మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రంలో ముంపు సమస్యల తీవ్రత పెరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలిపింది. తమ రాష్ట్రం లో ముంపు సమస్యలకు సంబంధించిన పరిష్కాలను చూపాకే ముందుకు వెళ్లాలని అథారిటీ అధికారులకు తేల్చిచెప్పింది. బుధవారం నాడు హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పోలవరం రిజర్వాయర్ వెనుక జలాలకు సంబంధించిన సమస్యలను తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించింది.
ఈ ఏడాది జు లై నెలలో భారీవర్షాలు , గోదావరి నదికి వచ్చిన వరదలు, తెలంగాణ రాష్ట్ర భూబాగంలో గోదావరి నదికి ఇరువైపుల వచ్చిన వరద ముంపు నష్టాల వివరాలను సమావేశం ముందు ఉం చింది. భద్రాచలం మండలంలో 4గ్రామాలు, దుమ్ముగూడెంలో 25, చర్లలో 28 , బూర్గంపాడ్‌లో11,అశ్వాపురుంలో 18, మనుగూరులో 5, పినపాక మండంలో 11గ్రామాలు గోదావరి ముంపు సమస్యను ఎదుర్కొన్నట్టు తెలిపింది. మొత్తం 103గ్రామాలు వరదముంపునకు ప్రభావితం అయ్యాయని వివరించింది. ఈ గ్రామాల పరిధిలో గోదావరి వదరల కారణంగా 40446 ఎకరాలకు నష్టం వాటిల్లినట్టు తెలిపింది. అంతకుముందే పోలవరం బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణలో 892ఎకరాలకు ముంపునకు గురవుతున్నట్టు గుర్తించామని తెలిపింది.
పాల్వంచ మండలంలో సీతారామనగరం, దుమ్ముగూడెం మండలంలో తురబాక, అశ్వాపురంలో అనందపురం, బూర్గంపాడు మండలంలో నగనేని ప్రోలు, మొతి,రావినీడు గ్రామలపై ప్రభావం పడుతున్నట్టు తెలిపింది. పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర పరిధిలోని పెద్దవాగు, ఈదుల వాగు, పాములేరు వాగు, తురబక వాగుల్లో నీరు ఎగదన్నుతున్నట్టు తెలిపింది. ముర్రేడు వాగు, కిన్నెరసాని నదుల్లో ప్రవహించే నీరు గోదావరి నదిలో కలవనీయకుండా పోలవరం వెనుకజలాలు ఎగదన్నుతున్నాయని తెలిపింది. రాష్ట్ర పరిధిలోని మేజర్, మీడియం కింద ఉన్న 31 స్ట్రీమ్స్‌పై ఆ ప్రభావం పడుతున్నట్టు పోలవరం అథారిటీకి వివరించింది.
రూ.45కోట్లతో పంపింగ్ వ్యవస్థ:
భద్రాచలం పట్టణం దిగువ స్థాయిలో ఉన్నందున పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం భద్రాచలంపైన అధికంగా ఉంటుందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఇక నిరంతరం భద్రాచలం గోదావరి వరదనీటిలోనే ఉండే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఆందోళన వెలిబుచ్చింది. భద్రాచలం , సారపాకల నుంచి వదర నీటిని నిరంతరం తోడిపోసేందుకు 5300హెచ్‌పి సామర్ధంతో కూడిన పంపింగ్ వ్యవస్థ అవసరం అని పోలవరం అథారిటీకి తెలిపింది. ఈ పంపింగ్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.45కోట్లు అవసరం అని ప్రాధమికంగా అంచనా వేసినట్టు తెలిపింది.
ఏపిలో అనధికారిక ఎత్తిపోతల పథకాలు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదీజాలను ఉపయోగించుకునేందుకు అనధికారికంగా పలు ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం పోలవరం అథారిటీ దృష్టికి తెచ్చింది. పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజిని కూడా తరలించేందుకు ఈ ఎత్తిపోతల పథకాలు చేపట్టిందని ఫిర్యాదు చేసింది. గోదావరి నదీయాజమాన్య బోర్డు గాని , అపెక్స్‌కౌన్సిల్ గాని వాటికి ఎటువంటి ఆమోదం తెలపలేదని వివరించింది. వెంటనే వాటి డిపిఆర్‌లను పరిశీలించాలని డిమాండ్ చేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో కేంద్ర జలసంఘం అధికారులతోపాటు తెలంగాణ నుంచి ఈఎన్సీ మురళీధర్, మోహన్ కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, ఏపి నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషన్ కుమార్ ఈఎన్సీ నారాయణరెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి సర్వేకు ఏపి అంగీకరించింది:ఈఎన్సీ మురళీధర్:
పోలవరం బ్యాక్ వాటర్ సమస్యను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఉమ్మడి సర్వేకు ఏపి అంగీకరించిందని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. సమావేశం ముగిశాక ఈఎన్సీ మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు అన్ని రాష్ట్రాల అంశాలను కేంద్ర జలసంఘం పరిగణలోకి తీసుకునే అధ్యయనం చేయడానికి అంగీకరించినట్టు తెలిపారు.
2023జనవరికి కాఫర్‌డ్యాం పూర్తి:శశిభూషణ్
గోదావరి నదిపై చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాల్లో భాగంగా ప్రాజెక్టు దిగువన కాఫర్‌డ్యాం పనులు 2023జనవరి నాటికి పూర్తి చేస్తామని ఏపి నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషన్ కుమార్ వెల్లడించారు. జూన్‌నాటికి ప్రధాన డ్యాం పనులు గ్రౌండ్ లెవల్ వరకూ తీసుకు వస్తామన్నారు. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాచ ఇక ఉమ్మడి సర్వే అవసరం ఏముందని శశిభూషణ్ కుమార్ పేర్కొన్నారు.