మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపిలో చేరేందుకు తాను న్యూఢిల్లీకి వచ్చినట్టుగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. బుధవారం నాడు న్యూఢిల్లీలో మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను ఢిల్లీకి రావడం కొత్తేం కాదన్నారు. తాను ఇంకా రాజకీయాల్లోనే ఉన్నానని చెప్పారు. తాను ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీల నేతలున్నారన్నారు. ఢిల్లీలో వ్యక్తిగత పనుల కోసం వచ్చినట్టుగా శశిధర్ రెడ్డి చెప్పారు. తాను బిజెపిలో చేరుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన మీడియాకు చెప్పారు. ప్రతి నెల తాను ఢిల్లీకి వస్తానని మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. ఈ దఫా ఢిల్లీకి వచ్చిన సమయంలో పార్టీ మారేందుకు వచ్చినట్టుగా ప్రచారం జరగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బిజెపి నేతలు తనతో చర్చించలేదన్నారు.
ఈ ఏడాది ఆగస్టు మాసంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్లపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పు బట్టారు. మాణికం ఠాగూర్ పార్టీ వ్యవహరాలపై పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష పోకడలను ఆయన తప్పుబట్టారు. ఈ పరిణామాల తర్వాత సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ ను కూడా ఆయన కోరారు. ఈ పరిణామాల తర్వాత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కన్పించడం లేదు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగింది. తెలంగాణాలో పలు పార్టీల్లోని అసంతృప్తులకు బిజెపి గాలం వేస్తుంది. ఈ తరుణంలో మర్రిశశిధర్ రెడ్డి రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో పార్టీ మారేందుకు వచ్చారనే ప్రచారం సాగిందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. బిజెపి చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కూడా మంగళవారం ఢిల్లీకి రావడం, అదే రోజున శశిధర్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఊహగానాలు వెలువడ్డాయి.
Marri Shashidhar Reddy clarity about to joins BJP