బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి
బిఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు
21న హాజరు కావాలి.. హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తాం
నోటీసులో పేర్కొన్న సిట్
కేరళ నుండి హైదరాబాద్‌కు చేరుకున్న సిట్ బృందం
తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌లకు నోటీసులు జారీ
21న కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని సిట్ కార్యాలయంలో విచారణ
మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో సిట్ అధినేత సివి ఆనంద్ నేతృత్వంలోని సిట్ బృందం తమ దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లయింది. ఈ నెల 21న బిఎల్ సంతోష్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని సిట్ కార్యాలయానికి హాజరు కావాలని సిఆర్‌పిసి 41 ఏ నోటీసులు ఇచ్చింది. సిట్ కార్యాలయంలో సోమవారం ఉ.10.30 గంటలకు హాజరు కావాలని సదరు నోటీసుల్లో సిట్ పేర్కొంది. విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేస్తామని కూడా సదరు నోటీసులో సిట్ పేర్కొంది. కాగా, మొయినాబాద్ ఫాం హౌస్‌లో టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు ప్రలోభాల కేసులో కేరళకు వెళ్లిన సిట్ బృందం శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకుంది.
దాదాపుగా ఐదు రోజలపాటు సిట్ బృందం కేరళలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జగ్గుస్వామి అనే డాక్టర్ ఈ వ్యవహరంలో కీలకంగా వ్యవహరించినట్టుగా సిట్ బృందం గుర్తించింది. సిట్ బృందం విచారణకు వస్తుందనే విషయాన్ని గుర్తించిన జగ్గుస్వామి పారిపోయాడు. జగ్గుస్వామి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నల్గొండ ఎస్‌పి రాజేశ్వరి నేతృత్వంలో సిట్ బృందం కేరళలో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో కూడా సిట్ బృందం సోదాలు చేసిన విషయం విదితమే. కేరళకు చెందిన తుషార్‌కు రామచంద్రభారతికి జగ్గుస్వామి మధ్యవర్తిగా వ్యవహరించినట్టుగా సిట్ బృందం గుర్తించిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణలో భాగంగా సిట్ బృందం నోటీసులు జారీ చేసింది. తుషార్ , జగ్గుస్వామి, కరీంనగర్ కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌కు సిట్ బృందం నోటీసులు జారీ చేసింది.ఈ నెల 21న విచారణకు రావాలని సిట్ బృందం నోటీసులు పంపింది.
కాగా, ఈ ముగ్గురిని బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్న సిట్ కార్యాలయంలో సోమవారం సిట్ అధికారులు విచారించనున్నారు. సతీష్ శర్మ అలియాస్ రామచంద్రభారతి, సింహయా జులు స్వామీజీ, నందకుమార్‌లు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను ప్రలోభాలకు గురిచేశారని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చంపేట ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎంఎల్‌ఎ బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎంఎల్‌ఎ రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిలను ఈ ముగ్గురు ప్రలోభాలకు గురి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులు జైల్లో ఉన్నారు. ఈ కేసును హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందం విచారిస్తుంది.
తమ పార్టీకి చెందిన ఎంఎల్ ఎలకు ప్రలోభాల వెనుక బిజెపి ఉందని టిఆర్‌ఎస్ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలను బిజెపి తోసిపుచ్చింది. ఈ కేసును సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్‌తో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ విషయమై సిబిఐ దర్యాప్తునకు హైకోర్టు అంగీకరించలేదు. సిట్ దర్యాప్తునకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఇదిలా ఉండగా, జగ్గుస్వామి, తుషార్‌ను ప్రశ్నిస్తే ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో కీలక సమాచారం వచ్చే అవకాశం ఉందని సిట్ అధినేత సివి ఆనంద్ నేతృత్వంలోని సిట్ భావిస్తోంది. ఇక సింహయాజులు స్వామీజీకి తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి శ్రీనివాస్ టికెట్ బుక్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ ఇద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది, ఎవరైనా చెబితే టికెట్ బుక్ చేశారా? అనే కోణంలోనూ సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సతీష్ శర్మ అలియాస్ రామచంద్రభారతి, తుషార్‌కు మధ్యవర్తిగా జగ్గుస్వామి వ్యవహరించినట్లు సిట్ దర్యాప్తులో తేల్చిన సంగతి విదితమే.