మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: గద్వాల జిల్లా కేంద్రం ఆసుపత్రి శ్రీనివాస్ కాలనీలోని ఆర్‌ఎంటి మెయిన్ ఇంట్లో అద్దెకు ఉంటున్న టైలర్ సనా ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చొరబడి రెండు తులాల బంగారం, 20 తులాల వెండి అపహరించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్‌ఎంటి మెయిన్ ఇంట్లో నివాసం ఉంటున్న సనా టైలర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత బుధవారం రాత్రి చింతల్‌పేట్ కాలనీలో నివాసం ఉంటున్న తన అత్త, మామ ఇంటికి కుటుంబ సభ్యులతో వెళ్లారు. గురువారం ఉదయం తను ఇంటికి వచ్చి చూసే సరికి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి రెండు తులాల బంగారం, 20 తులాల వెండి అపహరించారని పేర్కొన్నారు.
బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని సిసి కెమెరా ద్వారా కదలికలను పరిశీలించారు. ఆదే విధంగా క్లూస్ టీం ద్వారా వేలి ముద్రలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో చోరి జరగడం పట్ల పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎమ్మెల్యే ఉండే కాలనీలో భద్రత లేకుంటే సామాన్య కాలనీలలో భద్రత ఏ విధంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలల నుంచి పట్టణంలో చోరీలు జరుగుతున్నాయని, పోలీసులు రాత్రి సమయంలో గస్తీ పెంచి పెట్రోలింగ్ చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Gold stolen in Gadwal Town