మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో గత కొంత కాలంగా కుల గణన చేపట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియార్ నాయకులు వి.హనుమంతరావు సైతం కుల గణన అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో కుల గణనను వెంటనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కుల గణనకు సంబంధించిన సరైన సమాచారం లేని కారణంగా న్యాయంగా అందాల్సిన ఫలాలు ఆయా వర్గాలు అందడం లేదని ఆయన పేర్కొన్నారు. వివరాల్లోకెళ్తే.. దేశంలో కుల గణనను వెంటనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ బుధవారం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, కుల గణనకు సంబంధించిన డేటా లేకపోవడం వల్ల ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి)లతో పాటు సంబంధిత వర్గాల వారు విద్య, ఉద్యోగాలు, పలు సంక్షేమ పథకాలలో రిజర్వేషన్‌లలో వారికి రావాల్సిన ఫలాలను పొందడం లేదన్నారు.
కుల గణనపైనా, ఒబిసిలపై జాతీయ విధాన పత్రం రూపొందించాలన్నా కేంద్రానికి ఎలాంటి ఆసక్తి లేదని ఆరోపించారు. కేంద్రంలోని బిజెపి సర్కారు కావాలనే ఇలా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఒబిసి సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకుంటున్నారనీ, ఆయన కేవలం మాటలకే పరిమితం అయ్యారని ఆరోపించారు. ఇప్పటి వరకు వారి కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. 27 మంది ఒబిసి ఎంపిలను తన కేబినెట్‌లో చేర్చుకోవడం మినహా, ఒబిసి వర్గానికి చెందిన ప్రజలకు ప్రధాని చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఒబిసి ఎంపిలకు కేబినెట్ బెర్త్‌లు వచ్చాయి. సామాన్యుల సంగతేంటి? అని ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. అలాగే, క్రీమీలేయర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. దీనితో పాటు రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని కూడా ఆయన పేర్కొన్నారు. బిసిలకు వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు.
V Hanumantha Rao demands for Caste Census