి రూపంలో దేశానికి చెదలు పట్టిందని కెసిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చెదలును రూపుమాపాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆ పార్టీ సాగిస్తున్న వికృత చేష్టలను టిఆర్‌ఎస్ శ్రేణులు ప్రతి నియోజకవర్గంలో ఎక్కడిక్కడ ఎండగట్టాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ ఒక్కో కెసిఆర్ వలె నిలబడి…. కలెబడాలన్నారు. –దేశ రక్షణ..ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆ పోరాటం తెలంగాణ గడ్డ నుంచే మొదలు కావాలన్నారు. బిజెపి కుట్రలను ఎక్కడిక్కడ చీల్చి చెండాడాలని కెసిఆర్ స్పష్టం చేశారు.

బిజెపి కుట్రలను ప్రపంచం ముందు నిలబెట్టగలిగాం

దేశమంతా విజయవంతంగా బిజెపి కుట్రలను చేయగలిగిందన్నారు. ఇందులో భాగంగా 8 రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అడ్డదారిలో కూల్చివేసిందని మండిపడ్డారు. కానీ తెలంగాణలో ఆ పార్టీ కుట్రలు పారలేదన్నారు. వారి కుట్రలను భగ్నం చేసి ప్రపంచం ముందు నిలబెట్టగలిగామన్నారు. ఈ కుట్రలకు సంబంధించిన 5 టెరాబైట్ల (దాదాపు 5లక్షల పేజీలకు సమానం) సమాచారం తన వద్ద ఉందన్నారు. అందుకే దేశంలోని అన్ని స్థాయిల న్యాయస్థానాలకు, దేశంలోని పార్టీ అధ్యక్షులు, సిఎంలకు అందరికీ బెజెపి నిజ్వరూపాన్ని పంపించామన్నారు. ఇక -ఎట్టి పరిస్థితుల్లోనూ బిజెపిని వదిలే ప్రసక్తే లేదని పార్టీ నేతలకు స్పష్టం చేశారు.

రాజ్యాంగ వ్యవస్థలన్నీ సర్వనాశనం

ప్రపంచంలోనే అహంకారం.. ఉన్మాదంతో రాజకీయాలు చేసే ఏకైక పార్టీ బిజెపి అని కెసిఆర్ మండిపడ్డారు.. దీన్ని నిజస్వరూపాన్ని తెలంగాణ బయటపెట్టిందన్నారు. -మనం చేసేది న్యాయపోరాటం… ధర్మపోరాటమన్నారు. కేంద్రంలో ఉన్న అహంకారంతో బిజెపి దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. -గడచిన 8 ఏండ్ల కాలంలో ఇడి అనేక కేసులు పెట్టిందని…. కానీ ఇప్పటి వరకు ఒక్క కేసును నిరూపించలేకపోయిందన్నారు.

దురుద్దేశ పూర్వకంగానే కవితపై ఆరోపణలు

ఢిల్లీ లిక్కర్ వ్యవహారంపై కెసిఆర్ ఇంత వరకు బహిరంగంగా స్పందించలేదు. పార్టీ నేతలతో అంతర్గత సంభాషణల్లోనూ ఈ అంశంపై స్పందించలేదు. కాని తొలిసారిగా పార్టీ కార్యవర్గ సమావేశంలో స్పందించారు. తన కుమార్తెను పార్టీ మారమని అడిగారని కెసిఆర చెప్పడం ద్వారా లిక్కర్ స్కాం కేసు ఈ కోణంలోనే వచ్చిందని చెప్పకనే చెప్పినట్లయింది. పార్టీ నేతలు కూడా ఈ విషయంలో కెసిఆర్‌కు సంఘిభావం తెలిపారు. బిజెపి నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీకి అండగా ఉంటామని చెప్పినట్లుగా తెలుస్తోంది. బిజెపి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తోందని… జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఐటి, ఇడి దాడులు జరిగే అవకాశం ఉందని అయినప్పటికీ భయపడవద్దని ఆందోళనకు గురి కావొద్దని ఎంఎల్‌ఎలకు, ముఖ్య నేతలకు ఈ సందర్భంగా కెసిఆర్ భరోసా ఇచ్చారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలపై గురి పెట్టారని వారి పేర్లను సమావేశంలో కెసిఆర్ వివరించినట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెస్‌ది ముగిసిన అధ్యాయం

-దేశంలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన అధ్యాయమని కెసిఆర్ వ్యాఖ్యానించారు. దేశమంతా రాహుల్‌గాంధీ జోడోయాత్ర చేస్తాడు కానీ… గుజరాత్ ఎన్నికలు ఉన్నాయని తెలిసి..అక్కడ జోడో యాత్ర చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అందుకే ఆ పార్టీ జాతీయ స్థాయి నుంచి నియోజకవర్గాల స్థాయికి దిగిజారిందన్నారు. ఇక పార్టీని తాను కాదుకదా…ఎవరేం చేసినా బతకదన్నారు. ఇక ఆ పార్టీకి గతవైభవమే తప్ప… భవిష్యత్ లేదన్నారు.

వామపక్షాలు మనతోనే

సిపిఐ, సిపిఎం పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్‌తోనే జతకట్టే అవకాశముందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. మునుగోడులో వారిచ్చిన సహకారం కూడా మరవరానిదన్నారు. ఈ నేపథ్యంలో మునుముందు కూడా వామపక్షాలతో కలిసి ముందుకే సాగే అవకాశముందన్నారు. ఇకపై అన్ని నియోజకవర్గాల్లోనూ వారిని కూడా కలుపుకుని పనిచేయాలని పార్టీ శ్రేణులకు కెసిఆర్ సూచించారు.

బెదిరింపు కాల్స్ వస్తున్నాయి… అందుకే ప్రగతి భవన్‌లో ఉన్నాం ఫాంహౌస్ కేసు అనంతరం తొలిసారి నలుగురు ఎంఎల్‌ఎలు మీడియాకు మరోసారి కలిసి కనిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడుతూ, తమను ఎవరు నిర్బంధించలేదని స్పష్టం చేశారు. చంపేస్తామంటూ తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ కోసమే మమ్మల్ని ప్రగతిభవన్‌లో ఉండాలని సిఎం కెసిఆర్‌ర్ సూచించారన్నారు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే ప్రగతిభవన్‌లో ఉంటున్నామన్నారు. సిఎం కెసిఆర్ వదిలిన బాణంగా ప్రజా క్షేత్రంలో పనిచేస్తామని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. అయితే తన నియోజకవర్గంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.100కోట్లు తీసుకుని ఎటో వెళ్లిపోయానని నియోజకవర్గంలో తనపై పోస్టర్లు వేసిన వ్యక్తుల రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News