మన తెలంగాణ, హైదరాబాద్ : రవాణశాఖలోని కేంద్ర మోటార్ వాహన చట్టంలో అనేక నిబంధనలు ఉన్నా వాటిలో కొన్ని కూడా అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రోడ్డు మీదకు వచ్చే ప్రతి వాహనానికి కనీసం థర్డ్ పార్టీ బీమా పాలసి తప్పని సరిగా ఉండాలనే నిబంధన కేంద్రమోటార్ వాహన చట్టంలో స్సష్టంగా చెబుతోంది. రోడ్లమీద తిరిగే అనేక వాహనాలకు అసలు బీమా సౌకర్యం లేదు. వాహనం కొనుగోలు చేసిన సమయంలో మాత్రం మూడు నాలుగు సంవత్సరాల ఇన్సూరెన్స్ చెల్లించడం జరుగుతుంది. అనంతరం బీమా చేయడం అనేది సుమారుగా ఉండదనే చెప్పవచ్చు.
వీటిలో ప్రధానంగా ప్రైవేట్, వ్యక్తిగత వాహనదారుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వారు నడిపించే కార్లు, ద్విచక్రవాహనాల బీమా చెల్లించడమనేది 80 శాతం పాటించడం లేదంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక ట్రాన్స్‌పోర్టు వాహణాలకు ప్రతి సంవత్సరానికి ఒక సారి ఫిట్‌నెస్, పర్మిట్ విధానం తప్పనిసరి చేయడంతో వాహనం ఖచ్చితంగా రవాణాశాఖకు వచ్చి రావాల్సి ఉండటం, బీమా, కాలుష్య నియంత్రణ దృవీకరణ పత్రం లేకుండా ఫిట్‌నెస్ చేయరు. దీంతో కొందరు థర్డ్ పార్టీ బీమా చేస్తుంటే మరి కొందరు నఖిలీ బీమా పత్రాలను తెచ్చి ఫిట్‌నెస్ చేయించుకుని బయటపడుతున్నారు. దీనికి అసరా చేసుకుని రవాణశాఖ అధికారులు దండుకుంటున్నారే విమర్శలు కూడా ఉన్నాయి.
మన రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు కొదవ లేదు. ప్రతి సంవత్సరం జరుగుతున్న ప్రమాదాలలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతుంటే, మరి కొంత మంది అంగవైకల్యం పొందుతున్నారు. అయితే ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు ప్రధానకారణాలలో ఒకటి రోడ్డు పరిస్థితి అయితే మరోకటి ర్యాశ్ డ్రౌవింగ్ కారణం అవుతుంది. రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే ఆకుటుంబం చాలా నష్టపోతుంది. ఈ షాక్ నుంచి తట్టుకోవడం, మధ్యతరగతి కుటంబాలకు సాధ్యం కాదు. ప్రధానంగా కుటుంబంలో వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం మొత్తం కుప్పకూలుతుంది. ఇంటిపెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్రమైన ఆర్దిక సంక్షోభంలో చిక్కుకుంటుంది. అయితే ప్రమాదానికి గురైన వాహనానికి బీమా ఉంటే ఆ కుటుంబానినికి జరిగే నష్టాన్ని కొంత మేరకైనా పూడ్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
ప్రమాదాలలో పోయిన ప్రాణాలను తీసుకురాలేము . కానీ బీమా వల్ల పరిహారం అయినా ఆకుటుంబానికి ఆసరగా నిలుస్తుంది. అయితే మన దేశంలో సగానికి పైగా వాహనాలకు ఎటువంటి బీమా ఉండదు. రెండు సంవత్సరాల క్రితం సుప్రీం కోర్టు బీమాకు సంబంధించిన కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించింది. కనీసం కొత్తవాహనాలు కొనుగోలు చేసే సమయంలోనే ఫోర్ వీలర్స్‌కు మూడు సంవత్సరాలు, ద్విచక్ర వాహనాలకు 5 సంవత్సరాలకు సంబంధించి ఒకే సారి బీమా వసూలు చేయాలని ఆదేశించింది. ఈ నిబంధన 2019 సెప్టెంబర్ 1 నుంచి రవాణశాఖ అమల్లోకి తీసుకు వచ్చింది.
అయితే వాహనదారులు నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాహనం కొనుగోలు చేసిన సమయంలోనే జీవిత కాల ఇన్సూరెన్స్ కూడా వసూలు చేస్తే బాగుంటుందనే చర్చ తెరమీదకు వచ్చినా అందుకు బీమా సంస్థలకు ముందుకు రాక పోవడంతో ఏడాది కొకసారి బీమా చేయించే విధానాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో కొత్త వాహనం బీమా పూర్తియిన తర్వాత సగానికి పైగా వాహన యజమానులు పట్టించు కోవడంలేదనేది జగమెరిన సత్యం. అసలు బీమా చేయడం వల్ల యజమానికి ఎటువంటి నష్టం వాటిల్లదు. ప్రమాదం జరిగినా బాధితులకు కూడా అన్యాయం జరగకుండా ఉంటుంది. అంతే కాకుండా కొందరు తమ వాహనాలకు బీమా చెల్లించాల్సి ఉన్నప్పటికి ఏడాదికోసారి విధానం కావడం, తేదీ మరిచిపోవడం, వంటి సమస్యలతో ఇబ్బందులు పడ్డసంఘటనలు అనేకం ఉన్నాయి.