Monday, December 23, 2024

‘పరిహార నిధి’ ఏర్పాటుకు సంపన్న దేశాల అంగీకారం..

- Advertisement -
- Advertisement -

‘పరిహార నిధి’ ఏర్పాటుకు సంపన్న దేశాల అంగీకారం
ఈజిప్టు ‘కోపా 27’ సదస్సులో ఎట్టకేలకు కుదిరిన చరిత్రాత్మక ఒప్పందం
పేద దేశాల హర్షం
షరమ్ ఎల్ షేక్: ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ఈజిప్టులోని షరమ్ ఎల్‌షేక్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్ 27 చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ విపత్తుల కారణంగా నష్టపోయే పేద, వర్ధమాన దేశాలను ఆదుకునేందుకు పరిహార నిధిని ఏర్పాటు చేయడానికి మొట్ట మొదటిసారిగా సంపన్న దేశాలు అంగీకరించాయి. విచ్చలవిడి పోకడలతో పర్యావరణ విపత్తులకు ప్రధాన కారకులైన సంపన్న దేశాలు వాటివల్ల తీవ్రంగా నష్టపోతున్న పేద, వర్ధమాన దేశాలను ఆదుకునేందుకు భారీ పరిహార నిధిని ఏర్పాటు చేయాలని భారత్‌తో పాటుగా పలు దేశాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఇందుకోసం ఏటా ఏకంగా వంద బిలియన్ డాలర్లు వెచ్చిస్తామంటూ 2009లో సంపన్న దేశాలు చేసిన హామీని ఇప్పటికీ నిలుపుకోకపోవడంతో ఈ విషయంలో పలు దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. అలాగే పలు అంశాలపై ఏకాభిప్రాయం మృగ్యం కావడంతో వాస్తవానికి శుక్రవారం ముగియాల్సిన ఈ 12 రోజుల సదస్సు శనివారం కూడా కొనసాగింది. అయినప్పటికీ పలు అంశాలపై పీట ముడి కొనసాగడంతో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు కొనసాగాయి. చివరికి ఆదివారం తెల్లవారుజాము సమయానికి పరిహార నిధి ఏర్పాటుపై ఒక అంగీకారం కుదిరింది.

పేద దేశాల విజయం
పర్యావరణ మార్పులవల్ల తలెత్తుతున్న వరదలు, వర్షాభావం, కరవులు, హీట్ వేవ్‌లు, తుపానులు వంటి విపత్తుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్న వర్ధమాన, పేద దేశాలు అందుకు కారణమవుతున్న సంపన్న దేశాలు పరిహారం చెల్లించాలని దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కుదిరిన ఈ ఒప్పందం ఆ దేశాలకు విజయమనే చెప్పాలి. అయితే భూతాపానికి మూల కారణమైన శిలాజ ఇంధనాల వాడకం సమస్యకు మాత్రం ఈ ఒప్పందం ఎలాంటి పరిష్కారాన్ని చూపకపోవడం గమనార్హం. ‘శిలాజ ఇంధనాల వాడకాన్ని వీలయినంత త్వరలో నిలిపివేయాలన్నది గత సదస్సులో నే చేసిన ఏకగ్రీవ తీర్మానం. అయితే ఇప్పటికీ వాటి వాడకం పెరిగిపోతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. నిజానికి శిలాజ ఇంధన పరిశ్రమే సదస్సులో ప్రతి అంశాన్ని తన కనుసన్నల్లో నియంత్రిస్తోంది’ అంటూ వర్ధమాన దేశాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

ముఖ్యంగా ఆతిథ్య దేశం ఈజిప్టు రూపొందించిన సంప్రదింపుల పత్రం నిస్సారమంటూ పలు దేశాలు పెదవి విరిచాయి. అందులోని పలు అంశాలపై తీవ్ర అసంతృప్తి, అభ్యంతరాలు వెలిబుచ్చాయి. ఇలాగైతే గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న లక్షాన్ని చేరుకోవడం అసాధ్యమేనంటూ పలు దేవాలు విమర్శలు గుప్పించాయి.‘ 1.5 డిగ్రీల లక్షం’తో పాటుగా యూరోపియన్ యూనియన్ తాజాగా చేసిన పలు ప్రతిపాదనలను బుట్టదాఖలు చేయడంపై యూరప్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒక దశలో అ దేశాలు వాకౌట్ చేస్తామని కూడా బెదిరించాయి. దీంతో దిగివచ్చిన ఈజిప్టు సంప్రదింపుల పత్రంలో పెను మార్పులు చేసింది. ఈ పత్రంపై శనివారం రాత్రంతా చర్చలు జరిపిన అనంతరం ఎట్టకేలకు ఒక అంగీకారం కుదిరింది. దీనిపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

‘ఈ ఒప్పందం పర్యావరణ మార్పుల వల్ల నష్టపోయిన దేశాల ఆవేదనకు సానుకూలంగా స్పందించిందని చెప్పవచ్చు. మేము 30 ఏళ్లుగా ఈ మార్గంపై పోరాటం చేస్తున్నాం’ అని పరిహార నిధి కోసం పోరాటం చేస్తున్న పేద దేశాల కూటమి తరఫున మాట్లాడిన పాకిస్థాన్ పర్యావరణ శాఖ మంత్రి షెర్రీ రెహమాన్ అన్నారు.‘ ఈ రోజు ఈ క్లిష్ట ప్రక్రియపై విశ్వాసాన్ని అంతర్జాతీయ సమాజం పునరుద్ధరించింది’ అని పేద ద్వీపదేశాల సంఘం అధ్యక్షుడు, ఆంటిగ్వా, బర్బుడాకు చెందిన మోల్విన్ జోసెఫ్ అన్నారు. ఇది మొత్తం ప్రపంచ విజయమని ఆయన అన్నారు. అయితే ఇది అంత సులభంగా జరగలేదని గ్రెనెడాకు చెందిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ చీఫ్ సైమన్ స్టీల్ అన్నారు. తాము రోజంతా కృషి చేశామని, ఈ ఒప్పందం తాము ముందుకు సాగేలా చేసిందని ఆయన అన్నారు. కాగా పర్యావరణ నిపుణులు ఈ ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందం పేద దేశాల ప్రజానీకానికి జీవనాడిలాంటిదని వారు అంటున్నారు.

ఈ ఒప్పందం ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అందించే విరాళాల ద్వారా ఈ పరిహార నిధిని ఏర్పాటు చేస్తారు. అయితే చైనాలాంటి ప్రధాన అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం మొదట్లో ఈ నిధి కోసం ఎలాంటి విరాళం ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ రాబోయే సంవత్సరాల్లో ఈ దేశాలు కూడా తమ వంతు చెల్లించడంపై చర్చలు జరగుతాయని సదస్సు నిర్వాహకులు అంటున్నారు. అయితే అమెరికాతో సమానంగా గ్రీన్‌హౌస్ ఉద్గారాలకు కారణమవుతున్న చైనా దీనిలో భాగస్వామి కాకపోవడంపై పలు దేశాలు అసంతృప్తితో ఉన్నాయి. అయితే ఈ ఒప్పందం ‘ఓ పెద్ద పుండుకు చిన్న ప్లాస్టర్ మాత్రమే’నని పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న గ్రీన్‌పీస్ జర్మనీ హెడ్ మార్టిన్ కైసర్ వ్యాఖ్యానించడం కొసమెరుపు.

Rich Nations agree climate aid to poor at COP27

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News