Monday, December 23, 2024

బోణీ కొట్టేదెవరో?

- Advertisement -
- Advertisement -

వెల్లింగ్టన్: ప్రపంచకప్‌లో చేదు ఫలితాలను చవిచూసిన భారత్, న్యూజిలాండ్ జట్లకు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ సవాల్‌గా మారింది. వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు సెమీ ఫైనల్ దశలోనే ఇంటిదారి పట్టాయి. పాకిస్థాన్ చేతిలో కివీస్, ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే మెగా టోర్నీలో ఎదురైన చేదు అనుభవాన్ని అంతటి ముగించి మళ్లీ గెలుపు బాటలోప్రయాణించాలనే ఉద్దేశంతో రెండు జట్లు సిరీస్‌కు సిద్ధమయ్యాయి. ఇరు జట్లు కూడా కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి. టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్, సీనియర్లు విరాట్ కోహ్లి, బుమ్రా, దినేశ్ కార్తీక్, అశ్విన్, షమి తదితరులు లేకుండానే భారత్ సిరీస్‌లో తలపడనుంది. ఇక కివీస్ కూడా స్టార్ బౌలర్ బౌల్ట్‌కు విశ్రాంతి ఇచ్చింది.

అందరి కళ్లు సూర్యపైనే
ఇక ఈ సిరీస్‌లో అందరి కళ్లు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై నిలిచాయి. కొంతకాలంగా సూర్యకుమార్ అసాధారణ బ్యాటింగ్‌తో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్‌లోనూ అతను పరుగుల వరద పారించాడు. టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న సూర్య కివీస్‌పై చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. కీలక ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించిన నేపథ్యంలో ప్రస్తుతం జట్టు భారమంతా సూర్యపైనే నెలకొంది. అతను ఎలా రాణిస్తాడనే దానిపైనే భారత్ భారీ స్కోరు ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. మరోవైపు ఈ మ్యాచ్‌లో అతన్ని ఓపెనర్‌గా దింపినా ఆశ్చర్యం లేదు.

ఓపెనర్‌గా ఇషాన్?
ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. వరల్డ్‌కప్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కలేదు. సీనియర్లు సిరీస్‌కు దూరంగా ఉండడంతో వీరికి జట్టులో స్థానం లభించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో వీరున్నారు. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే ఇషాన్, గిల్‌లలో ఎవరూ నిలదొక్కుకున్నా ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందులు ఖాయం. మరోవైపు సంజు శాంసన్, కెప్టెన్ హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్‌లు కూడా జట్టుకు కీలకంగా మారారు. సంజు తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌కు కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక రిషబ్ కూడా మెరుపులు మెరిపించక తప్పదు. హార్దిక్ ఫామ్‌లో ఉండడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. కాగా, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడాలలో ఎవరికీ తుది జట్టులో స్థానం దక్కుతుందో ఆసక్తిగా మారింది. అయితే సుందర్‌తో పోల్చితే దీపక్‌కే ఛాన్స్ దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇదిలావుంటే యువ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ ఖాన్‌కు తుది జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. అర్ష్‌దీప్ సింగ్, సీనియర్ భువనేశ్వర్ కుమార్, చాహల్‌లు బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. సీనియర్లు లేకున్నా భారత్ బలంగానే ఉండడంతో కివీస్‌కు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

ఫేవరెట్‌గా..
మరోవైపు ఆతిథ్య న్యూజిలాండ్ సిరీస్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ప్రపంచకప్‌లో ఆడిన జట్టునే దాదాపు ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. ఒకరిద్దరూ కీలక ఆటగాళ్లను తప్పిస్తే వరల్డ్‌కప్‌లో ఆడిన ఆటగాళ్లకే జట్టులో చోటు దక్కింది. ఫిన్ అలెన్, డెవోన్ కాన్వే, కెప్టెన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిఛెల్, జేమ్స్ నిషమ్ తదితరులతో కివీస్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక టిమ్ సౌథి, సాంట్నర్, ఫెర్గూసన్, మిల్నే వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో సిరీస్‌లో కివీస్‌కే మెరుగైన అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

IND vs NZ 1st T20 Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News