ఇండోనేషియాలోని బాలిలో మంగళ, బుధవారాల్లో జరుగుతున్న గ్రూపు (జి) 20 దేశాల సదస్సుకు ఈసారి విశేష ప్రాధాన్యమున్నది. ఇది ఇండియాకు ప్రత్యేకించి, ప్రపంచానికి విశేషించి ఏర్పడినదని చెప్పుకోవాలి. ఈ గ్రూపు అధ్యక్షతను ఈ సదస్సులో ఇండోనేషియా నుంచి భారత్ స్వీకరిస్తుండడం మనకు సంబంధించిన విశేషమైతే తీవ్రమైన ఆహార, ఇంధన సంక్షోభాన్ని సృష్టిస్తున్న రషా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా చైనా సంబంధాల్లో ఉద్రిక్తత, అనిశ్చితి నేపథ్యంలో జరుగుతుండడం ప్రపంచానికి సంబంధించి ఈ సదస్సు సంతరించుకున్న ప్రాధాన్యత.
అభివృద్ధి చెందిన, చెందుతున్న ప్రపంచాలకు ప్రాతినిధ్యం వహించే ప్రధాన దేశాల ఉమ్మడి వేదికగా ఇంకా సజీవంగా కొనసాగుతున్న జి 20లో సభ్య దేశాలుగా ఇండియా, ఆస్ట్రేలియా, అర్జెంటైనా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరపు యూనియన్ వున్నాయి. అంటే ప్రపంచ జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) లో 85 శాతానికి, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతానికి, మూడింట రెండొంతుల ప్రపంచ జనాభాకు ఈ వేదిక ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఇటువంటి దేశాల బృందానికి అధ్యక్షత వహించే అవకాశం ఈసారి భారత దేశానికి అందిరావడం మనపై వచ్చి చేరుతున్న కీలక అంతర్జాతీయ బాధ్యతగా పరిగణించాలి.
ప్రపంచ ఆహార, ఇంధన భద్రత కోసం పని చేయడం, అభివృద్ధి ఫలాలు సమానంగా పంపిణీ అయ్యేందుకు దోహదపడడం, మహిళల సాధికారతలో మరింత ప్రగతి సాధ్యమయ్యేలా చూడడం వంటి బాధ్యతలను ఈ వేదిక ద్వారా వచ్చే ఏడాది కాలంలో భారత దేశం నిర్వహించవలసి వుంటుంది. అలాగే యుద్ధానికి తెర దించడం వైపు తనకు చేతనైన పాత్రను పోషించవలసి వుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అస్థిరతను, సంక్షోభాన్ని తొలగించేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో కలిసి పని చేయవలసి వుంటుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య సోమవారం నాడు చోటు చేసుకొన్న చర్చలు ఆ రెండు దేశాల మధ్య సంబంధాల్లో చెప్పుకోదగిన మార్పును సూచించలేదు.
అయినప్పటికీ డోనాల్డ్ ట్రంప్ హయాం నాటి పరిస్థితులతో పోల్చుకుంటే ఈ రెండు బలమైన దేశాల మధ్య స్వలంగానైనా మెరుగైన సంబంధాలు అంకురించే సూచనలు కనిపించాయి. బైడెన్ జి జిన్‌పింగ్ మధ్య 3 గం. పాటు జరిగిన చర్చలే ఆ రెండు దేశాలు గతం కంటే కొంచెమైనా భిన్నంగా నడుచుకొనే అవకాశాలను సూచిస్తున్నాయి. చర్చల తర్వాత బైడెన్ మీడియాతో మాట్లాడుతూ తమ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అవసరం కనిపించడం లేదని, తైవాన్‌పై దాడికి చైనా పథక రచన చేస్తున్నదని తాను అనుకోడం లేదని అన్నారు. నాయకులు ఇద్దరి మధ్య నిర్మొహమాటంగా, దాపరికం లేకుండా చర్చలు జరిగినట్టు స్పష్టపడుతున్నది. తైవాన్‌పై రెండు దేశాలు ఇప్పటికే తాము ప్రకటించుకొన్న వైఖరులను మళ్ళీ స్పష్టం చేసుకొన్నాయి.
ఉత్తర కొరియా ఆయుధ విస్తరణ కార్యక్రమాన్ని చైనా గనుక ఆపకపోతే అక్కడి దక్షిణ కొరియా తదితర తన మిత్ర దేశాలను కాపాడడానికి మరిన్ని చర్యలు తీసుకోవలసి వస్తుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చైనా అధినేత జి జిన్‌పింగ్‌కు తెలియజేసినట్టు వార్తలు చెబుతున్నాయి. గత ఆగస్టులో ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌ను సందర్శించినప్పుడు అమెరికాతో అనేక చర్చల ద్వారాలను చైనా ఏకపక్షంగా మూసివేసింది. ఇప్పుడు అంతర్జాతీయ వాతావరణ పరిరక్షణ చర్చల్లో భాగంగా ద్వైపాక్షిక సంబంధాలను, సంభాషణలను పునరుద్ధరించుకోవాలని అమెరికా, చైనాలు నిర్ణయించుకోడం మంచి పరిణామం. అలాగే వాణిజ్య సంబంధాల్లో కూడా అనవసరమైన స్పర్దలకు, పగ సాధింపులకు అవి రెండూ స్వస్తి చెప్పవలసి వుంది.
చిప్స్ (సెమీ కండక్టర్స్) వ్యాపారంలో చైనాకు నష్టం కలిగించే ఎగుమతి నియమాలను అమెరికా ఇటీవల ప్రకటించింది. ఇటువంటివి ఆ రెండు దేశాల మధ్య ముందు ముందు ఉద్రిక్తతలకు దారి తీయకుండా చూడవలసిన బాధ్యత ఎక్కువగా అమెరికాపై వుంది. బాలిలో అధినేతల మధ్య జరిగిన చర్చలకు కొనసాగింపుగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింక్ చైనా వెళ్లనున్నారు. తమ ఇద్దరి మధ్య అవగాహన కుదిరిందని భావిస్తున్నట్టు జి జిన్‌పింగ్‌తో చర్చల తర్వాత బైడెన్ ప్రకటించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో చైనా తన వైఖరిని మార్చుకోలేదు.
కాని అణ్వస్త్రాలను ప్రయోగించాలనే యోచనకు మళ్లరాదని బైడెన్, జిన్‌పింగ్ ఇద్దరు ఏకాభిప్రాయం ప్రకటించినట్టు తెలుస్తున్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సదస్సుకు హాజరు కాలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వీడియో ద్వారా జి 20 దేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా, నాటో, యూరపులు రష్యాతో సమగ్ర చర్చలు జరపాలని జి జిన్‌పింగ్ చేసిన సూచన ఆచరించదగినది. ఎనిమిది మాసాలుగా కొనసాగుతున్న యుద్ధానికి తెర పడి ప్రపంచానికి ఆహార, ఇంధన భద్రత కలగాలంటే చర్చలకు తెర లేవాలి.