మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ జీవన ప్రమాణాలు పాటించి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని టిఎస్ ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో హెల్త్ ఛాలెంజ్ ను అన్ని డిపోలు, యూనిట్లలో నిర్వహించి ఆరోగ్య సమస్యలపై మార్గనిర్దేశం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆరోగ్య సంక్షేమంలో భాగంగా ఈ హెల్త్ ఛాలెంజ్ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4,898 మంది మహిళా ఉద్యోగినీలతో సహా 50 వేల మందికి పైగా ఉన్న సిబ్బందికి వైద్య పరీక్షల నిర్వహణ కోసం అన్ని రీజియన్లలో 25 వైద్య బృందాలు పాల్గొని సేవలు అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే టిఎస్ ఆర్టీసిలో 20 వేల మంది ఉద్యోగుల ఆరోగ్య పరీక్షల వివరాలను సేకరించామన్నారు. ఎవరికైతే ఆరోగ్య పరీక్షల్లో ఎమర్జెన్సీ లక్షణాలు కనిపిస్తే తక్షణమే డాక్టర్ల సూచన మేరకు ఆస్పత్రిలో వారికి మెరుగైన చికిత్స కోసం చేర్చడం జరుగుతుందన్నారు.
అవసరమైన మందులు ఉచితంగా….
సంస్థ ఉద్యోగులు తార్నాక ఆసుపత్రిలో వైద్య సేవల కోసం వివిధ జిల్లాల నుంచి వస్తుంటారని, వారికి వైద్య పరీక్షలతో పాటు మెరుగైన చికిత్స, అవసరమైన మందులను ఇక్కడే ఉచితంగా అందజేస్తున్నామని ఆయన తెలిపారు. తార్నాక ఆసుపత్రిలో 24 గంటల ఫార్మసీ, డయాగ్నస్టిక్ సేవలు కార్డియాలజీ, నెఫ్రాలజీ, గైనిక్ సేవల కోసం పూర్తిస్థాయి సిబ్బంది పనిచేస్తున్నారన్నారు.
తార్నాక ఆసుపత్రిలో గతంతో పోలిస్తే ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే ఉద్యోగులతో పాటు బయట నుంచి వచ్చేవారు (ఔట్ పేషెంట్స్) పెరుగుతున్నారన్నారు. తార్నాక ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు, పరీక్షలు అందుబాటులో ఉన్నాయని ఇంకా ఇక్కడ లేని సౌకర్యాల కోసం అవసర నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి రెఫర్ చేయడం జరుగుతుందన్నారు. ఆర్టీసి ఉద్యోగులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న నిమ్స్ సిబ్బందికి బాజిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.