అక్టోబర్ నెలలో మన ఎగుమతులు దాదాపు 17 శాతం (16.7 శాతం) తగ్గి, దిగుమతులు 5.7 శాతం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ రోగగ్రస్థమై వున్నదని చాటుతున్నది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన సరకుల ఎగుమతుల విలువ అక్టోబర్ నెలలో 29.8 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2021 ఫిబ్రవరి నుంచి గడిచిన 20 మాసాలలో మన నెలవారీ ఎగుమతుల విలువ 30 బిలియన్ డాలర్ల దిగువకు పతనం కావడం ఇదే మొదటిసారి. అదే సమయంలో గత ఏడాదితో పోలిస్తే మన దిగుమతులు 5.7 శాతం పెరిగిపోయాయి. విదేశీ వాణిజ్య లోటు మరింతగా ఎగబాకి 26.91 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. మన దిగుమతులు, ఎగుమతుల మధ్య అఖాతం 25 బిలియన్ డాలర్లకు మించిపోడం అక్టోబర్‌తో వరుసగా నాలుగు మాసాలు కావడం ఆందోళనకరం. ఎలెక్ట్రానిక్ వస్తువుల వంటి కొద్ది రంగాలలో ఎగుమతులు పెరిగినా పారిశ్రామిక యంత్రాలు, పరికరాలు వంటి ఇంజినీరింగ్ సామాగ్రి ఎగుమతులు 21 శాతం పడిపోయాయి.
భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే రెడీ మేడ్ వస్తువులు, వజ్రాలు, నగల రంగం ఎగుమతులు సైతం అదే స్థాయిలో దిగజారిపోయాయి. నూలు, చేనేత, హస్తకళల ఉత్పత్తుల ఎగుమతులు గత ఏడాది కంటే సగానికి పతనమయ్యాయి. వస్తువుల ఎగుమతులలో వాణిజ్య లోటు సెప్టెంబర్‌లో 25.71 బిలియన్ డాలర్లు వుండగా, అక్టోబర్‌లో ఇది 26.91 బిలియన్ డాలర్లకు పెరిగింది. రానున్న మాసాల్లో మన వస్తువులకు విదేశాల్లో గిరాకీ మరింత తగ్గి వాణిజ్య లోటు పెరిగిపోతుందని, స్థూల దేశీయోత్పత్తి దెబ్బ తింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ వికాసం అయినా అక్కడి సామగ్రికి విదేశాల్లో ఉండే గిరాకీపైనే ఆధారపడి వుంటుంది. పొరుగునున్న చైనా వాణిజ్య మిగులు ఎప్పుడూ పర్వత ప్రమాణంగా వుంటుంది. అది తన మానవ వనరులను వినియోగించి, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రయోగించి విదేశీ వాణిజ్యంలో విశేష లాభాలు గడిస్తూ వుండడం కొత్త విషయం కాదు.
జులైలో చైనా విదేశీ వాణిజ్య మిగులు 101 బిలియన్ డాలర్లకు చేరుకోడం గమనించవలసిన విషయం. ప్రధాని మోడీ ప్రభుత్వం యువతలో నైపుణ్యాలు పెంచడం, పరిశ్రమల్లో వారికి ఉద్యోగావకాశాలు పెరిగేటట్టు చూడడం వైపు దృష్టి పెట్టినట్టు ప్రచారం చేస్తున్నప్పటికీ దాని ఫలితం నామమాత్రం. మేకిన్ ఇండియాపై డప్పు కొట్టుకున్నంతగా దాని ప్రయోజనాలు సిద్ధించడం లేదు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు బంద్ కావడంతో యువత ప్రైవేటు రంగం వైపు ఆశగా చూస్తున్నది. కాని అక్కడ శ్రమకు తగిన ప్రతిఫలం లేని పరిస్థితి నెలకొన్నది. అధిక గంటల పని అతి తక్కువ వేతనంతో వారి ఆశలు అడియాసలవుతున్నాయి. చవకగా కార్మికులు లభిస్తున్నారనే పరిస్థితిని సృష్టించి విదేశీ పరిశ్రమలను ఆకట్టుకోడానికి కార్మిక చట్టాలను మార్చినప్పటికీ ఫలితం లభించలేదు. మన ఎగుమతులు తగ్గడానికి అంతర్జాతీయ పరిస్థితులు కూడా కారణమే. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలు రెండూ మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి.
ద్రవ్యోల్బణాన్ని అడ్డుకొనేందుకు అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను మరింగా పెంచుతూ పోతుందని భావిస్తున్నారు. అది మన రూపాయి విలువ మీద, మన ఆర్థిక వ్యవస్థ మీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది. చైనాలో కొవిడ్ నిర్మూలన (జీరో కొవిడ్) విధానం అక్కడి రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బ తీస్తున్నది. పర్యవసానంగా గత ఏడాదితో పోలిస్తే గత ఏప్రిల్‌లో చైనాకు భారతీయ ఎగుమతులు మూడో వంతు పడిపోయాయి. మన దేశంలో ఉక్కు మీద 15 శాతం సుంకం విధించడంతో దాని ఎగుమతులు దారుణంగా దెబ్బతిన్నాయి. సర్వీసుల రంగం లో ఎగుమతులు ప్రస్తుతానికి బాగా వున్నప్పటికీ అంతర్జాతీయ మాంద్యం దెబ్బ వాటికి కూడా తగులుతుందని భావిస్తున్నారు. డాలర్‌తో రూపాయి విలువను కాపాడడం కోసం విశేషంగా డాలర్లను మార్కెట్‌లోకి విడుదల చేయడం వల్ల మన విదేశీ మారక ద్రవ్య నిధులు తగ్గాయని కూడా తెలుస్తున్నది.
ఎగుమతులను ఎంతో కొంత మేరకు పెంచుకోడానికి అంది వచ్చే ఒక మార్గం విదేశాలతో పరస్పర వాణిజ్య ఒప్పందాలు చేసుకోడం. ఆయా సరకులపై పరస్పరం సుంకాలు తగ్గించుకోడం ద్వారా ఎగుమతులను పెంచుకోవచ్చు. ఇప్పటికే ఇండియా అనేక దేశాలతో విదేశీ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నది. మరి కొన్ని దేశాలతో ఒప్పందాలపై సంప్రదింపులు జరుగుతున్నాయి. తాజాగా బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ముందు కు సాగుతున్నాయి. ఈ ఒప్పందం కింద అనేక సరకులపై కస్టమ్స్ సుంకాలను తగ్గింప జేసుకోగలిగితే బ్రిటన్‌కు మన జౌళి, తోలు, వజ్రాలు, నగల ఎగుమతులు పెరిగి ఈ రంగాల్లో ఉద్యోగాలు, ఉపాధులు లభిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా విదేశీ మార్కెట్లను విశేషంగా ఆకట్టుకోగలిగే స్థాయి నైపుణ్యంతో వస్తూత్పత్తి చేసుకోగలిగినప్పుడే చైనా మాదిరిగా మనం కూడా భారీ ఎత్తున ఎగుమతులను సాధించి వాణిజ్య లోటును మిగులుగా మార్చుకోగలుగుతాము.