Friday, December 20, 2024

హృదయోల్లాస వీచిక సప్త పర్ణిక

- Advertisement -
- Advertisement -

కవిత్వం మనసును రంజింపజేసేలా, ఆలోచన కలిగించేలా, సామాజిక చైతన్యాన్ని రగిలించేలా ఉండాలి. మనసులోని భావాలను అందమైన అక్షర క్రమంలో పేర్చి, పాఠకులు అనుభూతికి లోనయ్యేలా రాసే నేర్పు కవులకు ఉండాలి. అలా పాఠకులకు ఒక చక్కని అనుభూతిని కలిగించే పుస్తకం ‘సప్త పర్ణిక‘. ఒకవైపు గృహిణిగా తనవంతు బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు తనకున్న బోధనానుభవంతో పాఠకుల హృదయాలను దోచుకునేలా సున్నితమైన సుకుమార భావాలతో ‘సప్త పర్ణిక‘ అనే కవితా సంపుటిని వెలువరించారు ప్రముఖ కవయిత్రి వనితారాణి నోముల.

అనేక సామాజిక అంశాలను, బంధాలను, అనుబంధాలను స్పృశిస్తూ సప్త పర్ణిక పుస్తకంలోని కవితలు సప్త వర్ణశోభితములా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉన్నాయి. బాల్యం నుండే కవిత్వం రాయడం అలవాటుగా ఉన్న వనితారాణి నోముల ఇందులోని ప్రతి కవితను చేయితిరిగిన కవిలా ఒక తపనతో, తన్మయంతో, ఆర్తితో, అనుభూతితో రాశారు. ఇందులో స్త్రీని కవితా వస్తువుగా చేసుకొని రాసిన కవితలు ఎక్కువగా ఉన్నాయి. మొదటి కవిత హాలిక శీర్షికన రాసిన కవితలోని కొన్ని పంక్తులు..
పొత్తి కడుపు పేగులు/ పిక్కటిల్లే రక్తజీరల రాగాలు పలికిస్తుంటే/ ఓర్పులో వసుధగా/ తన వారందరికీ తల్లో నాలుకౌను నారీ/ భూదేవికి ఉన్నంత ఓర్పు స్త్రీకి ఉంటుందంటారు. భూమి మనల్ని ఎలా భరిస్తుందో అంతే సహనంతో స్త్రీ ఉంటుంది. ఎన్నో కష్టాలను భరించి తన వారి సుఖము కొరకు పాటుపడుతుంది స్త్రీ. సముద్రంలో వచ్చే సుడిగుండాలలాగా కుటుంబంలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకొని సంసార సాగరాన్ని సాఫీగా కొనసాగేలా చూసే స్త్రీ తనకు కూసింత ఆప్యాయపు ఆచ్ఛాదనలు మాత్రమే కావాలని కోరుకుంటుందని అన్నారు.

నేలతల్లి కడుపులో/ నవరత్నాలు పండించే ప్రాణమొకటి/ రత్నాల రాసులకు/ రాజుగా జులుం చేసి/ దక్కించుకునే కండకావరం ఒకటి../ పాలేగాడి పానంలో శ్రమ జీవికి, భూస్వామికి ఉన్న వ్యత్యాసంను తెలుపుతూ రాసిన పంక్తులు ఆలోజింపజేసేలా ఉన్నాయి. సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను తెలుపుతూ కవయిత్రి శ్రామికపక్షం నిలిచారు.
యవ్వన వయసు విరహాన్ని సప్త పర్ణికలో, మిసిమి సొగసులు అరబోసే మందగామిని నీ నిత్య సహధర్మచారిణి అంటూ నీ చుట్టే ప్రాణంలో, మది గంటలు మ్రోగించే నా ఈ సోగ కళ్ళు అంటూ చూపుల శరాలులో, విరహాల తీపి రుచిని వస్తావు కదూ కవితల్లో చూపించారు వనితారాణి నోముల. చంద్రకళనై, ప్రేమఖైదీ కవితలలో ప్రేమలోని గొప్పతనమును, స్త్రీ హృదయ సౌందర్యమును ఆవిష్కరించిన తీరు బాగుంది.

మంద స్మితనై కవితలో బంతి, చేమంతి, గన్నేరు, జాజిమల్లి మొదలగు పూలతో స్త్రీ గుణాలను పోల్చిన తీరు కడు రమణీయం. తనో వేశ్య, గొప్పల దిబ్బ, ధీశాలి, నా ఎంకి, స్త్రీ పోలీస్ అయితే, మానరక్షక యజ్ఞం, అమృతమయి, ఓ అమ్మతనం, ఆడపిల్లంటే, అంతులేని కథ, సకల కళా వల్లభ, చేయూత, ఇనుపచువ్వల గోడ, ఆమె, మగువ, నన్ను కన్నందుకు మొదలగు కవితలలో కొన్ని స్త్రీల ఔన్నత్యాన్ని తెలుపగా మరికొన్ని స్త్రీల దుస్థితిని, ఆధునికకాలంలో వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను మనముందుంచారు.

జిహ్వజాన కవితలో…/ నరం లేకున్నా నరుల మధ్య బంధాలను/ దారాల్లా తెంపేసి/ నామరూపాలు లేకుండా చేయగల దిట్ట../ ఏ ఎండకా గొడుగు పడుతూ../ ఎవరి వద్ద వారి వంత పాట పాడుతూ../ అబ్బో నెరజాన../ మెలేసిన రెండునాలుకల ధోరణి కలిగిన జిహ్వ జాన…/ నాలుకను వస్తువుగా తీసుకొని రెండు విభిన్న తత్వాలను చిత్రించే ప్రయత్నం చేశారు కవయిత్రి. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మరొకటి మాట్లాడే రెండు నాల్కల ధోరణి గల వారిని గురించి కవయిత్రి రాసిన విధానం సమాజంలో కొందరి మనస్తత్వాలను ప్రతిబింబించేలా ఉంది.

పుట్టగానే ఆడపిల్లవి/ ఈడు పలకరించగానే/ నాన్న గుండెల్లో కుంపటివి/ భర్త చేతిలో అనురాగాల బొండు మల్లివి/ పిల్లల కైదండకు మురిసే మాతృత్వానివి కుటుంబానికి నీవో బాధ్యత శిఖరానివి../ వెనక్కి తిరిగి చుస్తే../ అస్తిత్వం ఆనవాళ్లు మచ్చుకైనా/ అగుపించని ఓ అనామికవి./ ఆడపిల్ల పుట్టినపప్పడు కొందరు తల్లిదండ్రులు భావించే తీరిది. ఆడపిల్లను పెంచి పెద్దచేసి ఒకరి చేతిలో పెట్టాక ఆ కుటుంబం కొరకు తను ఎన్నో త్యాగాలను చేస్తుంది. కుటుంబ బాధ్యతలు చూసుకోవడంలో పర్వతం అంత ఎత్తులో ఉండే స్త్రీ గతంలోకి వెళ్లి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే తన గురించి తాను చేసుకున్న ఒక్క పని కూడా కనిపించదని అంటారు.

సంసారం ఓ మనోహర కావ్యం, నవక్రాంతి, ముల్లై గుచ్ఛనంత దాకా కవితలు అందమైన బంధాలను, అనుబంధాలను చూపాయి. రాగిణినై కవితలో/ రాణినే నీ మనో సామ్రాజ్యానికి/ రాజువై ఏలేవు/ ఈ రాగిణి మనసే/ వెరసి రసరమ్య సంసార/ కావ్య గీతికే.. / భర్త మనోఫలకంలో స్త్రీ రాణిలాగా ఉండాలని కోరుకుంటుంది. భార్యభర్తలిరువురు ఒకరికొకరు అర్థం చేసుకుంటేనే, మూడుముళ్ళకి అర్థం పరమార్థం ఉంటుందని దాంపత్య జీవిత సత్యం తెలిపారు. ఇలా సప్త పర్ణికలో ఎన్నో మంచి కవితలు ఉన్నాయి. అవన్నీ హృదయానికి ఉల్లాసాన్ని కలిగించేవే, హృదయాన్ని కదిలించేవే. హృదయాన్ని హత్తుకునేవే.

అక్షరూపం కవితలో../ అక్షరాలంతే../ ఆలోచనల సాగుచేస్తూ/ భావాలపంటను బంగారంలా పండిస్తాయ్../ అని చెపుతూ ఆలోచనలను అక్షర రూపంలో పెడితే అవే మనిషి అస్తిత్వానికి బాటలు వేస్తాయని అంటారు./ మానవుడే మాధవుడు అంటారు. కానీ ఎంతమందికి ఎదుటివారిలో దేవుడిని చూసే గుణం ఉంటుంది. ప్రతి మనిషిలోను పరమాత్ముని గాంచె పునీతాలు నా భావాలు అని కవయిత్రి వనితారాణి పేర్కొన్న విధానంను బట్టి ఆమె సహృదయతను అర్థం చేసుకోవచ్చు.
పుస్తకం చివరలో వలస కూలీలు పాట కరోనా కాలంలో చితికిపోయిన వలస కూలీల జీవితాన్ని తెలియజేయగా, పల్లె పిలుస్తోంది పాట ఉపాధి కొరకు గల్ఫ్ వెళ్లిన కొడుకు గురించి ఓ తల్లి పడిన ఆవేదనను తెలియజేసింది. ఈ పుస్తకానికి డా. అమ్మంగి వేణుగోపాల్, మౌన శ్రీ మల్లిక్, వైరాగ్యం ప్రభాకర్, నిర్మలరాణి తోట అందించిన ముందుమాటలు కవయిత్రికి స్ఫూర్తినిచ్చేలా, పుస్తకానికి మరింత వన్నెతెచ్చేలా ఉన్నాయి. వనితారాణి నోముల కలం నుండి భవిష్యత్తులో మరెన్నో మంచి రచనలు రావాలని ఆశిస్తూ వారికి అభినందనలు.

సప్త పర్ణిక పుస్తకం వెల రూ.100/
ప్రతులకు..
వనితారాణి నోముల,
ఇం. నెం. 3-7-225, వావిలాల పల్లి,
కరీంనగర్ జిల్లా. 505 001, 966674024.

కందుకూరి భాస్కర్
9703487088

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News