తెలంగాణలో మరో 170 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి గ్రీన్‌సిగ్నల్
త్వరలో రూ. 2,919 కోట్ల నిధులను విడుదల చేయనున్న కేంద్రం ?
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో మరో 170 కిలోమీటర్ల మేర (ఐదు) జాతీయ రహదారుల విస్తరణకు రంగం సిద్ధం అవుతోంది. నాలుగు రహదారులు, ఒక వంతెన నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ పరిధిలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ (ఎస్‌ఎఫ్‌సి) దీనికి ఆమోదముద్ర వేసినట్టుగా సమాచారం. ఆయా పనులకు రూ. 2,919 కోట్ల వ్యయం అవుతుందని ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు. వాటిలో సుమారు 3 కి.మీ.ల మేర ప్రతిష్టాత్మకంగా నిర్మించే వంతెనకు రూ. 1,100) కోట్లు ఖర్చుకానుండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తీగల వంతెన రూపంలో వారధి రానుంది. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల వరకు నిర్మించనున్న ఈ రహదారిలో భాగంగా సోమశిల వద్ద కృష్ణానదిపై నాలుగు వరుసలుగా ఈ వంతెన నిర్మాణం జరగనుంది.
వంతెన సహా అయిదు రహదారుల విస్తరణకు…
వంతెన నిర్మాణాన్ని వచ్చే సంవత్సరంలో మంజూరు చేయాలని తొలుత కేంద్రం భావించినా ఈ ఏడాదే దానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. వంతెన సహా అయిదు రహదారుల విస్తరణకు అవసరమైన రూ. 2,919 కోట్లు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
రహదారులతో పాటు వంతెనకు సంబంధించిన వివరాలు ఇలా…
రహదారులతో పాటు వంతెనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమశిల వద్ద (కృష్ణానది) వంతెనపై 3 కి.మీ.ల దూరానికి వారధి నిర్మాణానికి వ్యయం రూ.1,083 కోట్లు అవుతుందని అధికారులు కేంద్రానికి పంపిన డిపిఆర్‌లో పేర్కొన్నారు. ఎల్లారెడ్డి టు రుద్రూరుకు జాతీయ రహదారికి సంబంధించి 52 కి.మీల దూరానికి రూ.500 కోట్లు, ఆదిలాబాద్ టు బేల 33 కి.మీల దూరానికి రూ.491 కోట్లు, ఖమ్మం టు కురవిల మధ్య 38 కి.మీల దూరానికి రూ.446 కోట్లు, మెదక్ టు ఎల్లారెడ్డిగూడ జాతీయ రహదారికి సంబంధించి 44 కి.మీల దూరానికి రూ.399 కోట్ల అంచనా వ్యయం అవుతుందని అధికారులు పేర్కొన్నారు.