Monday, December 23, 2024

అప్పులు, ఆర్థిక సంక్షోభ అమెరికా!

- Advertisement -
- Advertisement -

 

ప్రపంచ ఆధిపత్యం నాకే కావాలంటూ యుద్ధ పిపాసిగా మారిన సామ్రాజ్యవాద అమెరికా ఆర్ధిక వ్యవస్థ నేడు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈ సంక్షోభం ఆ దేశ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందే బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు తమ సామ్రాజ్యవాద విధానాల ఫలితంగా ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నాయి. జర్మనీ, ఇటలీ, జపాన్‌లు ఫాసిస్టు విధానాలతో దురాక్రమణ యుద్ధాలకు కూటమిగా సిద్ధమయ్యాయి. ఈ సామ్రాజ్యవాద దేశాల మధ్య వైరుధ్యాలను ఉపయోగించుకుని అమెరికా వివిధ దేశాల ఆంతరంగిక సమస్యల్లో జోక్యం చేసుకుంటూ, ఆయా ప్రజా వ్యతిరేక దోపిడీ ప్రభుత్వాలకు మద్దతుగా ఉంటూ, ఆ దేశాల సహజ వనరులను కొల్లగొడుతూ, ఆయుధాల వ్యాపారం చేస్తూ ఆర్ధికం గా సామ్రాజ్యవాద శక్తిగా బలపడింది. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఫాసిస్టు కూటమి ఓడిపోవటం, బ్రిటన్, ఫ్రాన్స్‌లు బలహీన పడటం, అమెరికా బలపడటం జరిగింది. బ్రిటన్ ఫ్రాన్స్‌లను వెనక్కి నెట్టి సామ్రాజ్యవాద అగ్ర రాజ్యంగా అవతరించింది.

సామ్రాజ్యవాద అగ్ర రాజ్యంగా ఎదిగే కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా మారి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడినట్లు కన్పించి కార్మికులకు కొన్ని సౌకర్యాలు ఏర్పడినట్లు ప్రచారం జరిగిన కొద్ది కాలంలోనే దాని డొల్లతనం బయటపడింది. ప్రపంచ ఆధిపత్య విధానాల్లో భాగంగా అనేక దేశాల్లో పెట్టుబడిదారీ విధాన రక్షక పోజుపెడుతూ, కమ్యూనిజాన్ని నిరోధించేందుకు, విప్లవోద్యమాలను అణచివేసేందుకు అనేక దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో సైనిక జోక్యం చేసుకుంది. వియత్నాం, కాంబోడియా, లావోస్‌లలో దోపిడీ ప్రభుత్వాలకు అండగా సైనికులను, ఆయుధాలను పంపి విప్లవోద్యమ అణచివేతకు పూనుకుని అపజయం పాలై తీవ్ర సంక్షోభంలో పడటమే కాకుండా ప్రపంచ వ్యాపితంగా ప్రజా వ్యతిరేకతను చవిచూసింది. దేశ ఆర్ధిక వ్యవస్థ తిరోగమనం ప్రారంభమైంది. ఫలితంగా అమెరికాలోని ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు 1980లో ప్రజల దగ్గర నుంచి షేర్ల రూపంలో డబ్డులు వసూలు చేశాయి.

సరళీకరణ ఆర్థిక విధానాలను రూపొందించి ప్రపంచ దేశాలపై రుద్ది ఆ దేశాల సంక్షోభాలకు కారణమైంది. తన దేశంలోనూ అమలు జరిపి చిన్నచిన్న కంపెనీలు దివాలా తీసేలా చేసింది. 1990 నాటికి అమెరికా మొత్తం ఆర్థిక వ్యవస్థ కొద్ది కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. 2001లో టెక్నాలజీ కంపెనీలు 5 లక్షల కోట్ల డాలర్లు నష్టపోయాయి. విస్తృతంగా గృహ రుణాలు ఇచ్చిన సంస్థలు అవి వసూలుకాక కూలిపోయాయి.

అమెరికా ఆర్థిక సంక్షోభం నిరంతరం పెరుగుతూనే ఉంది. దాని నుంచి బయటపడటానికి ఇతర దేశాల సహజ వనరులను కొల్లగొట్టం, అందుకు అడ్డంకిగా వున్న దేశాధి నేతలను కుట్రలతో తొలగించటం, అది సాధ్యం కాకపోతే సైనిక దాడి చేయటం లక్ష్యంగా పెట్టుకున్నది. ముడి చమురు కారు చవకగా తరలించుకుపోవటానికి అంగీకరించని ఇరాక్‌పై యుద్ధం, లిబియాపై దాడి, ఆ దేశ నేతల హత్యలు, ఇరాన్‌పై ఆంక్షలు అందులో భాగంగా జరిగినవే. ఇలా దురాక్రమణ, యుద్ధాలు చేసినా ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడక పోగా సంక్షోభం పెరుగుతూ వస్తున్నది. దురాక్రమణ, యుద్ధాల వలన సైనిక ఖర్చు పెరగటమే అందుకు కారణం. యుద్ధాల వలన తమ జీవన ప్రమాణాలు పడిపోవటం వలన యుద్ధాలను ఆపాలని అమెరికా ప్రజలు ఆందోళన చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం లో అమెరికా విధానాలకు వ్యతిరేకంగా రష్యా ఆయిల్ ఎగుమతులు ఆపివేయటం వలన, ఆహార వస్తువుల దిగుమతి తగ్గటం వలన వాటి ధరలు విపరీతం పెరిగాయి.

సంపన్న దేశమని, భూతల స్వర్గమని అమెరికా గురించి భ్రమల్లో ఉన్న వారికి, దానికి ఉన్న అప్పులు గమనిస్తే అది భూతల స్వర్గం కాదని ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశమనే వాస్తవం వారి భ్రమలను తొలగిస్తుంది. వాస్తవం. 2000 సంవత్సరంలో అమెరికా విదేశాలకు చెల్లించాల్సిన అప్పులు 5.6 ట్రిలియన్ (ఒక ట్రిలియన్ డాలర్లు లక్ష కోట్లు) డాలర్లు. అది క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2007లో ప్రపంచ ఆర్థిక క్షీణత ఏర్పడిన సందర్భంలో అమెరికా జాతీయ రుణం 9.2 ట్రిలియన్లకు చేరింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 20 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. తాజాగా అమెరికా ట్రెజరీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం అమెరికా జాతీయ అప్పులు 30 ట్రిలియన్ డాలర్లు. చైనా, జపాన్ దేశాల నుండే అమెరికా ఎక్కువ అప్పులు తీసుకున్నది.

ఈ రెండు దేశాలు లక్ష కోట్ల డాలర్ల చొప్పున అమెరికాకు అప్పు ఇచ్చాయి. అమెరికా చేసిన అప్పుల వలన ఆ దేశంలోని ఒక్కొక్కరిపై 73,308 డాలర్ల అప్పు ఉంది. ఈ విధంగా ప్రపంచంలోనే అత్యంత రుణగ్రస్థ దేశంగా అమెరికా ఉంది. ఆయుధ శక్తి బెదిరింపులతో రుణాల చెల్లింపు వత్తిడి చేయకుండా కొన్ని దేశాలను కట్టడిచేస్తున్నది. అమెరికా జిడిపి విదేశీ అప్పులో 70% దాకా ఉంది. అమెరికాలో నేడు ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ప్రజల జీవితాలను కల్లోల పరుస్తున్నది. ద్రవ్యోల్బణం అదుపు లేకుండా పెరుగుతున్నది. స్టేట్ ఫెడరల్ రిజర్వు గత నాలుగు నెలలకు సంబంధించిన ద్రవ్యోల్బణ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 5% ఉండగా మే నెలలో 8.6%, జూన్ లో 9.1%, జులైలో 8.5%, ఆగస్టులో 8.3%గా అది నమోదైంది. దేశంలో ఏర్పడిన ద్రవ్యోల్బణం వల్ల ఆ దేశ ప్రజల్లో భయాలు ఏర్పడుతున్నాయి. మార్కెట్‌లో అంచనాలకు తగ్గట్టు పరిస్థితులు లేకపోవటం, 8% మించి ద్రవ్యోల్బణం ఉండటం, నిత్యావసర వస్తువుల ధరలు గత జులైతో పోలిస్తే విపరీతంగా పెరగటం, ఫలితంగా వినియోగదారుల కొనుగోలు ఖర్చు భారీగా పెరగడం అ భయానికి కారణం. ధరల పెరుగుదల వలన పేదలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవటం వలన నిరుద్యోగం పెరిగుతూ ఉంది.

దేశంలో ఏర్పడిన ద్రవ్యోల్బణం దృష్ట్యా వడ్డీ రేట్లు తగ్గించాలని మార్కెట్ వర్గాలు కోరుకుంటున్నాయి. కాని అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచటానికి సిద్ధమైయింది. ఫలితంగా అభివృద్ధి రేట్ పడిపోతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. 9,300 కోట్ల ఏకంగా డాలర్లను నష్టపోయాయి. ధరలను అదుపు చేయటానికి రెండు నెలల క్రిందట బైడెన్ 43 వేల కోట్ల డాలర్లను ప్రకటించాడు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. బైడెన్ మాటలకు విరుద్ధంగా దేశంలో వాస్తవ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.

అమెరికాలో ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం అనేక దేశాలపై ప్రభావం చూపుతుంది. భారత దేశంలో ఎక్కువగానే దీని ప్రభావం ఉంటుం ది. ప్రస్తుతం డాలర్ విలువ 80 రూపాయలకు చేరింది. ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచితే డాలర్ విలువ మరింత పెరుగుతుంది. భారీగా దిగుమతులు చేసుకుంటున్న మన దేశం వేల కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాలి. ఫలితంగా దేశంలో ధరలు విపరీతంగా పెరుగుతాయి. అమెరికా దేశ ఆర్ధిక విధానం మేడి పండులాంటిదని, ఇతర దేశాల వనరులను తరలించుకుపోయి బతికే పరాన్నభుక్కని, దాని పెట్టుబడిదారీ విధానమే సంక్షోభాలకు కారణమని ప్రపంచ ప్రజలు, అమెరికా ప్రజలు గ్రహించి దాని సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించి సోషలిస్టు వ్యవస్థను సాధించుకోవటం ద్వారా ప్రపంచ ప్రజలు, అమెరికా ప్రజలు సంక్షోభం నుంచి బయటపడి జీవన ప్రమాలు పెరుగుతాయని తెలుసుకోవాలి.

బొల్లిముంత సాంబశివరావు- 9885983526
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News