మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు ఎర కేసులో సిట్ అధినేత సివి ఆనంద్ నేతృత్వంలోని దూకుడు కొనసాగిస్తోంది. సిట్ అధికారులు ఏడు బృందాలుగా ఏర్పడి దాదాపు ఐదు రాష్ట్రాల్లో పర్యటించి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో సిట్ అధికారులు కేసులో అనుమానితులుగా భావిస్తున్న తుషార్, లాయర్ శ్రీనివాస్, జగ్గుస్వామిలతో పాటు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్‌కు నోటీసులు జారీ చేశారు. సోమవారం బిఎల్ సం తోష్‌తో సహా అందర్నీ హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించింది. బిఎల్ సంతోష్ స్వస్థలం కర్ణాటకలోని ఉడిపి కాగా.. బెంగళూరులోని మల్లేశ్వరం, టెంపుల్ స్ట్రీట్ చిరునామాతో నోటీసు జారీ అయింది.
కాగా, బిఎల్ సంతోష్, శ్రీనివాస్‌లకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్న మొబైల్ నెంబర్(94498 31415) అందుకు సంబంధించిన ఐఎంఈఐ నెంబర్(353846108969790) ఒకే విధంగా ఉంది. కాగా ఆ ఫోన్ నెంబర్ నుంచే ఎక్కువ సంప్రదింపులు జరిగాయని సిట్ అనుమానిస్తోంది. ఆ ఫోన్‌ను విశ్లేషిస్తే మరిన్ని ఆధారాలు లభిస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్ తిరుపతికి చెందిన టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో నిందితుడు సింహయాజులు స్వామీజీకి టికెట్ బుక్ చేశారన్న ఆరోపణపై నోటీసు జారీ చేశారు. శ్రీనివాస్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్నిహితుడు, అనుచరుడని చెబుతున్నారు. కాగా శ్రీనివాస్‌కు జారీ చేసిన నోటీసునే పేరు మార్చి బిఎల్ సంతోష్‌కు జారీ చేశారు. నోటీసులు జారీ చేసే క్రమంలో కాపీ పేస్ట్ చేస్తుండగా పొరపాటు దొర్లిందా? లేదా దర్యాప్తులో భాగంగా ఆ ఫోన్ నెంబర్ ఎవరిదగ్గర ఉందనే దానిపై కూపీ లాగేందుకే సిట్ అధికారులు ఆ విధంగా నోటీసులు పంపారా?
అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. నోటీసులు పంపిన వారందర్నీ 21నే విచారణకు రావాలని సిట్ ఆదేశించిన సంగతి విదితమే. మరోవైపు కొచ్చిలోని ఓ ఆశ్రమానికి చెందిన వైద్య కళాశాలలో పనిచేస్తున్న జగ్గు ఇంటికి సిట్ అధికారులు వెళ్లగా.. సమాచారాన్ని ముందే గ్రహించిన జగ్గుస్వామి అక్కడ్నించీ పరారయ్యాడు. దీంతో ఆయన ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించి 21న విచారణకు రావాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగనున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత చర్యలు చేపట్టారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న బిఎల్ సంతోష్ సిట్ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నదానిపై చర్చ కొనసాగుతోంది. బిఎల్ సంతోష్ విచారణకు ఓకే చెప్పిన హైకోర్టు.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బిఎల్ సంతోష్‌ను అరెస్టు చేయడానికి వీలులేదని సూచించింది. అయితే సిట్ దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు బిఎల్ సంతోష్‌ను ఆదేశించిన క్రమంలో బిఎల్ సంతోష్ విచారణకు వచ్చే అవకాశం ముందని సమాచారం.
నందకుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి..
టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో నిందితుడైన నందకుమార్ చుట్టూ సిట్ ఉచ్చు బిగుస్తోంది. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా నందకుమార్ బెదరింపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లుగా బంజారాహిల్స్‌కు చెందిన రియల్టర్ సిందెర్‌కర్ సతీష్ చేసిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సతీష్‌కు అతడి స్నేహితుడి ద్వారా 2017లో నందకుమార్ పరిచయమయ్యాడు. అప్పట్లో సతీష్ తరచూ నందకుమార్‌కి చెందిన ఫిల్మ్‌నగర్ రోడ్ నెంబర్ 1లోని ఫిల్మీ జంక్షన్ వెళ్లేవాడు. అయితే ఈ క్రమంలోనే తన ఆర్థిక ఇబ్బందుల దృష్టా సతీష్ వద్ద నుంచి డబ్బులు తీసుకునే నందు.. వాటిని మళ్లీ తిరిగి చెల్లించేవాడు. దీంతో నందుపై సతీష్‌ఖు నమ్మకం పెరిగింది. 2018లో వికారాబాద్ జిల్లా దోమ మండలంలో ఉన్న సుమారు 12 ఎకరాల భూమిని సతీష్ కొనుగోలు చేశారు. దీనికి నందు కమీషన్‌పై మధ్యవర్తిత్వం వహించాడు. డీల్ కుదిరిన తర్వాత ఆ మొత్తాన్ని యజమానికి చెల్లించాడు.
అయితే ఆ తర్వాత కమిషన్ వద్దని, తనకు భూమి ఇవ్వాలని నందకుమార్ డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే రూ.21 లక్షలను నందుకు సతీష్ చెల్లించాడు. అయితే అక్కడ భూమి ధరలు పెరగడంతో నందకుమార్ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. తెలంగాణలో రాబోయేది బిజెపి సర్కారేనని, తాను ఉప ముఖ్యమంత్రి అవుతానంటూ బెదిరించాడు. ఈ క్రమంలోనే సతీష్ మరికొంత డబ్బు చెల్లించినప్పటికీ నందకుమార్ బెదిరింపులు ఆపలేదు. టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో నందకుమార్ అరెస్టవ్వడంతో సతీష్ ధైర్యం తెచ్చుకుని అతని బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, వరుస కేసులు నమోదవుతుండటంతో నందకుమార్ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.